Akshay Kumar | తొలిసారి ఓటు హ‌క్కు వినియోగించుకున్న 56 ఏండ్ల అక్ష‌య్ కుమార్

దేశ వ్యాప్తంగా ఐదో విడుత లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు పోలింగ్ ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 నియోజ‌క‌వ‌ర్గాల్లో ముమ్మ‌రంగా పోలింగ్ కొన‌సాగుతోంది

  • Publish Date - May 20, 2024 / 10:57 AM IST

ముంబై : దేశ వ్యాప్తంగా ఐదో విడుత లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు పోలింగ్ ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 నియోజ‌క‌వ‌ర్గాల్లో ముమ్మ‌రంగా పోలింగ్ కొన‌సాగుతోంది. మ‌హారాష్ట్ర‌లోని ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో బాలీవుడ్ న‌టులు ఓటు వేసేందుకు క్యూ లైన్ల‌లో నిల్చున్నారు.

బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ ముంబైలో తొలిసారిగా త‌న ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. భార‌త పౌర‌స‌త్వం తిరిగి పొందిన త‌ర్వాత తొలిసారిగా ఓటు వేసిన‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఆగ‌స్టు 2023లో భార‌త పౌర‌స‌త్వం పొందిన త‌ర్వాత తొలిసారిగా ఓటు వేయ‌డం ఎంతో సంతోషంగా ఉంద‌న్నారు. నా భార‌త‌దేశం అభివృద్ధి చెందాల‌ని, బ‌లంగా ఉండాల‌ని తాను కోరుకుంటున్నాన‌ని చెప్పారు. ఆ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని ఓటేశాన‌ని పేర్కొన్నారు. ప్ర‌తి పౌరుడు బాధ్య‌త‌గా ఓటు వేయాల‌ని అక్ష‌య్ కుమార్ కోరారు.

వాస్త‌వానికి అక్ష‌య్ కుమార్ కెన‌డా పౌర‌స‌త్వాన్ని క‌లిగి ఉన్నాడు. అందుకు గ‌ల కార‌ణాల‌ను గ‌తంలో ఓ ఇంట‌ర్వ్యూలో తాను వెల్ల‌డించారు. 1990ల్లో త‌న సినిమాల‌న్నీ వ‌రుస‌గా ప్లాప్ కావ‌డంతో.. చాలా నిరుత్సాహ ప‌డ్డాను. వ‌రుసగా 15 సినిమాలు ప్లాప్ అయ్యాయి. దాంతో సినిమా జీవితం కాస్త ఇబ్బందుల్లో ప‌డింది. ఆ స‌మ‌యంలో కెన‌డాలో ఉన్న త‌న స్నేహితుడి స‌ల‌హా మేర‌కు అక్క‌డికి వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్నాను. అప్పుడే కెన‌డా పాస్ పోర్టు తీసుకున్నాను. ఇండియా నుంచి వెళ్లిపోదామ‌నుకునే స‌మ‌యంలో త‌న రెండు సినిమాలు విజ‌యం సాధించాయి. దీంతో మ‌ళ్లీ త‌న‌లో ఆత్మ విశ్వాసం వ‌చ్చింది. ఇక కెన‌డా వెళ్ల‌లేదు. ఈ క్ర‌మంలోనే పాస్ పోర్టు విష‌యం మ‌రిచిపోయాను అని అక్ష‌య్ తెలిపారు.

Latest News