Site icon vidhaatha

Jagdeep Dhankhar | ధన్‌ఖర్‌ రాజీనామాకు ముందు తీవ్రస్థాయి వాగ్యుద్ధం?.. మోదీ మాటల్లో మర్మం ఏంటి?

Jagdeep Dhankhar | బీజేపీ గత పదేళ్ల రాజకీయాలను గమనిస్తూ వస్తున్నవారికి ఉప రాష్ట్రపతి పదవికి జగ్దీప్‌ ధన్‌ఖర్‌ రాజీనామాకు దారి తీసిన పరిస్థితులను అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గత పదేళ్లుగా బీజేపీలో అధ్యక్షుడు ఎవరైనా వ్యవహారాలన్నీ మోదీ అమిత్‌షా కనుసన్నల్లోనే జరుగుతాయనేది బహిరంగమేనని అంటున్నారు. ఎదురు చెబితే ఎంతటివారైనా నిష్క్రమించాల్సిందే. కొందరు ఆ పరిస్థితి తెచ్చుకోకుండా లొంగిపోతూ ఉంటారు. ఎదురు తిరిగితే ధనఖర్‌ ఎదుర్కొన్న పరిస్థితే ఎదుర్కొనాల్సి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఉప రాష్ట్రపతి పదవికి ధనఖర్‌ రాజీనామా వెనుక కూడా ‘సరేనయ్యా’ అనే ముచ్చట లేకపోవడమే కారణంగా కొందరు ఊహిస్తున్నారు. ఎందుకంటే.. ధనఖర్‌ ముక్కుసూటి తనం కారణంగానే ఆయన పదవి కోల్పోవాల్సి వచ్చిందని చెబుతున్నారు.

ధనఖర్‌ ఆరోగ్య కారణాలను ప్రస్తావిస్తూ రాజీనామా పత్రాన్ని అందించారు. ఆరోగ్య కారణాలే కారణమనుకుంటే కనీసం ఒక వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేసి.. ఆయన ఘనతలు చెప్పి.. సాదరంగా పంపేవారని కొందరు అంటున్నారు. అదేమీ లేకుండా ఒక ఇరవైఆరు పదాల వీడ్కోలు సందేశంతో ప్రధాని సరిపెట్టడాన్ని కొందరు రాజకీయ విశ్లేషకులు ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. ‘శ్రీ జగ్దీప్‌ ధనఖర్‌ జీకి ఉప రాష్టపతి సహా వివిధ స్థాయిల్లో దేశానికి సేవ చేసే అవకాశం కలిగింది. ఆయన మంచి ఆరోగ్యంతో ఉండాలి’ అంటూ పొడిపొడిగా మోదీ తన సందేశాన్ని సరిపెట్టారు. ఆకస్మిక రాజీనామాపై ప్రతిపక్షాలు సందేహాలు లేవనెత్తిన నేపథ్యం కూడా ధనఖర్‌ మంచి ఆరోగ్యంతో ఉండాలని ప్రధాని ఆకాంక్షించారని అంటున్నారు. ఇక మిగిలిన ముఖ్యమైన మంత్రులెవరూ కూడా స్పందించలేదు.

దైవిక ఇబ్బందులు ఏవీ ఎదురుకానిపక్షంలో తాను సరైన సమయంలో 2027 ఆగస్ట్‌లో (ఆయన పదవీకాలం ముగిసే సమయం) రిటైర్‌ అవుతానని 11 రోజుల క్రితం ప్రకటించిన ధనఖర్‌.. పదవీకాలానికి ముందే ఆకస్మిక రాజీనామా చేయడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. వెంటనే రాజీనామా ఆమోదం పొందింది.. మరుసటి రోజే కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్‌ కూడా జారీ అయింది. ‘ఇంత అకస్మాత్తుగా ఎందుకు జరిగిందనేది స్పష్టంగా తెలియడం లేదు. కానీ.. ప్రధాని సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్టును గమనిస్తే ఏదో తీవ్ర కారణమే ఉండి ఉంటుందని అనిపిస్తున్నది. ధనఖర్‌పై అసహ్యాన్ని, కోపాన్ని ప్రతిబింబించేలా ఆ సందేశం ఉంది’ అని పేరు రాయడానికి నిరాకరించిన ఒక బీజేపీ ఎంపీని టెలిగ్రాఫ్‌ ఉటంకించింది.

