Local Elections | బీఆర్ఎస్‌కు ‘స్థానిక’ ప‌రీక్ష! కాంగ్రెస్ వైఫల్యాలే బీఆర్‌ఎస్‌ టార్గెట్‌

వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ జిల్లా అధ్య‌క్షుల‌కు పిలుపునిచ్చిన‌ప్ప‌టికీ చివ‌రికి తాజా, మాజీ ఎమ్మెల్యేల‌దే ఆధిప‌త్య‌మ‌నేది బ‌హిరంగ అంశం. అధికారంలో ఉన్న‌ప్పుడే 33 జిల్లాల‌కు పార్టీ జిల్లా అధ్య‌క్షుల‌ను నియ‌మించారు. ఈ జిల్లా అధ్య‌క్షులు పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు కార్య‌క్ర‌మాల‌కు నామ‌మాత్రంగా అధ్య‌క్ష‌త‌ వ‌హించడం త‌ప్ప‌ చేసిందేమీలేదు. అప్పట్లోనే వారిని ఎమ్మెల్యేలు పట్టించుకోలేదని, తాజా ప‌రిస్థితిల్లో వారి మాట‌ను ప్ర‌స్తుత‌, మాజీ ఎమ్మెల్యేలు వింటారా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

Local Elections | విధాత, ప్ర‌త్యేక ప్ర‌తినిధి : అధికారం కోల్పోయిన తర్వాత మొదటిసారిగా ఎదురవుతున్న స్థానిక ఎన్నిక‌ల ప‌రీక్ష నుంచి బీఆర్ఎస్ ఎలా గ‌ట్టెక్కుతోంద‌నే చ‌ర్చ ఆ పార్టీలో జోరుగా సాగుతోంది. పార్టీ అధిష్ఠానం, పేరుకు జిల్లా అధ్య‌క్షులు త‌ప్ప నిర్మాణం లేని ఈ స్థితిలో క్యాడ‌ర్‌ను ఎన్నిక‌ల వైపు ఎలా న‌డిపిస్తార‌నే ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మవుతున్నాయి. నియోజ‌క‌వ‌ర్గాల్లో పాత బాసుల‌దే హ‌వా సాగుతున్న స్థితిలో నేటికీ కొన‌సాగుతున్న అస‌మ్మ‌తి కుంపట్ల‌ను ఏ విధంగా చల్లార్చుతారనే చర్చలు నడుస్తున్నాయి. అన‌ధికారికంగా పార్టీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జులుగా కొన‌సాగుతున్న ప్ర‌స్తుత‌, మాజీ ఎమ్మెల్యేల‌లో మెజార్టీ నాయ‌కుల‌కు అస‌మ్మ‌తి ఉన్న‌ప్ప‌టికీ ఆర్థికం, హంగూ, ఆర్భాటానికి మాత్రం ఒక‌రిద్ద‌రు మిన‌హా మెజార్టీ బ‌లంగా ఉన్నార‌నే అభిప్రాయం ఉంది. ప్ర‌భుత్వ పైన వ్య‌తిరేక‌త‌, ఇచ్చిన హామీల అమ‌లులో జాప్యం వంటి వాటిపై బీఆర్ఎస్ భారీ ఆశ‌లు పెట్టుకున్న‌ట్లు భావిస్తున్నారు. పార్టీలో కొన‌సాగుతున్న గ్రూపుల‌ను ఐక్యం చేసి ముందుకు న‌డిపించ‌డం పైన్నే ఆ పార్టీ విజ‌యావ‌కాశాలుంటాయ‌ని భావిస్తున్నారు.

