Sasi Tharoor Vs Congress | కాంగ్రెస్‌ పార్టీ నుంచి శశిథరూర్‌ నిష్క్రమణ తప్పదా?

కాంత కాలంగా కాంగ్రెస్‌ హైకమాండ్‌తో తిరువనంతపురం ఎంపీ శశి థరూర్‌ విభేదిస్తున్నారు. కేరళ పార్టీ నాయకత్వం కూడా ఆయనను దూరం పెడుతున్నది. ఈ పరిణామాలు శశి థరూర్‌ కాంగ్రెస్‌ పార్టీని విడిచిపెట్టేందుకు దారి తీస్తాయా? అనే అంశాన్ని వివరించే కథనం.

  • Publish Date - July 21, 2025 / 08:58 PM IST

Sasi Tharoor Vs Congress | అధినాయకత్వం దారిలోనే దాని కనుసన్నల్లో మెలిగే నాయకత్వం నడుచుకోవడం సహజం! ఈ పరిణామం కాంగ్రెస్‌లో మరోసారి కనిపిస్తున్నది. మరో కీలక నేత ఆ పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయేందుకు రంగం సిద్ధమవుతున్నదన్న సంకేతాలు బలంగానే వెలువడుతున్నాయి. ఆ నేత తిరువనంతపురం ఎంపీ శశి థరూర్‌! ఇప్పటికే పార్టీ అధిష్ఠానంతో ఆయనకు సంబంధాలు దెబ్బతిన్నాయన్న వాదనలు ఉన్నాయి. అవి ఇప్పుడు ఆయన సొంత రాష్ట్రం కేరళలోనూ రిఫ్లెక్ట్‌ అవుతున్నాయి. శశిథరూర్‌ను కొందరు కేరళ కాంగ్రెస్‌ నాయకులు బాహాటంగానే విమర్శిస్తుండటం, ఆయన కార్యక్రమాలను బాయకాట్‌ చేస్తూ ఉండటంతో ఇక ఎన్నో రోజులు ఆయన కాంగ్రెస్‌లో కొనసాగే అవకాశాలు లేవన్న చర్చలు జోరందుకున్నాయి.

ఇకపై తిరువనంతపురంలో పార్టీ కార్యక్రమాలకు శశిథరూర్‌ను ఆహ్వానించే ప్రసక్తి లేదని కేరళ కాంగ్రెస్‌లో సీనియర్‌ నేత కే మురళీధరన్‌ జూలై 20న బహిరంగంగా ప్రకటించారు. ఆయన మాటలను గమనిస్తే.. ఇక శశిథరూర్‌ తమ పార్టీ వాడు కాదన్న భావన కనిపిస్తున్నది. థరూర్‌ అంశంలో నిర్ణయం తీసుకోవాల్సింది పార్టీ హైకమాండేనని చెప్పిన ప్రతిపక్ష నేత వీడీ సతీశన్‌ మాటలతో ఏకీభవించిన మురళీధరన్‌.. ఆయన విషయంలో పార్టీ అధిష్ఠానానిదే తుది నిర్ణయమని అన్నారు. అంతకు ముందు జూలై 19న ఎర్నాకుళం జిల్లా కాంగ్రెస్‌ కమిటీ కోచీలో ఒక నిరసన ప్రదర్శనకు ఆయనను ఆహ్వానించకూడదని నిర్ణయించింది. అదే రోజు ఆయన కోచీలో ఉన్నా.. ఆయనను పిలువలేదు. ఈ ఘటన తర్వాతే తిరువనంతపురంలో పార్టీ కార్యక్రమాలకు థరూర్‌ను బహిష్కరిస్తున్నట్టు మురళీధరన్‌ ప్రకటన చేయడం గమనార్హం.

మొన్నటి జూన్‌ నెలలో నీలంబుర్‌ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక సమయంలో యూడీఎఫ్‌ ప్రచార కార్యక్రమాలకు థరూర్‌ దూరంగా ఉన్నారు. థరూర్‌కు, పార్టీ అధిష్ఠానానికి మధ్య పొసగని పరిస్థితి నెలకొన్న సమయంలో ఈ ఉప ఎన్నిక వచ్చింది. ఆపరేషన్‌ సిందూర్‌ అనంతరం వివిధ దేశాలకు పంపే అఖిలపక్ష బృందంలో థరూర్‌ను చేర్చుతూ ఎన్డీయే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ తేడాలు బయటకు వచ్చాయి. అయితే.. తనను ఆహ్వానించని కారణంగానే తాను నీలంబర్‌ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొనలేదని థరూర్‌ చెబుతున్నారు. జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలపై పార్టీల మధ్య సహకారాన్ని తరచుగా నమ్మక ద్రోహం అన్నట్టు చూస్తుంటారని శనివారం థరూర్‌ వ్యాఖ్యానించడం కాక రేపింది. ప్రస్తుత పరిణామాలపై కాంగ్రెస్‌ పార్టీ వైఖరిని ఆయన తన వ్యాఖ్య ద్వారా తప్పుబట్టారన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

