బీహార్‌ ఇండియా కూటమిలో ‘సీఎం’ లొల్లి సీట్ల కేటాయింపుపైనా భిన్నాభిప్రాయాలు!

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకాలు ప్రతిపక్ష ఇండియా కూటమిలో లుకలుకలకు దారి తీస్తున్నాయి..గత 20 ఏళ్లుగా బీహార్‌కు కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి లేరు. అందుకే ఆ పదవిని తమ వద్ద ఉంచుకోవాలని కాంగ్రెస్‌ భావిస్తున్నదని సమాచారం. ఈ క్రమంలోనే తేజస్విని సీఎం అభ్యర్థిగా ప్రకటించడానికి  ఇష్టపడటం లేదని తెలుస్తున్నది

  • Publish Date - September 17, 2025 / 04:14 AM IST
న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 16 (విధాత):  బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకాలు ప్రతిపక్ష ఇండియా కూటమిలో లుకలుకలకు దారి తీస్తున్నాయి. మరికొద్ది రోజుల్లో ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావాల్సి ఉన్న తరుణంలో ‘ముఖ్యమంత్రి అభ్యర్థి’ సహా సీట్ల పంపకాలపై పీట ముడిపడినట్టు కనిపిస్తున్నది. దీంతో మిత్రపక్షం ఆర్జేడీ.. కాంగ్రెస్‌పై గుర్రుగా ఉన్నది. ఇప్పటికే బీహార్‌లో ఒంటరిగా పోటీ చేస్తామని ఆమ్ ఆద్మీ ప్రకటించింది. తాజాగా అర్జేడీ కూడా అదే దారిలో ఒంటరి పోటీకి  సిద్ధమవుతుందా? అనే చర్చ జోరుగా సాగుతున్నది.
2020 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆర్డేడీ, జేడీయూ కలిసి పోటీ చేసి, విజయం సాధించాయి. కానీ కూటమి నుంచి బయటకు వచ్చిన జేడీయూ నేత నితీశ్‌కుమార్‌.. బీజేపీతో చేతులు కలిపారు. ఫలితంగా కూటమి సర్కార్‌ కూలిపోయింది. ఆ ఎన్నికల్లో 70 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్.. 19 సీట్లు మాత్రమే గెలిచింది. ఆర్జేడీ 144 స్థానాల్లో పోటీచేసి.. 75 చోట్ల విజయం సాధించింది. ఈ ఊపుతో రాబోయే అసెంబ్లీ ఎన్నికలను ఆర్జేడీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది. రాబోయే ఎన్నికల్లో గెలిచి, సీఎం పదవిని చేపట్టాలనే ఉత్సాహంతో  ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. రాహుల్‌ గాంధీ ఇటీవల బీహార్‌లో చేపట్టిన ఓటర్‌ అధికార్‌ యాత్రలోనూ తేజస్వి యాక్టివ్‌గా పాల్గొన్నారు. ఈ యాత్రలోనే తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారని ఆశించిన తేజస్వి.. ఆ ప్రస్తావన రాకపోయేసరికి తీవ్ర నిరుత్సాహానికి గురైనట్టు పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు. దీంతో తేజస్వి తనకు తానే సీఎం అభ్యర్థిగా ప్రకటించుకుంటున్నారు. ఆఖరుకు రాహుల్‌, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆశీనులై ఉన్న వేదికపైనా తనను తాను సీఎంగా ప్రొజెక్ట్‌ చేసుకున్నారు. దానిపైనా కాంగ్రెస్‌ నుంచి ఎలాంటి స్పందనలేదు. దీనికి తోడు సీఎంను బీహార్‌ ప్రజలే నిర్ణయిస్తారని ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ కృష్ణ అల్లవారు ప్రకటించడంతో గందరగోళం నెలకొన్నది.
