తెలంగాణలో పోటాపోటీ! బీఆరెస్‌కు గెలుపు అంత ఈజీ కాదు!

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలైన వేళ ఏబీసీ సీ వోటర్‌ సర్వే కాంగ్రెస్‌కు శుభవార్త చెప్పింది. బీజేపీకి మింగుడు పడని ఫలితాలను అందింది.

తెలంగాణలో పోటాపోటీ!

గరిష్ఠంగా 60 స్థానాల్లో కాంగ్రెస్‌ విజయం

43-55 మధ్య బీఆరెస్‌కు స్థానాలు

ఎంఐఎం లేదా బీజేపీ మద్దతిస్తే హ్యాట్రిక్‌!

మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌కే చాన్స్‌

మిజోరంలో హంగ్‌ అసెంబ్లీ దిశగా ఫలితం

జెడ్పీఎం కలిసొస్తే కాంగ్రెస్‌ సంకీర్ణం

ఒక్క రాజస్థాన్‌లోనే బీజేపీ విజయం

ఏబీపీ -సీవోటర్‌ సర్వేలో వెల్లడి

న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలైన వేళ ఏబీసీ సీ వోటర్‌ సర్వే కాంగ్రెస్‌కు శుభవార్త చెప్పింది. బీజేపీకి మింగుడు పడని ఫలితాలను అందింది. తెలంగాణలో హోరాహోరీ పోరు సాగుతుందని, ఇక్కడ ఏకైక పెద్ద పార్టీగా కాంగ్రెస్‌ అవతరించే అవకాశాలు ఉన్నాయని సర్వేలో వెల్లడైంది. మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్‌కే అవకాశాలున్నాయని తేలింది. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న రాజస్థాన్‌.. ఈసారి బీజేపీ ఖాతాలో పడనున్నట్టు స్పష్టంగా తేలింది. మిజోరంలో హంగ్‌ అసెంబ్లీ ఏర్పడుతుందని వెల్లడించింది. అయితే.. ఇక్కడ కీలకమైన జెడ్పీఎం కనుక కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తే.. అది కూడా కాంగ్రెస్‌ ఖాతాలో చేరే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు తాజా పరిస్థితులపై ఈ నెల మొదటివారంలో ఈ ఐదు రాష్ట్రాల్లో చేసిన సర్వే వివరాలను ఏబీపీ లైవ్‌ సోమవారం విడుదల చేసింది.

