న్యూఢిల్లీ : రాజ్యసభలో బీజేపీ బలం మరింత తగ్గింది. శనివారం నామినేటెడ్ సభ్యులు రాకేశ్ సిన్హా, రామ్ శకల్, సోనాల్ మాన్‌సింగ్, మహేశ్ జఠ్మలాని పదవీకాలం ముగిసింది. వీరిని అధికార పార్టీ సలహా మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. తదనంతర కాలంలో వివిధ బిల్లుల సమయంలో వారంతా అధికార పార్టీకి మద్దతుగా నిలిచారు. ఇప్పడు వీరి పదవీకాలం ముగియడంతో రాజ్యసభలో బీజేపీ బలం 101 నుంచి 86కు తగ్గింది. 245 మంది సభ్యులు ఉన్న రాజ్యసభలో మెజార్టీ మార్కు 113గా ఉన్నది. ప్రస్తుతం రాజ్యసభలో 225 మంది సభ్యులు ఉన్నారు.
కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి 87 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో కాంగ్రెస్ నుంచి 26, తృణమూల్ కాంగ్రెస్ నుంచి 13, ఆమ్ ఆద్మీ పార్టీ, డీఎంకే, నుంచి పది మంది సభ్యులు ఉన్నారు. వీరుకాకుండా ఏ కూటమికీ అనుబంధంగా లేని బీఆరెస్, వైసీపీ వంటి పార్టీలకు చెందిన ఎంపీలు, ఇండిపెండెంట్లు కూడా ఉన్నారు.
బీజేపీ సంఖ్య ఎందుకు తగ్గింది?
తాజా పరిణామం నేపథ్యంలో రాజ్యసభలో బిల్లుల ఆమోదానికి మోదీ ప్రభుత్వం ఎన్డీయే యేతర పక్షాలపైనే ఆధారపడాల్సి ఉన్నది. ఇప్పటికైతే బిల్లుల ఆమోదానికి 13 మంది అదనపు మద్దతు అవసరం. అయితే.. వైసీపీకి 11, అన్నాడీఎంకేకు నలుగురు రాజ్యసభ సభ్యులు ఉన్నారు. అయితే.. గత ఏడాది డిసెంబర్‌లో ఈ రెండు పార్టీల మధ్య దూరం పెరిగింది. తమిళనాడులో అన్నాడీఎంకే, బీజేపీ విడిగా పోటీచేశాయి. పైగా అక్కడ రెండు పార్టీల మధ్య తీవ్రస్థాయిలో విమర్శల పర్వం నడుస్తున్నది. మరోవైపు ఏపీలోని వైసీపీని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఓడించింది. ఈ నేపథ్యంలో వైసీపీ వైఖరి ఎలా ఉంటుందన్నది అనుమానాస్పదంగా మారింది. ఇక ఒడిశాలోని బిజూ జనతాదళ్ కూడా ఎన్డీయేలో లేనప్పటికీ.. అవసరమైన సమయంలో మద్దతును ఇస్తూ వచ్చింది. ఆ పార్టీకి 9 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఇప్పుడు ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేడీని ఒడిశాలో బీజేపీ ఓడించింది. ఈ సమయంలో బీజేడీ వైఖరి ఎలా ఉంటుందన్న చర్చ నడుస్తున్నది. అన్నాడీఎంకే, బీజేపీ దూరమైన పక్షంలో బీజేపీ నామినేటెడ్ సభ్యులపైనే ఆధారపడాల్సి వస్తుంది.
ఖాళీగా 20 సీట్లు
ప్రస్తుతం రాజ్యసభలో 20 సీట్లు ఖాళీగా ఉన్నాయి. అందులో 11 సీట్లు ఎన్నికల ద్వారా భర్తీకావాల్సి ఉన్నాయి. వీటిలో మహారాష్ట్ర, అసోం, బీహార్‌లలో రెండేసి సీట్లు, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ, త్రిపుర నుంచి ఒకటి చొప్పున భర్తీ కావాల్సి ఉన్నది. వీటిలో అసోం, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, త్రిపుర నుంచి ఏడు సీట్లు గెలుచుకునేందుకు బీజేపీకి అవకాశం ఉన్నది. మహారాష్ట్రలో గట్టిగా ప్రయత్నిస్తే మరో ఇద్దరిని కూడా గెలిపించుకునే అవకాశం ఉన్నది. దీంతో బీజేపీకి మరో 9 మంది సభ్యులు పెరుగుతారు. వీరు, నామినేటెడ్ సభ్యులు, వైసీపీ ఎంపీలు సహకరిస్తేనే ఎగువ సభలో బీజేపీ తన బిల్లులను ఆమోదించుకునే అవకాశం ఉన్నది. ఇక జమ్ముకశ్మీర్‌లో నాలుగు సీట్లు ఖాళీగా ఉన్నాయి. అక్కడ ఈ ఏడాది చివరిలో ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. ఇక తెలంగాణలో ఒక స్థానాన్ని కాంగ్రెస్ గెలుచుకోవడం తథ్యం. అందులోనూ ఇక్కడ గెలిచే స్థానంతోనే రాజ్యసభలో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా కూడా లభించనున్నది. అప్పుడు ఉభయసభల్లోనూ ప్రతిపక్ష నేత హోదా కాంగ్రెస్‌కే దక్కుతుంది.