Telangana Gram Panchayat Funds | తెలంగాణ గ్రామ పంచాయతీలకు మరో రూ.640 కోట్లు

తెలంగాణ గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం పెండింగ్ బకాయిలు రూ.640 కోట్లు విడుదల చేసింది. దీంతో 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పెండింగ్ బకాయిల చెల్లింపు పూర్తయ్యింది. ఇక 2025–26కు సంబంధించి ఇంకా రూ.1,255 కోట్లు విడుదల కావాల్సి ఉంది.

Panchayat Raj Funds

విధాత : తెలంగాణ గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం పెండింగ్ బకాయిలు రూ.640 కోట్లు విడుదల చేసింది. ఇంతకుముందు కూడా కేంద్రం రూ.640 కోట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పెండింగ్ బకాయిల చెల్లింపు పూర్తయ్యింది. ఇక 2025–26కు సంబంధించి ఇంకా రూ.1,255 కోట్లు విడుదల కావాల్సి ఉంది. ఈ నిధులను త్వరితగతిన విడుదల చేయాలని మంత్రి సీతక్క కేంద్రాన్ని కోరారు.

ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డా.ద‌న‌స‌రి అన‌సూయ‌ సీతక్క మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అవసరమైన యుటిలిటీ సర్టిఫికెట్లు (UCs), ఇతర నివేదికలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తున్నందున నిధుల విడుదల ప్రక్రియ వేగవంతమైందన్నారు. గ్రామ పంచాయతీల అభివృద్ధికి సంబంధించిన పనులను పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా అమలు చేస్తున్నందుకు గుర్తింపుగా కేంద్రం ఈ నిధులను విడుదల చేసినట్లు తెలిపారు.

అయితే, 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సుమారు రూ.1255 కోట్లు ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సి ఉందని మంత్రి పేర్కొన్నారు. గ్రామ పంచాయతీలలో కొనసాగుతున్న అభివృద్ధి పనులకు ఆ నిధులు అత్యంత అవసరమని తెలిపారు. ఈ నేపథ్యంలో పెండింగ్‌లో ఉన్న నిధులను కూడా త్వరితగతిన విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు.

15వ ఆర్థిక సంఘం గడువు మరో 15 రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో మిగిలి ఉన్న బకాయిలను ఆలస్యం చేయకుండా విడుదల చేయాలని కేంద్రాన్ని ఆమె కోరారు. నిధులు సమయానికి విడుదలైతే గ్రామ స్థాయిలో మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగంగా కొనసాగుతుందని మంత్రి పేర్కొన్నారు.

ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులను నిబంధనలకు అనుగుణంగా గ్రామ పంచాయతీల్లో ఖ‌ర్చు చేస్తామ‌ని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. గ్రామాలలో ఇప్పటికే చేపట్టిన పనులు, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, మౌలిక వసతుల అభివృద్ధి వంటి కార్యక్రమాలకు ఆయా సమయాల్లో చేసిన ఖ‌ర్చుకు అనుగుణంగా బిల్లులు చెల్లిస్తామ‌ని ఆమె వెల్లడించారు.

గ్రామ పంచాయతీల బలోపేతం ద్వారా గ్రామీణాభివృద్ధి వేగవంతం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించి మిగిలిన నిధులను త్వరగా విడుదల చేస్తే గ్రామాల అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగం అందుకుంటాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి :

gold, silver price drop| పడిపోయిన పసిడి, వెండి ధరలు!
TG Tenth Exams | తెలంగాణ వ్యాప్తంగా ‘ప‌ది’ ప‌రీక్ష‌లు ప్రారంభం..

Latest News