తెలంగాణలో కాంగ్రెస్‌కే ఆధిక్యం

తెలంగాణలో హ్యాట్రిక్ విజయం సాధించి వరుసగా మూడోసారి అధికారంలోకి వస్తామన్న ధీమాతో ఉన్న బీఆరెస్‌కు విజయం అంత ఆషామాషీ కాదని వెల్లడైంది. రాష్ట్రంలోని 119 స్థానాలకు గాను బీఆరెస్ 43 నుంచి 55 స్థానాలు గెలుచుకుని మెజార్టీకి దూరంగా ఉండిపోతుందని ఏబీపీ-సీవోటర్‌ సర్వే అంచనా వేసింది. కాంగ్రెస్ పార్టీ 48 నుంచి 60 స్థానాలు గెలుచుకుంటుందని వెల్లడించింది. బీజేపీ 5 నుంచి 11 స్థానాలకే పరిమితమవుతుందని, ఇతరులు 5 నుంచి 11 స్థానాలు సాధిస్తారని ఈ సర్వే తెలిపింది. ఓట్ల శాతం పరంగా చూస్తే కాంగ్రెస్ పార్టీకి 39 శాతం ఓట్లు లభించే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నది. బీఆరెస్‌కు 9.4 శాతం ఓట్లు తగ్గిపోయి 37 శాతం వద్ద ఉంటుందని అంచనా వేసింది. ఇక బీజేపీకి 16 శాతం ఓట్లు రానున్నాయని తెలిపింది. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, జేపీ నడ్డా సహా కేంద్ర మంత్రుల వరుస పర్యటనలు, సభలు నిర్వహిస్తున్నా తెలంగాణలో బీజేపీ డబుల్ డిజిట్‌ సాధించడమే గొప్ప అని ఏబీపీ-సీవోటర్ సర్వేతో స్పష్టమవుతున్నది. తెలంగాణలో మెజార్టీ మార్కు 60. సర్వే అంచనా ప్రకారం కాంగ్రెస్‌కు గరిష్ఠంగా 60 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ.. బీఆరెస్‌ 43 నుంచి 55 స్థానాలు మాత్రమే గెలుచుకుంటుందని సర్వే పేర్కొంటుండటం ఆసక్తికరంగా కనిపిస్తున్నది. బీఆరెస్‌కు సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు ఈ పరిస్థితిలో కనిపించడం లేదన్నది దీని సారాంశం. కనుక.. సర్వేలో తేలినట్టు కనీసం 55 స్థానాల్లో బీఆరెస్‌ గెలిచి, ఎంఐఎం మద్దతు ఇస్తే అధికారం చేపట్టే వీలు ఉంది. కాంగ్రెస్‌ను అధికారానికి దూరం పెట్టే లక్ష్యంతో బీజేపీ కూడా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మద్దతు ఇస్తే.. బీఆరెస్‌కు ఢోకా ఉండదు. అయితే.. తాను బీజేపీకి, కాంగ్రెస్‌కు సమాన దూరం పాటిస్తానని బీఆరెస్‌ చెబుతున్నది. ఎంఐఎం మద్దతు ఇచ్చినా ప్రభుత్వ ఏర్పాటుకు తగినన్ని స్థానాలు లభించని పక్షంలో బీఆరెస్‌ ఏం చేస్తుందనేది ప్రశ్న. బీజేపీ మద్దతు తీసుకుంటే రాజకీయంగా తీవ్ర విమర్శల పాలవక తప్పదు. పైగా.. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో దాని ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది. బీజేపీ మద్దతును బీఆరెస్‌ తీసుకుంటే.. వాటి మధ్య లోపాయికారి ఒప్పందం ఉన్నదన్న విమర్శలు నిజమవుతాయి. ఇది బీఆరెస్‌కు లోక్‌సభ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలనే ఇస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల వాస్తవ ఫలితాలపై మరింత ఆసక్తి రేగుతున్నది.

ఛత్తీస్‌గఢ్‌ మళ్లీ కాంగ్రెస్‌కే

ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీలోని 90 స్థానాల్లో కాంగ్రెస్‌కు 45 నుంచి 51 స్థానాలు దక్కనున్నాయని ఏబీపీ-సీ-ఓటర్ సర్వే తెలిపింది. బీజేపీకి 39 నుంచి 45 స్థానాలు, ఇతరులకు 0-2స్థానాలు దక్కుతాయని సర్వే తెలిపింది. కాంగ్రెస్‌కు 45.3శాతం, బీజేపీకి 43.5శాతం, ఇతరులకు 11.2శాతం ఓటింగ్ నమోదవ్వనున్నట్లుగా అంచనా వేసింది. పోరు హోరాహోరీగా ఉన్నా.. ఇక్కడ కాంగ్రెస్‌కే గెలుపు ఖాయంగా కనిపిస్తున్నది.

కాంగ్రెస్‌ ఖాతాలోకి మధ్యప్రదేశ్‌!

మధ్యప్రదేశ్ అసెంబ్లీలో 230 స్థానాలకుగాను కాంగ్రెస్ 113 నుంచి 125స్థానాలు, బీజేపీ 104నుంచి 116 స్థానాలు, ఇతరులు 0-4స్థానాలు గెలుచుకునే అవకాశముంది ఏబీపీ-సీ-ఓటర్ సర్వే తేల్చింది. కాంగ్రెస్‌కు 45శాతం, బీజేపీకి 44 శాతం, బీఎస్పీ 1శాతం, ఇతరులు 10శాతం ఓట్లు సాధించవచ్చని తేలింది. ఇక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు ఏదైనా పార్టీ లేదా కూటమికి 116 స్థానాలు అవసరం. ఇలా చూసినప్పుడు సర్వే ఫలితాలు వాస్తవరూపం దాల్చితే కాంగ్రెస్‌ తగినంత మెజార్టీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నది.

