న్యూఢిల్లీ : బీహార్ అసెంబ్లీ(Bihar election 2025)లో తొలి దశ ఎన్నికల పోలింగ్(first phase polling begins)ప్రారంభమైంది. గురువారం జరుగుతున్న పోలింగ్ లో 18జిల్లాల్లో 121అసెంబ్లీ స్ధానాలకు పోలింగ్ కొనసాగుతుంది. మొత్తం 1314మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 3.75 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నికల కోసం 45,341 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్డీఏ నుంచి జేడీయూ 57 స్థానాలు, బీజేపీ 48, ఎల్‌జేపీ 14, ఆర్‌ఎల్‌ఎం రెండు స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇండియా కూటమి నుంచి ఆర్‌జేడీ 73, కాంగ్రెస్ 24, సీపీఐ-ఎంఎల్ 14 చోట్ల పోటీకి నిలిచింది. ప్రశాంత్‌కిషోర్ సారథ్యంలోని జన్‌సురాజ్ పార్టీ నుంచి 119 మంది పోటీ చేస్తున్నారు. తొలి విడతలో తేజస్వీ యాదవ్ తో పాటు బీజేపీ నేత సామ్రాట్ చౌధరి, ఇద్దరు డిప్యూటీ సీఎంలు, 14 మంది మంత్రులు పోటీ పడుతున్నారు. పోలింగ్ వేళ ఓటర్లు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా పిలుపునిచ్చారు. బీహార్ అసెంబ్లీలో మొత్తం 243 స్థానాలకు రెండు విడతల్లో(నవంబర్ 6, 11) పోలింగ్ జరుగనున్న సంగతి తెలిసిందే. రెండు విడతల పోలింగ్ పూర్తయ్యాక నవంబర్ 14న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు.
కొనసాగుతున్న పోలింగ్
ఉదయం 10గంటల వరకు 20శాతం మేరకు పోలింగ్ జరిగింది. పట్నాలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన సతీమణి రబ్రీ దేవి, మహాఘట్ బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్, ఆయన సతీమణి రాజశ్రీ యాదవ్, లాలూ కుమార్తెలు మీసా భారతి, రోహిణి ఆచార్య ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్డీఏకు సంబంధించి
కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్, బిహార్ ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా లఖిసరయ్‌లో ఓటు వేశారు. మరో కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ పట్నాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
కేంద్రమంత్రి నిత్యానంద్ రాయ్, ఆయన సతీమణి హజీపూర్‌లోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.
వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ చీఫ్, మహాగఠ్‌బంధన్ ఉప ముఖ్యమంత్రి అభ్యర్థి ముకేశ్ సహనీ తన కుటుంబంతో కలిసి దర్భంగాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
