- సీనియర్లకు మింగుడు పడని రేవంత్ నియామకం
- గీత దాటితే వేటు తప్పదని హెచ్చరించినా..
- తమ పని తాము చేసుకుంటున్నఅసంతృప్తి వాదులు
- ప్రాధాన్యమివ్వని పార్టీ పెద్దలు
- అధికారం సాధిస్తామనే భరోసా కల్పించే ప్రయత్నాలు..
విధాత: పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డిని నియమించిన తర్వాత కొంతమంది సీనియర్లు అధిష్ఠానం తీసుకున్ననిర్ణయంపై పెదవి విరిచారు. తమ అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేశారు. వీహెచ్, కోమటిరెడ్డి బ్రదర్స్, జగ్గారెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి లాంటి వాళ్లు అయితే రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్యం ఠాకూర్‌పై తీవ్రమైన విమర్శలు చేశారు.
పార్టీ నేతలకు జీర్ణం కాని రేవంత్ నిర్ణయం
దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న తమను కాదని టీడీపీ నుంచి వచ్చిన రేవంత్‌కు పెద్దపీట వేయడాన్ని వాళ్లు జీర్ణించు కోలేకపోయారు. అయితే వీళ్ల బెదిరింపులను, విమర్శలను కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దగా పట్టించుకోలేదు. రేవంత్‌కు పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది. రాష్ట్రంలో కేసీఆర్‌ను ఎదుర్కొవాలంటే ఆయనే సరైన వ్యక్తి అని సోనియా, రాహుల్‌గాంధీ భావించి ఉండవచ్చు.
అధిష్ఠానం వైఖరి నచ్చకనే పార్టీల మార్పు
దీంతో కొంతకాలం ఆ అంశం సద్దుమణిగినట్టు కనిపించినా కోమటిరెడ్డి బ్రదర్స్, జగ్గారెడ్డి లాంటి వాళ్లు అప్పుడప్పుడు రేవంత్‌పై మీడియా వేదికగా ధ్వజమెత్తిన సందర్భాలున్నాయి. దీనిపై స్పందించిన అధిష్ఠానం పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉన్నది కదా అని మీడియా ముందు ఏది పడితే అది మాట్లాడటానికి వీల్లేదని, గీత దాటితే వేటు వేస్తామని హెచ్చరించింది. రేవంత్‌తో కలిసి పనిచేయ లేక, అధిష్ఠానం వైఖరి నచ్చక రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి, కాషాయ కండువా కప్పుకున్నారు. అదే బాటలో దాసోజు శ్రవణ్, పల్లె రవికుమార్ గౌడ్ లాంటి వాళ్లు మునుగోడు ఉప ఎన్నిక సందర్భంలో జంప్ అయ్యారు.
పార్టీపై బహిరంగ విమర్శలు
తాజాగా మర్రి శశిధర్ రెడ్డి పార్టీని వీడుతూ.. కాంగ్రెస్ పార్టీకి క్యాన్సర్ సోకిందని, రేవంత్ రెడ్డి వైఖరి సరిగాలేదని ఆరోపణలు చేశారు. జగ్గారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలకు కూడా రేవంత్‌తో పొసగడం లేదనే విషయం బహిరంగ రహస్యమే అని చెప్పవచ్చు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా వెంకట్‌రెడ్డి నాలాంటి హోంగార్డులు ప్రచారం చేసినా కాంగ్రెస్ పార్టీ గెలవదని కుండబద్దలు కొట్టారు.
ఎవరు ఏ పార్టీలోకి..
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని ఇంకా ఎంత మంది నేతలు వీడుతారు? ఎవరు ఏ పార్టీలో చేరుతారు? అన్న చర్చ జరుగుతున్నది. మరోవైపు పార్టీలో అసంతృప్తి నేతల ఆగ్రహాన్ని చల్లార్చడానికి అధిష్టాన పెద్దలు అప్పుడప్పుడు కొంత ప్రయత్నం చేసినా.. వెళ్లే వాళ్లు ఎలాగూ వెళ్తారు. కాబట్టి పార్టీ వీడే వారి గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నట్టే ఉన్నది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో సంస్కరణలు అవసరమని తిరుగుబాటు చేసిన జీ 23 మంది కాంగ్రెస్ జాతీయ నేతలనే లైట్ తీసుకున్నది. ఆ జాబితాలో ఉన్న గులాంనబీ ఆజాద్, అనంద్ శర్మ, కపిల్ సిబాల్ లాంటి వాళ్లు పార్టీకి రాజీనామా చేసినా పట్టించుకోలేదు.
పాత తరం పోతే.. కొత్త తరం..
ఈ పరిణామాలన్నీ గమనిస్తే కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం కమిట్‌మెంట్ ఉన్నవాళ్లు అయితేనే పార్టీలో ఉంటారు. బ్లాక్ మెయిల్ చేసేవాళ్లను ఎంత బుజ్జగించినా ప్రయోజనం ఉండదని భావిస్తూ ఉండవచ్చు. అందుకే చాలామంది సీనియర్లు పార్టీ వీడుతున్నా ఆ విషయానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. పాత తరం పోతే కొత్త తరం వస్తుంది. పార్టీ అధికారంలోకి వస్తే భవిష్యత్తు ఉంటుందనే భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తున్నది.