Site icon vidhaatha

Air India flight | ఎయిరిండియా విమానంలో మంటలు.. అత్యవసరంగా ల్యాండింగ్‌..!

Air India flight : ఎయిరిండియా విమానం ఇంజిన్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో పైలట్‌లు అప్రమత్తమై అత్యవసరంగా ల్యాండ్‌ (Emergency landing) చేశారు. గత అర్ధరాత్రి బెంగళూరు నుంచి కొచ్చికి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలోని ఓ ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. దాంతో ఆ విమానాన్ని బెంగళూరు విమానాశ్రయంలోనే (Bengalore Airport) అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు.

విమానం ల్యాండ్ అయిన తర్వాత 179 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చినట్లు బెంగళూరు విమానాశ్రయం ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. మంటలు రేగిన ఎయిరిండియాకు చెందిన IX 1132 విమానం బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో రాత్రి 11.12 గంటలకు ల్యాండ్ అయింది.

విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల తర్వాత ఆన్‌బోర్డ్‌ సిబ్బంది కుడి ఇంజిన్‌లో మంటలను గమనించి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (ATC) కు సమాచారం ఇచ్చారు. దాంతో పూర్తి స్థాయి అత్యవసర పరిస్థితిని ప్రకటించి విమానం ల్యాండింగ్‌కు సూచన చేశారు. విమానం ల్యాండింగ్ అయిన వెంటనే మంటలను ఆర్పివేశారు.

ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాకుండా సిబ్బంది సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని, మా అతిథులు వీలైనంత త్వరగా వారి గమ్యస్థానానికి చేరుకోవడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని ఎయిర్లైన్స్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇంజిన్‌లో మంటలకు కారణాలపై దర్యాప్తు జరుగుతోందని తెలిపింది.

కాగా అంతకుముందు 137 మంది ప్రయాణికులతో బెంగళూరుకు వెళ్తున్న మరో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం కూడా సాంకేతిక లోపం కారణంగా తమిళనాడులోని తిరుచిరాపల్లిలో “అత్యవసర ల్యాండింగ్” అయ్యింది.

Exit mobile version