మరోవైపు కాసర్‌గోడ్‌ ఎంపీ రాజ్‌మోహన్‌ ఉన్నిథన్‌ కూడా థరూర్‌పై తీవ్ర స్థాయిలోనే విమర్శల దాడి మొదలు పెట్టారు. పార్టీ పార్లమెంటరీ సమావేశాల్లో థరూర్‌ ఉంటే.. పార్టీ ఆంతరంగిక గోప్యతకు ప్రమాదం ఉంటుందని అన్నారు. అక్కడితో ఆగని రాజ్‌మెహన్‌.. కీలకమైన సమాచారాలు ప్రధాని మోదీకి లీక్‌ అవుతాయంటూ వ్యాఖ్యానించారు. స్వచ్ఛందంగా పార్టీని వదిలిపోవాలని సలహా కూడా ఇచ్చారు. ‘పార్టీ బహిష్కరించే దాకా ఎదురుచూసి.. బలిపశువును చేశారని చెప్పుకొనేందుకు ఎదురుచూడాల్సిన అవసరం లేదు. అదేదో ఇప్పుడే రాజీనామా చేస్తే ఉత్తమం. అందరూ అదే కోరుకుంటున్నారు’ అని ఆయన అన్నారు.

ఇక్కడో విచిత్రం ఏమిటంటే.. మురళీధరన్‌, ఉన్నథన్‌ ఇద్దరూ పార్టీ నాయకత్వంతో ఇబ్బందికర పరిస్థితులు అనుభవించినవారే. అంతేకాదు.. వారి కెరీర్‌లో అడ్డంకులూ ఎదురయ్యాయి. పార్టీ అధినాయత్వంతో పొసగక మురళీధరన్‌, ఆయన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి కే కరుణాకరన్‌ పార్టీకి రాజీనామా కూడా చేశారు. మళ్లీ పార్టీలోకి వచ్చేందుకు 2009లో మురళీధరన్‌ ప్రయత్నించినప్పుడు గతంలో ఆయన చేసిన విమర్శలను ప్రస్తావిస్తూ హైకమాండ్‌ నో చెప్పింది. ఆయన తండ్రి కరుణాకరన్‌ మరణానంతరం ఎట్టకేలకు 2011 ఫిబ్రవరిలో ఆయన మళ్లీ కాంగ్రెస్‌లోకి వచ్చారు. ఉన్నిథన్‌ విషయానికి వస్తే.. 2009లో అప్పటికి ఏఐసీసీ సభ్యుడిగా ఉన్న ఆయనను హైకమాండ్‌ తప్పించింది. ఆయనపై వచ్చిన వ్యక్తిగత ఆరోపణల నేపథ్యంలో ఆ నిర్ణయం తీసుకుంది. శశి థరూర్‌ కెరీర్‌లో కూడా చాలా వివాదాస్పద పరిణామాలు ఉన్నాయి. వాటిలో పార్టీ హైకమాండ్‌ అనేక సందర్భాల్లో చూసీ చూడనట్టు వ్యవహరించిందని కేరళ కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. గతంలో ఏఐసీసీ అధ్యక్ష పదవికి మల్లికార్జున ఖర్గేపై థరూర్‌ పోటీ చేసినప్పుడు ఆయనకు మద్దతు పలికినవారు కూడా ఇప్పుడు మౌనం దాల్చారంటే.. పరిస్థితులు తెగే స్థాయికి వెళ్లిపోయినట్టేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పరిణామాలు ఎలా ఉన్నా.. రాబోయే కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి ముఠా తగాదాలకు నిలయమైన కేరళ కాంగ్రెస్‌లో తగిన నాయకుడు శశి థరూరేనంటూ ఒక సంస్థ చేసిన సర్వేను ఆయన తన సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం కొసమెరుపు.