Ampaseyya Naveen | కవి ఎప్పటికీ కష్టజీవి పక్షాన్నే ఉండాలి : అరసం సభలో అంపశయ్య నవీన్

కవి ఎప్పటికీ కష్టజీవిపక్షాన్నే ఉండాలని, కవిత్వం ప్రజల భాషలోనే ఉండాలని కేంద్ర సాహిత్య అకాడ‌మీ అవార్డు గ్ర‌హీత అంప‌శ‌య్య న‌వీన్ అన్నారు. అఖిల భారత అభ్యుదయ రచయితల సంఘం 90వ‌ ఆవిర్భావ దినోత్సవం గురువారం హనుమకొండలోని ఆదర్శ న్యాయ కళాశాలలో నిర్వ‌హించారు.

  • Publish Date - April 10, 2025 / 08:17 PM IST

Ampaseyya Naveen | కవి ఎప్పటికీ కష్టజీవిపక్షాన్నే ఉండాలని, కవిత్వం ప్రజల భాషలోనే ఉండాలని కేంద్ర సాహిత్య అకాడ‌మీ అవార్డు గ్ర‌హీత అంప‌శ‌య్య న‌వీన్ అన్నారు. అఖిల భారత అభ్యుదయ రచయితల సంఘం 90వ‌ ఆవిర్భావ దినోత్సవం గురువారం హనుమకొండలోని ఆదర్శ న్యాయ కళాశాలలో నిర్వ‌హించారు. అరసం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్ట‌ర్ పల్లేరు వీరాస్వామి అధ్యక్షతన జరిగిన సభలో ఆయ‌న ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా న‌వీన్ మాట్లాడుతూ.. భారతస్వాతంత్రోద్యమ స్ఫూర్తితో బ్రిటిష్ వలసవాద దోపిడీకి, అణిచివేతకు వ్యతిరేకంగా తమ కలాలను ఎక్కుపెట్టడానికి, ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి  ఏప్రిల్ 9, 10 తేదీలలో 1936లో లక్నోలో జరిగిన స‌మావేశంలో అఖిల భారత అభ్యదయ రచయితల సంఘం ఏర్పడిందని గుర్తు చేశారు. ఇప్పుడు 90వ వార్షికోత్స‌వం నిర్వ‌హ‌ణ‌పై సంతోషం వ్య‌క్తం చేశారు. అరసం పునాదులు 1935లోనే లండన‌లో ప‌డ్డాయ‌ని చెప్పారు. గోపీచంద్, శ్రీ శ్రీ, తాపీ ధర్మారావు లాంటివాళ్ళు అరసంలో పనిచేశారని గుర్తు చేశారు. ఇంకా అభ్యదయ కవిత్వం సమాజంలో ఇంకా సజీవంగా నే ఉందని న‌వీన్ చెప్పారు.  కవి ఎప్పటికీ కష్టజీవిపక్షాన్నే ఉండాలని, కవిత్వం ప్రజల భాషలోనే ఉండాలని అన్నారు.

విశిష్ట అతిథిగా హాజరైన ప్రముఖ కవి , విమర్శకులు ఆచార్య బన్న ఐలయ్య మాట్లాడుతూ నాడు లక్నోలో జరిగిన ప్రారంభ సభలో పాల్గొన్న జవహర్‌లాల్ నెహ్రూ.. కవిత్వం అనేది పాపం-పుణ్యం-పునర్జన్మ నుండి బయట పడాలని, మనిషి కేంద్రంగా కవిత్వం ఉండాలన్న మాటలను గుర్తు చేశారు. నాడు రవీంద్రనాథ్ ఠాగూర్, ములక రాజ్ ఆనంద్, గోపీచంద్, శ్రీశ్రీ, గురజాడ అప్పారావు లాంటివారు చరిత్రను మలుపుదిప్పడంలో కీలక భూమిక పోషించార‌ని చెప్పారు. అరసం జాతీయ కార్యదర్శి వేల్పుల నారాయణ మాట్లాడుతూ దేశంలో నాడు ఏ పరిస్థితులు ఉన్నాయో ఇప్పటికీ అవే పరిస్థితులు ఉన్నాయని అన్నారు. మతోన్మాదానికి వ్యతిరేకంగా, ఫాసిజానికి వ్యతిరేకంగా కవులు తమ గళాలను విప్పాలని పిలుపునిచ్చారు. స్వాతంత్య్రం సాధించి 75 ఏళ్ళు దాటినా ఇంకా అణిచివేత కొనసాగుతూనే ఉన్న‌ద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. భారత రాజ్యాంగాన్ని ఇంకా పటిష్టం చేయాల్సిందిపోయి దానికి పాలకులు తూట్లు పొడుస్తున్నారని విమ‌ర్శించారు.

ఈ కార్యక్రమంలో పల్లేరు వీరస్వామి రచించిన ‘వీ క్షణాలు’ కేవీఎల్ రచించిన ‘కామ్రేడ్ లింగమ్మ’ పుస్తకాన్ని అంపశయ్య నవీన్ , ఆచార్య బన్న ఐలయ్య ఆవిష్కరించారు. ఈ పుస్త‌కాన్ని అర‌సం ఉపాధ్యక్షురాలు చందనాలు సుమిత్ర స‌మీక్షించారు. సభలో తెలంగాణ రాష్ట్ర కార్య నిర్వాహక కారదర్శి కేవీఎల్, ప్రముఖ రచయిత్రి అనిశెట్టి రజిత, నిధి, బూర భిక్షపతి, బూర విద్యాసాగర్, డాక్టర్ పాంచాల్ రాయ్ ప్రసంగించారు. న్యాయవాది ఏరుకొండ జయ శంకర్, హనుమకొండ భారత్ బచావో చైర్మన్ రామ బ్రహ్మం, వెంగల్ రెడ్డి, కోడెం కుమారస్వామి, డాక్టర్ వెంకటి, కాసర్ల రంగారావు, బండి సూర్యనారాయణ, వెంకటయ్య, గుడికందుల ప్రకాష్, గజ్జెల స్వరూప, మంజుల తదితరులు పాల్గొన్నారు. ఈ  కార్యక్రమం నిర్వాహకులుగా డాక్టర్ మార్క శంకర్ నారాయణ వ్యవహరించారు.