మణిపూర్‌ ముఖ్యమంత్రి మార్పు?.. అదేమీ లేదన్న : బీరేన్‌సింగ్‌

ఏడాదికిపైగా హింసాత్మక ఘటనలతో అల్లాడుతున్న మణిపూర్‌లో రాజకీయ నాయకత్వ మార్పుపై పెద్ద ఎత్తున ఊహాగానాలు వస్తున్నాయి. మరోవైపు పలువురు బీజేపీ, దాని మిత్రపక్ష పార్టీల ఎమ్మెల్యేలు ఢిల్లీలో మకాం వేయడం ఈ ఊహాగానాలకు బలం చేకూర్చుతున్నది

  • Publish Date - June 29, 2024 / 05:03 PM IST

న్యూఢిల్లీ : ఏడాదికిపైగా హింసాత్మక ఘటనలతో అల్లాడుతున్న మణిపూర్‌లో రాజకీయ నాయకత్వ మార్పుపై పెద్ద ఎత్తున ఊహాగానాలు వస్తున్నాయి. మరోవైపు పలువురు బీజేపీ, దాని మిత్రపక్ష పార్టీల ఎమ్మెల్యేలు ఢిల్లీలో మకాం వేయడం ఈ ఊహాగానాలకు బలం చేకూర్చుతున్నది. అయితే.. ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్‌ మాత్రం తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. బీజేపీలోని పలువురు ఎమ్మెల్యేలతోపాటు.. భాగస్వామ్యపక్షం నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ (ఎన్‌పీపీ), నాగా పీపుల్స్‌ ఫ్రంట్‌ (ఎన్‌పీఎఫ్‌) ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రాజీనామాకు డిమాండ్‌ చేస్తున్నట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. జూన్‌ మొదట్లో ఢిల్లీలో మణిపూర్‌ భద్రతపై కేంద్రం ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశానికి బీరేన్‌సింగ్‌ హాజరుకాలేదు. ఆ సమయంలోనే ఆయన రాజీనామా చేసే అవకాశాలపై చర్చ జరిగింది.
అయితే.. బీరేన్‌సింగ్‌ మాత్రం తనను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించేందుకు ఎలాంటి ప్రయత్నాలు జరుగటం లేదని స్పష్టంచేశారు. ‘నన్ను గురువారం దాదాపు 35 మంది ఎమ్మెల్యేలు కలిశారు. ప్రధాని, హోం మంత్రితో సమావేశానికి అపాయింట్‌మెంట్‌ కోరాలని నిర్ణయం తీసుకున్నాం. అంతే’ అని ఆయన పేర్కొన్నట్టు హిందూ పత్రిక తెలిపింది. ఈ సమావేశం కోసం తాను త్వరలో ఢిల్లీ వెళ్లబోతున్నట్టు బీరేన్‌సింగ్‌ చెప్పారు. ‘అపాయింట్‌మెంట్‌ తీసుకునే బాధ్యతను ఎమ్మెల్యేలు నాకు అప్పగించారు. అయితే.. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున పని ఒత్తిడి ఉండటంతో ఇప్పుడు వెళ్లి వాళ్లను ఇబ్బంది పెట్టడం ఎందుకని నేను భావించాను. సమావేశం జరిగేటప్పుడు నేను కూడా వెళతాను. కానీ.. కొందరు ముందే వెళ్లారు. దానికి నా రాజీనామాతో సంబంధం లేదు.’ అని బీరేన్‌సింగ్‌ చెప్పినట్టు ఎన్డీటీవీ పేర్కొన్నది. ఎన్డీయే ప్రభుత్వ తొలి వందరోజుల్లో ప్రాధమ్యాల జాబితాలో మణిపూర్‌ను చేర్చినందుకు ప్రధాని, హోమంత్రికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.
జాతుల కలహాలతో కల్లోలితమైన మణిపూర్‌లో ప్రస్తుత పరిస్థితిపై కొద్ది రోజుల క్రితం మణిపూర్‌ బీజేపీ ప్రెసిడెంట్‌ ఏ శారదాదేవి హోంమంత్రి అమిత్‌షాతో సమావేశమై విస్తృతంగా చర్చించారు. మణిపూర్‌ ప్రజల ఆకాంక్షలను తెలియజేశానని, రాష్ట్రంలో శాంతి నెలకొనేలా శాశ్వత పరిష్కారంపై వెంటనే శ్రద్ధ పెట్టాలని కోరినట్టు ఎక్స్‌లో శారదాదేవి తెలిపారు.

Latest News