బీజేపీ పెద్దలతో తీవ్ర స్థాయిలో వాగ్వాదం తర్వాతే ఆయన రాజీనామా చేశారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ నివాసంలో చోటు చేసుకున్న అగ్నిప్రమాదంలో పెద్ద మొత్తంలో నోట్ల కట్టలు సగం కాలిపోయిన స్థితిలో కనిపించాయి. దీనిపై జస్టిస్‌ వర్మపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు ప్రతిపక్షాలు నోటీసు ఇచ్చాయి. దానిని ఆమోదించిన ధన్‌ఖర్‌.. ఆ విషయాన్ని రాజ్యసభలో కూడా ప్రకటించడాన్ని బీజేపీ పెద్దలు జీర్ణం చేసుకోలేక పోయారని తెలుస్తున్నది. వాస్తవానికి లోక్‌సభలో ఈ అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావించిన సమయంలో అంతకు ముందే ప్రతిపక్షాల తీర్మానాన్ని రాజ్యసభలో ప్రవేశపెట్టేందుకు ధనఖర్‌ అనుమతించడం అది కూడా అధికారపక్షానికి తెలియకుండా జరిగిపోవడం ఈ వివాదానికి అతిపెద్ద కారణంగా అధికారవర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే మరో జడ్జ్‌ జస్టిస్‌ శేఖర్‌ యాదవ్‌పై అభిశంసన తీర్మానం రాజ్యసభలో పెండింగ్‌లో ఉంది. దానిని చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదనే అభిప్రాయాలు ఉన్నాయి. ఈ సమయంలో మళ్లీ జస్టిస్‌ వర్మపై అభిశంసన తీర్మానం విషయంలో కేంద్ర ప్రభుత్వం విముఖతతో ఉన్నది. దానిని పట్టించుకోకుండా ధన్‌ఖర్‌ ప్రతిపక్షాలు ఇచ్చిన తీర్మానాన్ని ఆమోదించారు.
‘రాజ్యసభలో ప్రతిపక్షాలు ఇచ్చిన తీర్మానాన్ని చేపడుతారని మాకు తెలియలేదు. అదే మాకు చాలా ఇబ్బందికర పరిస్థితిని సృష్టించింది’ అని ఒక సీనియర్‌ మంత్రి అంతర్గత సంభాషణలో చెప్పారని టెలిగ్రాఫ్‌ తెలిపింది. లోక్‌సభలో అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఆయన ఉద్దేశపూర్వకంగా దెబ్బతీశారని ఆయన ఆరోపించారు. ఎందుకంటే.. రాజ్యసభ ఈ తీర్మానాన్ని ముందుగా చేపట్టి, అదే రోజు ఆమోదించినట్టయితే.. జడ్జి మీద వచ్చిన ఆరోపణలపై పరిశీలనకు రాజ్యసభ చైర్మన్‌, లోక్‌సభ స్పీకర్‌ సంయుక్తంగా ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు. ఇదే విషయాన్ని సోమవారం ధన్‌ఖర్‌ రాజ్యసభలో చెప్పారు.

సోమవారం సాయంత్రం మంత్రులు ప్రధాని కార్యాలయంలో వరుస సమావేశాలు నిర్వహించడానికి కూడా ధనఖర్‌ నిర్ణయమే కారణమని చెబుతున్నారు. ఈ సమయంలోనే ధనఖర్‌కు ఫోన్‌ చేసి, రాజ్యసభలో తీర్మానం ఆమోదించిన నిర్ణయంపై వివరణ కోరడంతోపాటు.. ప్రభుత్వ ఆగ్రహాన్ని కూడా తెలియజేశారని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఆ సమయంలో ప్రభుత్వ పెద్దలకు, ధనఖర్‌కు మధ్య వాడివేడి వాదనలు చోటు చేసుకున్నాయని ఆ వర్గాలు తెలిపాయి. కొంతకాలంగా వివిధ అంశాలపై ఉప రాష్ట్రపతికి, ప్రభుత్వానికి మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉందని తెలుస్తున్నది. రైతుల ఆందోళన, న్యాయ వ్యవస్థలో అవినీతి తదితర అంశాలతో మొదలైన పరిణామాలు.. సోమవారం విస్ఫోటం చెందాయని అంటున్నారు. ఫలితంగానే తన పదవికి ధన్‌ఖర్‌ రాజీనామా చేయాల్సి వచ్చిందని చెబుతున్నారు.

