- పిల్లల ముందే తుపాకీతో కాల్చి చంపిన భర్త
- ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో దారుణం
విధాత: హత్యాయత్నం కేసులో అతడు జైలు పాలయ్యాడు. అనేక కష్టాలకోర్చి, లాయర్ ఖర్చులు భరించి భర్తను బెయిల్‌పై బయటకు తీసుకొచ్చింది భార్య. కానీ, అనుమానంతో భార్యను భర్త తుపాకీతో కాల్చి చంపాడు. కన్న బిడ్డల ముందే ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. ప్రేమించి, పెద్దలను ఎదిరించి, పెండ్లి చేసుకొని ఇద్దరు పిల్లలకు తల్లి అయిన ఆమె.. భర్త తుపాకీ తూటాలకు బలైంది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని బరేలీ (Bareilly)లో శనివారం చోటు చేసుకున్నది.
బరేలీకి చెందిన కృష్ణపాల్ లోధి (40), పూజ(32) ప్రేమించుకున్నారు. 2012లో పారిపోయి పెండ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. హత్యాయత్నం కేసులో కృష్ణపాల్ జైలు పాలయ్యాడు. భార్య పూజ ష్యూరిటీ ఉండి అతడికి బెయిల్ ఇప్పించింది.
15 రోజుల క్రితమే జైలు నుంచి విడుదలైన కృష్ణపాల్ శనివారం సాయంత్రం ఫతేగంజ్‌లో రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతంలో భార్యపై తుపాకీతో కాల్పులు జరిపాడు. అలాగే ఆమె స్నేహితుడు మున్నాపై కూడా కాల్చాడు. ఆమె అక్కడికక్కడే రక్తపు మడుగులో పడి చనిపోగా, మున్నా దవాఖానలో చికిత్స పొందుతున్నాడు.
నిందితుడు కృష్ణపాల్‌ను అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు. అతడి నుంచి దేశవాలీ తుపాకీని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వివిధ సెక్షన్ల కింద అతడిపై అభియోగాలు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. భార్య తనను మోసం చేసిందనే కారణంతోనే కాల్చి చంపినట్టు నిందితుడు ఆరోపించారు.
హత్య ఘటనపై మృతురాలు పూజ తల్లి శీలాదేవి స్పందించారు. @మద్యానికి బానిసగా మారిన కృష్ణపాల్.. రోజూ తాగి వచ్చి రాత్రి వేళ నా బిడ్డను కొట్టేవాడు. శనివారం రాత్రి కూడా పూటుగా తాగివచ్చి పూజను తిట్టి కొట్టాడు. తుపాకి తీయగా.. అతడి బారి నుంచి తప్పించుకొనేందుకు ఇంటి నుంచి ఆమె బయటకు పరుగు తీసింది. కానీ, వెంబడించిన అతడు పిల్లల ముందే తుపాకీతో కాల్చి చంపాడు* అని వివరించింది. కృష్ణపాల్‌ను అతడికి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది.