- శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో అరెస్ట్
- సుబేదారి పోలీస్ స్టేషన్‌కు తరలింపు
- స్టేషన్ వద్ద బీఆర్ఎస్ శ్రేణుల నిరసన
- కోర్టులో హాజరుపర్చిన పోలీసులు
- బెయిల్ మంజూరు చేసిన కోర్టు
వరంగల్ ప్రతినిధి, విధాత: క్వారీ యజమానిని బెదిరించిన కేసులో అరెస్టయిన బీఆర్ఎస్‌కు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి వరంగల్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో శుక్రవారం రాత్రి కౌశిక్‌రెడ్డిని అరెస్టు చేసిన వరంగల్ సుబేదారీ పోలీసులు.. వరంగల్ తీసుకొచ్చారు. హన్మకొండ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం పరిధిలోని కమలాపూర్ మండలం వంగలపల్లిలో గ్రానైట్ క్వారీ నిర్వహిస్తున్న మనోజ్‌రెడ్డిని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి 50 లక్షలు రూపాయలు డిమాండ్ చేస్తూ బెదిరింపులకు పాల్పడినట్లుగా క్వారీ యజమాని భార్య గతంలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు విచారణ సాగించారు. కౌశిక్‌రెడ్డి బెదిరింపులకు పాల్పడింది నిజమేనని తేలింది. దీనిపై కౌశిక్ రెడ్డి క్వాష్ పిటిషన్ వేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో ఆయనను శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో అరెస్టు చేశారు.
బీఆరెస్ నేతలను అడ్డుకున్న పోలీసులు
ఈ విషయం తెలిసి శనివారం ఉదయం కౌశిక్ రెడ్డిని కలవడానికి సుబేదారి పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు వినయ్‌భాస్కర్, ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యేను కోర్టులో హాజరపరచకుండా అక్రమంగా నిర్బంధించడం ఏంటని వినయ్‌భాస్కర్ పోలీసుల తీరుపై మండిపడ్డారు. పోలీసులు లోనికి వెళ్లేందుకు నిరాకరించడంతో ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే పోలీసులకు, బీఆర్ఎస్ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తూ బైఠాయించారు. తన అరెస్టుకు కాంగ్రెస్ కుట్ర చేసిందని కౌశిక్ రెడ్డి విమర్శించారు.
క్వారీలో అక్రమాలు జరుగుతున్నాయని, మంత్రి సీతక్క, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాగరాజు లకు క్వారీ యజమాని బినామీగా వ్యవహరిస్తున్నట్టు తీవ్ర ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని కాజీపేట లోని రైల్వే కోర్టులో హాజరు పరిచారు జిల్లా కోర్టు జడ్జి సెలవులో ఉన్నందున రైల్వే కోర్టులో హాజరు పరిచినట్లు పోలీసులు వెల్లడించారు. కోర్టులో హాజరు పరిచే దానికి ముందు వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ లో వైద్య పరీక్షలు నిర్వహించారు. కౌశిక్ రెడ్డి అరెస్టు సందర్భంగా బీఆరెస్ శ్రేణులు పలుచోట్ల నిరసన వ్యక్తం చేశాయి. చివరకు కౌశిక్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ లభించింది.
కౌశిక్ రెడ్డి అరెస్టు అక్రమం: బీఆర్‌ఎస్
కౌశిక్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా, అక్రమంగా అరెస్టు చేసిందని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్, మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. వేర్వేరుగా వారు మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయిందని ఎర్రబెల్లి విమర్శించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి కంట్రోల్లో లేరని ఆరోపించారు. సమస్యలను పరిష్కరించలేక అక్రమ అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు. ఇదిలా ఉండగా ఈ అరెస్టును బీఆర్ఎస్ నాయకులు కేటీ రామారావు, హరీష్ రావు సైతం ఖండించారు.
చోటే చోర్ కి బడే చోర్ మద్దతు: కాంగ్రెస్
చోటే చోర్ కి బడే చోర్ మద్దతు ఇవ్వడం హాస్యాస్పదమని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, రేవూరి ప్రకాశ్ మండిపడ్డారు. ‘బెదిరిస్తారు.. దోచుకుంటారు.. మోసం చేస్తారు.. అదేమని అడిగితే జై తెలంగాణ అంటూ ఉద్యమం పేరుతో ముందుకు వస్తారు. పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్కి ముఖ్యమంత్రికి ఏమైనా సంబంధం ఉందా?’ అని వారు మండిపడ్డారు. దోచుకున్న నాయకున్ని అరెస్ట్ చేస్తే హడావిడి చేస్తున్నారని విమర్శించారు. అమెరికా నుంచి వచ్చిన దొంగల ముఠా సభ్యుడి విచారణలో వాస్తవాలు బయటపడుతున్నాయని చెప్పారు. బీఆర్‌ఎస్ నాయకులు తిన్న ప్రతి పైసాను కక్కిస్తామని హెచ్చరించారు. చట్టం తనపని తాను చేసుకుంటుందనీ.. త్వరలోనే కేసీఆర్ కుటుంబం జైలుకు పోతుందని అన్నారు.