ఒక ఉపరాష్ట్రపతి రాజీనామా చేస్తే ఇవ్వాల్సిన కనీస గౌరవం కూడా ప్రభుత్వం నుంచి లభించనందుకు ధనఖర్‌ చిన్నబుచ్చుకున్నారని ఆయనను కలిసిన ప్రతిపక్ష పార్టీల నేతలు చెబుతున్నారు. ఆయన రాజీనామాను నోటిఫై చేసిన కారణంగా ఇక ఆయనకు రాజ్యసభ వీడ్కోలు దక్కే అవకాశం లేదు.. ఆయన వీడ్కోలు ప్రసంగం చేసే వీలూ లేదు. ఆయన రాజ్యసభ సభ్యుడు కానందున ఆయన కనీసం రాజ్యసభలోకి ప్రవేశించే అవకాశం కూడా లేకుండా పోయింది.

ధన్‌ఖర్‌ రాజీనామా నేపథ్యంలో కొత్త ఉప రాష్ట్రపతి ఎవరు అవుతారన్న చర్చ తెరపైకి వచ్చింది. చర్చల్లో చాలా పేర్లు వినిపిస్తున్నప్పటికీ.. కొత్త ఉప రాష్ట్రపతి ఎన్నిక విషయంలో కేంద్ర ప్రభుత్వం హడావుడి పడబోదని బీజేపీ నేతలు చెబుతున్నారు. ‘కొత్త ఉప రాష్ట్రపతి విషయంలో చర్చలు ఇంకా ప్రారంభం కాలేదు. నాయకత్వం కొంత సమయం తీసుకుని, జాగ్రత్తలతో కొత్త ఉప రాష్ట్రపతిని ఎంపిక చేస్తుంది. బీజేపీ కొత్త అధ్యక్షుడి నియామకం కూడా పెండింగ్‌లో ఉంది. ఈ సమయంలో చాలా అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది’ అని బీజేపీ సీనియర్‌ నేత ఒకరు చెప్పారు.

ప్రస్తుతం రాజ్యసభ ఉపాధ్యక్షుడిగా ఉన్న హరివంశ్‌ (జేడీయూ) సభా కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఆయన మోదీకి సన్నిహితుడనే పేరు కూడా ఉంది. మంగళవారం ఆయన రాష్ర్టపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలిశారు. దీంతో తదుపరి ఉప రాష్ట్రపతి ఆయనే అవుతారనే ఊహాగానాలు చెలరేగాయి. అయితే బీజేపీ వర్గాల అభిప్రాయాలు మాత్రం మరోలా ఉన్నాయి. ఉప రాష్ట్రపతి పదవిని ఎన్డీయే భాగస్వామ్య పక్షాలకు ఇచ్చే ఉద్దేశం పార్టీకి లేదని అంటున్నాయి. ధనఖర్‌ ఉదంతం చేదు అనుభవం నేపథ్యంలో వేరే పార్టీకి అప్పగించేందుకు అవకాశాలు ఉండబోవని స్పష్టం చేస్తున్నాయి.

నిజానికి ధనఖర్‌ పశ్చిమబెంగాల్‌ గవర్నర్‌గా వ్యవహరించన సమయంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో తీవ్ర ఘర్షణపూర్వక వైఖరిని అనుసరించడం మోదీని ఆకట్టుకుందని చెబుతారు. అలా మోదీ ఎంపికతో ఉపరాష్ట్రపతి అయిన ధనఖర్‌.. అదే మోదీ ఆగ్రహంతో వైదొలగాల్సి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

మరిన్ని ఆసక్తికర వార్తల కోసం క్లిక్‌ చేయండి..

షూటింగ్ లో అడవి శేషు.. మృణాల్ ఠాకూర్‌ కు గాయాలు
New Vice President| కొత్త ఉప రాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల
Local Elections | బీఆర్ఎస్‌కు ‘స్థానిక’ ప‌రీక్ష! కాంగ్రెస్ వైఫల్యాలే బీఆర్‌ఎస్‌ టార్గెట్‌
Godavari Pulasa| అదృష్టం..పులస చేపలతో చిక్కింది..ఒకటి 22వేలకుపైనే..!
Sasi Tharoor Vs Congress | కాంగ్రెస్‌ పార్టీ నుంచి శశిథరూర్‌ నిష్క్రమణ తప్పదా?
PM Mallikarjuna Kharge? | మోదీ రాజీనామా చేస్తే ఖర్గే ప్రధాని!

Exit mobile version