బీహార్‌లో కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి ఉండాలని ఆ పార్టీ అధిష్ఠానం యోచనగా చెబుతున్నారు. గత 20 ఏళ్లుగా బీహార్‌కు కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి లేరు. అందుకే ఆ పదవిని తమ వద్ద ఉంచుకోవాలని కాంగ్రెస్‌ భావిస్తున్నదని సమాచారం. ఈ క్రమంలోనే తేజస్విని సీఎం అభ్యర్థిగా ప్రకటించడానికి  ఇష్టపడటం లేదని తెలుస్తున్నది. దీనికి తోడు ఇటీవలి ఓటర్‌ అధికార్‌ యాత్రలో కాంగ్రెస్‌ పార్టీ పట్ల ప్రజల్లో మంచి ఆదరణ కనిపించిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో నాయకత్వంలో విజయంపై విశ్వాసం పెరిగిందని అంటున్నారు. ఇటువంటి సమయంలో తేజస్వి యాదవ్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా అంగీకరిస్తే దీర్ఘకాలంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రయోజనాలు దెబ్బతింటాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
గత ఎన్నికల్లో 70 సీట్లలో పోటీ చేసిన కాంగ్రెస్‌.. ఈసారి 100కుపైగా సీట్లలో పోటీ చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నది. రెండు రోజులక్రితం తాము 243 సీట్లలో అభ్యర్థులను నిలుపుతామని తేజస్వి యాదవ్‌ ప్రకటించారు. దీనిపైనా కాంగ్రెస్‌ స్పందించలేదు.  పైగా.. లాలు ప్రసాద్‌, తేజస్వి యాదవ్‌పై ఉన్న అవినీతి ఆరోపణలు ఇప్పుడు కాంగ్రెస్‌కు గుర్తుకొచ్చాయి. ఈ సమయంలో తేజస్విని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే ఇండియా కూటమి అధికారంలోకి రావడం కష్టమని వాదనను కాంగ్రెస్‌ నాయకత్వం లేవనెత్తుతున్నది.
సీట్ల విషయంలో ఎవరికి ఎన్ని సీట్లు అనే అంశంతోపాటు.. ఏ సీట్లు ఎవరికి అనే పాయింట్‌ చుట్టూనే చర్చలు నడుస్తున్నట్టు సమాచారం. తాను గతంలో పోటీ చేసిన అన్ని సీట్లను కాంగ్రెస్‌ కోరుతున్నది. అందులో కనీసం 25 కచ్చితంగా గెలిచే సీట్లపై కాంగ్రెస్‌ కన్నేసింది. మొత్తంగా బీహార్‌ ఎన్నికల్లో ఇండియా కూటమి ఐక్యంగా పోటీ చేస్తుందా? లేదా? అనేది ఒకటి రెండు రోజుల్లో తేలిపోనున్నదని సమాచారం.
ఇదిలా ఉంటే.. మంగళవారం నుంచీ తేజస్వి యాదవశ్‌ ‘అధికార్‌ యాత్ర’ను ప్రారంభించారు. నిరుద్యోగం, మహిళల హక్కులు, భద్రత, రాష్ట్రంలో విద్య, వైద్యాన్ని మెరుగుపర్చడం వంటి అంశాలపై ఆయన మాట్లాడుతున్నారు. ఈ ర్యాలీ జహానాబాద్‌లో ప్రారంభమై సెప్టెంబర్ 20న వైశాలిలో ముగుస్తుంది. రాహుల్ గాంధీ ఓటర్‌ అధికార్ యాత్ర నిర్వహించని జిల్లాల్లో ఈ పాదయాత్ర జరుగుతుందని  ఆర్జేడీ నేతలు చెబుతున్నారు.
బీహార్‌ అసెంబ్లీలో ప్రస్తుత బలాబలాలు
మొత్తం సభ్యులు : 243 
అసెంబ్లీలో ఎన్డీయే : 131
బీజేపీ: 80
జేడీయూ: 45
హెచ్‌ఏఎం (ఎస్‌) : 4
స్వతంత్రులు : 2
ఇండియా కూటమి : 111 
ఆర్జేడీ : 77
కాంగ్రెస్ : 19
సీపీఐ (ఎంఎల్‌) :11
సీపీఎం : 2
సీపీఐ : 2