ఫేస్‌బుక్ ఫ్రెండ్ కోసం పిల్లలను
వదిలి పాకిస్థాన్‌కు వెళ్లిన అంజు
ఎన్‌వోసీకోసం పాక్‌కు దరఖాస్తు
విధాత: ఖైబర్ ఫంఖ్తుఖ్వా జిల్లావాసి 29 ఏండ్ల నస్రుల్లా ఆమె పెండ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. భారత్‌లోని తన ఇద్దరు పిల్లలను చూసుకొనేందుకు తిరిగి భారత్‌కు రావాలని ఆమె భావిస్తున్నట్టు తెలుస్తున్నది. ఇందుకోసం ఆమె తాజాగా ఎన్‌వోసీ కోసం పాక్ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నది. ఎన్‌వోసీ కోసం ఇస్లామాబాద్‌లోకి హోంశాఖకు దరఖాస్తు చేసుకున్నట్టు ఆమె భర్త నస్రుల్లా తెలిపారు. ఆ పత్రం రాగానే అంజు భారత్‌కు వస్తారని పేర్కొన్నారు.
‘మేము ఇస్లామాబాద్‌లోని అంతర్గత మంత్రిత్వ శాఖ నుంచి ఎన్‌వోసీ (నో-అబ్జెక్షన్ సర్టిఫికెట్) కోసం ఎదురు చూస్తున్నాం. దీని కోసం మేము ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నాం. ఎన్‌వోసీ ప్రక్రియ పూర్తవడానికి కాస్త సమయం పడుతుంది. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే అంజు భారత్‌కు వస్తుంది’ అని నస్రుల్లా తెలిపారు.
రాజస్థాన్‌లోని భివాడి జిల్లాకు చెందిన 34 ఏండ్ల అంజు రాజస్థాన్‌కు చెందిన అర్వింద్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నది. వీరికి 15 ఏండ్ల కూతురు, ఆరేండ్ల కుమారుడు ఉన్నారు. అంజుకు పాక్‌కు చెందిన 29 ఏండ్ల నస్రుల్లాతో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. అదికాస్తా ప్రేమకు దారితీయడంతో అతడి ప్రేమ కోసం భర్త, ఇద్దరు పిల్లల్ని వదిలేసి.. ఈ ఏడాది జూలైలో వాఘా సరిహద్దు మీదుగా పాక్‌లోకి ప్రవేశించింది. అక్కడ తన ప్రియుడు నస్రుల్లాను కలిసింది.
అక్కడి నుంచి ఖైబర్ ఫంఖ్తుఖ్వాలోని ప్రియుడి ఇంటికి వెళ్లింది. అక్కడ ఆమె హిందూ మతం నుంచి ఇస్లాంలోకి మారింది. తన పేరును ఫాతిమాగా మార్చుకుంది. ఆ తర్వాత ప్రియుడు నస్రుల్లాను పెండ్లి చేసుకున్నది. ఆమెకు పాక్ ప్రభుత్వం ఏడాది చెల్లుబాటయ్యే వీసాను మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ఆమె తన పిల్లలపై మనాది పడింది. స్వదేశానికి వచ్చేందుకు సిద్ధమవుతున్నది.