ADR Report | బీహార్ అసెంబ్లీలో సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో 158 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్

బీహార్‌లో 241 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలలో 158 మందిపై (65.5%) క్రిమినల్ కేసులు, 119 మందిపై (49.3%) తీవ్రమైన కేసులు ఉన్నాయని ఏడీఆర్ నివేదిక తెలిపింది. ఆర్జేడీలో 74%, కాంగ్రెస్‌లో 82%, బీజేపీలో 64% మందిపై కేసులు ఉన్నాయి.

adr-report-bihar-assembly-158-sitting-mlas-face-criminal-cases

పాట్నా, అక్టోబర్ 15, (విధాత ప్రతినిధి): బీహార్‌లోని దాదాపు మూడింట రెండు వంతుల మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్ ) సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ సాగుతున్న తరుణంలో ఏడీఆర్ ఈ నివేదికను విడుదల చేసింది. 241 మంది ఎమ్మెల్యేలలో 158 మంది ఎమ్మెల్యేలపై ( 65.5% మంది ) కేసులు పెండింగ్‌లో ఉన్నాయని నివేదిక పేర్కొంది. వీరిలో 119 మంది ఎమ్మెల్యేలు (49.3%) తీవ్రమైన క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ జైలు శిక్ష, బెయిల్ లేని శిక్షించదగిన నేరాలు, ఎన్నికల నేరాలు వంటి వాటిని తీవ్రమైన నేరాలుగా ఏడీఆర్ సంస్థ తెలిపింది.

పదహారు మంది ఎమ్మెల్యేలపై హత్యకు సంబంధించిన కేసులున్నాయ., 30 మందిపై హత్యాయత్నానికి సంబంధించిన కేసులున్నాయి. ఎనిమిది మంది మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులున్న విషయాన్నిఈ సంస్థ గుర్తించింది.

పార్టీల వారీగా చూస్తే రాష్ట్రంలోని పాలక కూటమిలో జేడీ(యూ), బీజేపీ భాగస్వామ్యంగా ఉంది. బిజెపికి చెందిన 83 మంది ఎమ్మెల్యేలలో 53 మంది (64% శాతం మంది)పై క్రిమినల్ కేసులు ఉన్నాయి. జనతాదళ్ (యునైటెడ్) శాసనసభ్యులలో 47 మందిలో (21 మంది (45%) పై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రకటించారు.ప్రతిపక్ష పార్టీలలో రాష్ట్రీయ జనతాదళ్ నుండి 72 మంది ఎమ్మెల్యేలలో 53 మంది (74 శాతం)పై క్రిమినల్ కేసులు ఉన్నాయి. 17 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో) పద్నాలుగు మందిపై (82%) కూడా క్రిమినల్ కేసులు ఉన్నాయి.

2020 అసెంబ్లీ ఎన్నికలకు ముందు దాఖలు చేసిన 243 మంది ఎమ్మెల్యేలలో 241 మంది స్వయంగా సమర్పించిన అఫిడవిట్లను పరిశీలించిన తర్వాత ఎన్నికల నిఘా సంస్థ క్రిమినల్ కేసులపై నివేదికను విడుదల చేసింది.