ముంబై-నాగపూర్‌ సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం.. ఏడుగురు మృతి

ముంబై-నాగపూర్‌ ఎక్స్‌ప్రెస్‌వే (సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వే)పై ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. రెండు కార్లు ఢీకొనడంతో ఏడుగురు చనిపోయారు.

  • Publish Date - June 29, 2024 / 05:44 PM IST

ముంబై: ముంబై-నాగపూర్‌ ఎక్స్‌ప్రెస్‌వే (సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వే)పై ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. రెండు కార్లు ఢీకొనడంతో ఏడుగురు చనిపోయారు. పలువురికి గాయాలయ్యాయి. మహారాష్ట్రలోని జల్నా జిల్లాలోని కడవంచి గ్రామీ సమీపంలో శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. బాధితులు ముంబైలోని తుర్పు మలాద్‌, బుల్ధానా జిల్లాలకు చెందినవారని పోలీసులు తెలిపారు. ‘నాగపూర్‌ నుంచి ముంబై వెళుతున్న మల్టీ యుటిలిటీ వెహికల్‌ (ఎంయూవీ) ఎదురుగా వచ్చి మరోకారును ఢీకొనడంతో ఆరుగురు అక్కడికక్కడే చనిపోయారు. మరొకరు హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరణించారు’ అని ఒక పోలీసు అధికారి తెలిపారు.

రోడ్డు క్రాష్‌ బారియర్‌కు ఎడమవైపు ఎంయూవీ వెళ్లిపడటం ప్రమాద తీవ్రతను సూచిస్తున్నది. విషయం తెలియగానే స్థానిక గ్రామస్థులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. నుజ్జునజ్జయిన వాహనాల్లో చిక్కుకుపోయినవారిని బయటకు తీశారు. ఆరు మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తీసుకువచ్చారని జల్నా ప్రభుత్వ జిల్లా హాస్పిటల్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ ఉమేశ్‌ జాదవ్‌ చెప్పారు. గాయపడిన ముగ్గురికి చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. చావుబతుకుల్లో ఉన్న ఒక వ్యక్తిని ఛత్రపతి శంభాజీనగర్‌ జిల్లా లోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ, హాస్పిటల్‌కు తరలించగా.. ఆయన అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు. చనిపోయినవారిలో ముగ్గురు ముంబైకి చెందినవారు. మిగిలినవారు బుల్దానా జిల్లా వాసులు. ఛత్రపతి శంభాజీనగర్‌ హాస్పిటల్‌లో చనిపోయిన వ్యక్తి ఎవరన్నది ఇంకా అధికారులు ధృవీకరించలేదు. గాయపడిన ముగ్గురు ముంబైకి చెందినవారు. ముంబై, నాగపూర్‌ నగరాలను కలిపే సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వే ఆరు లేన్లతో కూడి, 701 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. నాగపూర్‌, షిర్డిలను కలిపే తొలి దశ హైవే ప్రాజెక్టును 2022 డిసెంబర్‌లో ప్రారంభించారు.

Latest News