పార్టీ గుర్తింపు ద‌క్క‌ని నాయ‌కులు

నేటికీ పార్టీలో కేసీఆర్ కుటుంబంలోని న‌లుగురైదుగురితో పాటు పోయినోళ్ళుపోగా మిగిలినవారికి జిల్లా అధ్య‌క్షుల‌నే ట్యాగ్ త‌ప్ప మ‌రొక‌రికి పార్టీ హోదా లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. శాస‌న‌స‌భా ప‌క్షనేత‌గా కేసీఆర్ మిన‌హా మిగిలిన ఉప ప‌ద‌వుల పంపిణీ కూడా జ‌రగ‌లేదు. ఏప్రిల్ 27న ఎల్క‌తుర్తి వేదిక‌గా పార్టీ 25వ ఆవిర్భావ దినోత్స‌వాన్ని ల‌క్షల మందితో నిర్వ‌హించిన‌ప్ప‌టికీ.. కేసీఆర్‌ ఒక్కరిదే ప్రసంగం. వేదికపైన బ్యాక్‌డ్రాప్‌లో కేసీఆర్‌, కేటీఆర్‌ చిత్రాలే. సభ ప్రచార పోస్టర్లలోనూ వాళ్లిద్దరి ఫొటోలే. సభ తర్వాత కమిటీల నిర్మాణం చేస్తామని ప్రకటించినప్పటికీ ఆ ఊసే లేకుండా పోయిందని క్యాడర్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నది. బీఆర్ఎస్ ఎదుర్కొంటున్న నేటి దుస్థితి.. చేజేతులా కొనితెచ్చుకున్నదేననే అభిప్రాయం ఓ మోస్తరు నాయకుల్లోనూ బలంగా ఉన్నది. గుప్పెడు మంది నాయ‌కుల‌కు త‌ప్ప మ‌రొక‌రికి గుర్తింపులేక‌పోవ‌డంతో క్షేత్ర‌స్థాయిలో ఇత‌ర రాజ‌కీయ ప‌క్షాల నుంచి అవ‌హేళ‌న‌ను సైతం ఎదుర్కొంటున్నామ‌ని ఒక నాయకుడు ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

క్యాడ‌ర్ ఎంతున్నా నిర్మాణం సున్నా

బీఆర్ఎస్‌కు కావాల్సినంత మంది క్యాడ‌ర్ ఉన్న‌ప్ప‌టికీ క్షేత్ర‌స్థాయిలో నిర్మాణం లేకుండా పోయింది. ఈ స్థితిలో పార్టీని స్థానిక ఎన్నిక‌ల‌కు గ్రామ‌స్థాయి నుంచి స‌న్న‌ద్ధం చేయ‌డ‌మంటే జిల్లా అధ్య‌క్షుల‌కు అగ్నిప‌రీక్షేననని అంటున్నారు. నియోజ‌క‌వ‌ర్గ‌, మండ‌ల, గ్రామ స్థాయి స‌మావేశాల‌ నిర్వ‌హ‌ణ సంద‌ర్భంగా నిర్మాణ‌ స‌మ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశం ఉందంటుంటున్నారు. ఆ పరిస్థితి రాకూడదంటే గంప‌గుత్త వ్య‌వ‌హారంగా స‌మావేశాలు నిర్వ‌హించాల్సిన ప‌రిస్థితి ఉందంటున్నారు. ఈ కార‌ణంగానే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు స‌న్న‌ద్ధం కావాల‌ని పార్టీ నాయ‌కులు, శ్రేణుల‌కు కేటీఆఱ్‌ పిలుపునిచ్చిన సంద‌ర్భంగా కూడా ఇదే విష‌యాన్ని గుర్తించారని అంటున్నారు. పార్టీ జిల్లా అధ్య‌క్షులే బాధ్య‌త‌ వ‌హించి నియోజ‌క‌వ‌ర్గ స్థాయి ముఖ్య కార్య‌క‌ర్త‌ల స‌మావేశాలు నిర్వ‌హించాల‌ని పిలుపునిచ్చారు.

మాజీ ఎమ్మెల్యేల‌దే ఆధిప‌త్యం

వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ జిల్లా అధ్య‌క్షుల‌కు పిలుపునిచ్చిన‌ప్ప‌టికీ చివ‌రికి తాజా, మాజీ ఎమ్మెల్యేల‌దే ఆధిప‌త్య‌మ‌నేది బ‌హిరంగ అంశం. అధికారంలో ఉన్న‌ప్పుడే 33 జిల్లాల‌కు పార్టీ జిల్లా అధ్య‌క్షుల‌ను నియ‌మించారు. ఈ జిల్లా అధ్య‌క్షులు పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు కార్య‌క్ర‌మాల‌కు నామ‌మాత్రంగా అధ్య‌క్ష‌త‌ వ‌హించడం త‌ప్ప‌ చేసిందేమీలేదు. అప్పట్లోనే వారిని ఎమ్మెల్యేలు పట్టించుకోలేదని, తాజా ప‌రిస్థితిల్లో వారి మాట‌ను ప్ర‌స్తుత‌, మాజీ ఎమ్మెల్యేలు వింటారా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇప్ప‌టికే ప‌లు జిల్లాల్లో మాజీ ఎమ్మెల్యేలే నియోజ‌క‌వ‌ర్గ స్థాయి స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నా.. జిల్లా అధ్య‌క్షులు హాజ‌రుకావ‌డం లేదంటే ఆ పార్టీలో వారి స్థాన‌మేమిటో అర్థం చేసుకోవ‌చ్చు.