మిజోరంలో హంగ్‌

మిజోరంలో ఈ ఎన్నికల్లో హంగ్ ఏర్పడనుంది. అసెంబ్లీలో 40 సీట్లకుగాను అధికార మిజో నేషనల్ ఫ్రంట్ 13 నుంచి 17 స్థానాలు సాధించి మళ్లీ అతిపెద్ద కూటమిగా నిలువనుంది. కానీ.. మెజార్టీ మార్క్‌ 21 దాటడం లేదు. కాంగ్రెస్ 10 నుంచి 14 స్థానాలు, జోరం పీపుల్స్‌ మూవ్‌మెంట్‌ (జెడ్పీఎం) 9 నుంచి 13 స్థానాలు, ఇతరులు ఒకటి నుంచి 3 స్థానాలు సాధించవచ్చని ఏబీపీ-సీ-ఓటర్ సర్వే పేర్కొన్నది. దీంతో ఇక్కడ జడ్పీఎం కింగ్‌మేకర్‌గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికార మిజోనేషనల్‌ ఫ్రంట్‌కు, కాంగ్రెస్‌కు ఒక దశలో జెడ్పీఎం ప్రత్యామ్నాయంగా ముందుకు వచ్చింది. రాష్ట్రంలో మాదక ద్రవ్యాలను కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలమైందని పెద్ద ఎత్తున విమర్శల దాడి చేస్తున్నది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌తో జెడ్పీఎం కలిస్తే అక్కడ కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వానికి అవకాశాలు ఉంటాయి.

రాజస్థాన్‌లో కమల వికాసం

ఈసారి రాజస్థాన్‌ ‘చేయి’ జారిపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తం 200 సీట్లకుగాను బీజేపీ 127 నుంచి 137 సీట్లు, కాంగ్రెస్‌ 59 నుంచి 69 మధ్య, ఇతరులు 2 నుంచి 6 స్థానాల మధ్య గెలువనున్నారని ఏబీపీ-సీ-ఓటర్ సర్వే తెలిపింది. ఇక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు కనీసం 101 మంది సభ్యులు అవసరం. ఏ విధంగా చూసినా అధికారానికి కాంగ్రెస్‌ చాలా దూరంలో ఉండనున్నదనేది అర్థమవుతున్నది. బీజేపీకి 46 శాతం ఓటింగ్‌ లభించే అవకాశం ఉన్నదని సర్వే తెలిపింది. గతంలో బీజేపీకి ఇక్కడ 38 శాతం ఓటింగ్‌ మాత్రమే లభించింది. ఇక కాంగ్రెస్‌కు 42 శాతం ఓట్లు లభించే అవకాశం ఉన్నది.

ఐదింటిలో బీజేపీ గెలిచేది ఒక్కటే!

వచ్చే ఏడాది జరుగబోయే లోక్‌సభ ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా భావిస్తున్న ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలువగలిగేది ఒక్క రాజస్థాన్‌ మాత్రమేనని సర్వేలను బట్టి వెల్లడవుతున్నది. ఎంపీ, ఛత్తీస్‌గఢ్‌లలో బీజేపీ అవకాశాలే లేవని తేలిపోతున్నది. ఇక మిజోరంలో జెడ్పీఎం మద్దతు ఇస్తే కాంగ్రెస్‌ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. వెరసి.. కేంద్రంలోని బీజేపీకి ఈ ఫలితాలు చేదుగానే ఉండబోతున్నాయని విశ్లేషకులు అంటున్నారు.