Site icon vidhaatha

Lok Sabha | ప్రధానిపై కాంగ్రెస్‌ సభా హక్కుల ఉల్లంఘన నోటీసు

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్రమోదీపై ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చింది. రాహుల్‌ గాంధీ కులానికి సంబంధించిన వ్యాఖ్యలతో కేంద్ర మంత్రి అనురాగ్‌ఠాకూర్‌ మంగళవారం లోక్‌సభలో చేసిన ప్రసంగంపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ విషయంలో సభలో తీవ్ర గందరగోళం చెలరేగింది. రాహుల్‌గాంధీకి, అనురాగ్‌ ఠాకూర్‌కు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్నది. అయితే.. ఈ ఉపన్యాసం వీడియోను ప్రధాని నరేంద్రమోదీ సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేశారు. ఇది తప్పనిసరిగా చూడాల్సిన వీడియో అంటూ దానిని అప్‌లోడ్‌ చేశారు. ఈ చర్యపై ప్రతిపక్ష కాంగ్రెస్‌ మండిపడింది. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆరోపిస్తూ బుధవారం నోటీసును ఇచ్చింది. ఇదే అంశంపై బుధవారం కూడా సభలో తీవ్ర వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. ప్రతిపక్ష నేతపై చేసిన వ్యాఖ్యల విషయంలో అనురాగ్‌ ఠాకూర్‌ క్షమాపణ చెప్పాల్సిందేనని ప్రతిపక్షాలు పట్టుపట్టాయి. దేశంలో కుల గణన నిర్వహించాలన్న డిమాండ్‌ను పునరుద్ఘాటించాయి. ఈ గందరగోళం నడుమ సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదాపడింది.

Exit mobile version