నేటికీ అసమ్మ‌తి కుంప‌ట్లు

రాష్ట్ర‌వ్యాప్తంగా కొన్నిచోట్ల మిన‌హా మెజార్టీ నియోజ‌క‌వ‌ర్గాల్లో గ‌త‌ ప‌దేండ్లు దాదాపు ఒక్క‌రే ఎమ్మెల్యేగా కొన‌సాగారు. ప‌దేండ్లలో నియోజ‌క‌వ‌ర్గంలో వారు చెప్పిందే వేదం, వారు చేసిందే ప‌ని అన్న‌ట్లుగా సాగింది. దీంతో గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు మెజార్టీ నియోజ‌క‌వ‌ర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల‌ తీరుపై తిరుగుబాట్లు వ‌చ్చాయి. జ‌న‌గామ‌, స్టేష‌న్ ఘ‌న్ పూర్, మానుకోట, వ‌ర్ధ‌న్న‌పేట‌ చివ‌రికి న‌ర్సంపేట‌, ప‌ర‌కాల‌, పాల‌కుర్తిలాంటి చోట్ల కూడా బ‌హిరంగంగా వ్య‌తిరేకించారు. జ‌న‌గామ‌, స్టేష‌న్ ఘ‌న్ పూర్ లాంటి చోట్ల త‌ప్ప పెద్ద‌గా సిట్టింగ్ ఎమ్మెల్యేల‌ను మార్చ‌లేదు. ప‌ర్య‌వ‌సానంగా మెజార్టీ స్థానాల్లో ఓట‌మి పాల‌య్యారు. అప్ప‌టి నుంచి దాదాపు ఈ 20 నెల‌ల కాలంలో పార్టీ నిర్మాణప‌ర‌మైన మార్పులు, నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌ల మార్పుల‌కు అవ‌కాశ‌మే లేకుండాపోయింది. ఈ ప‌రిస్థితుల్లో తిరిగి వారే ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో అనధికార ఇన్‌చార్జ్‌లుగా, పార్టీ ఏకైక బాసులుగా వ్య‌వ‌హ‌రిస్తున్న విష‌యం తెలిసిందే. అదే స‌మ‌యంలో పార్టీప‌ర‌మైన సాద‌క‌బాధకాలు కూడా వారే తీరుస్తున్నారు. పాత అసంతృప్తులు, అస‌మ్మ‌తి కుంప‌ట్లు ఇప్ప‌టికీ ఉన్నాయి. ఈ స్థితిలో పార్టీని ప్ర‌క్షాళ‌న చేయ‌కుండా స్థానిక ఎన్నిక‌ల‌ను ఎదుర్కోవ‌డ‌మంటే బ‌య‌టి నుంచి ఇబ్బందులు ఎదుర్కోవ‌డ‌మే కాకుండా ఇంటిపోరు కూడా త‌ప్ప‌క‌పోవ‌చ్చంటున్నారు. అందుకే కాంగ్రెస్ పాలనా వైఫల్యాలే బీఆరెస్‌కు దిక్కుగా మారాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే స్థానిక ఎన్నిక‌ల్లో అధికార కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసేందుకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఈ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ మొన్న‌టి శాస‌న‌స‌భ ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఇచ్చిన హామీల అమ‌లు పైన ప్ర‌శ్నించాల‌ని కేటీఆర్ సూచించారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వ హామీల‌లో వైఫ‌ల్యాల‌ను ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేసి పార్టీ విజ‌యానికి కృషి చేయాల‌ని పిలుపునివ్వడం గమనార్హం.