- కాంగ్రెస్ ప్రతిపాదించని వ్యక్తి ఎంపిక
- ఇండియా గ్రూప్‌లో ఏకాకిగా కాంగ్రెస్
- సైనిక చర్యపై సర్కార్‌కు శశి ప్రశంస
- కాల్పుల విరమణపై ప్రశ్నిస్తున్న కాంగ్రెస్
- ఈ సమయంలో శశిథరూర్ నియామకం
- కొంతకాలంగా అధిష్ఠానంతో సయోధ్యలేదు
ప్రభుత్వ నిర్ణయం షాక్ కలిగించింది
- మర్యాదపూర్వకంగా పేర్లు అడిగారని భావించాం
- కానీ.. దుష్టతలంపుతో వ్యవహరించారు
- ఎందుకు అర్థం కావడం లేదు
- మీడియాతో కాంగ్రెస్ నేత జైరాం రమేశ్
BJP Mind Game | ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా ప్రపంచ దేశాలకు ఢిల్లీ సందేశాన్ని చేరవేసేందుకు కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కదిపినపావులు రాజకీయంగా ఆసక్తి రేపుతున్నాయి. ఇండియా కూటమికి సారథ్యం వహిస్తున్న కాంగ్రెస్‌ను అదే కూటమిలో మరోసారి ఏకాకిని చేయడంలో బీజేపీ సఫలమైంది. అదే సమయంలో కాంగ్రెస్‌పార్టీలో అంతర్గత సమస్యలు కూడా బహిర్గతమయ్యాయి. వివిధ దేశాలకు పంపే భారత బృందాలకు వివిధ పార్టీల నుంచి కూడా నేతలను ఎంపిక చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ తన తరఫున నాలుగు పేర్లను ప్రతిపాదించింది. అయితే.. అనూహ్యంగా.. ఆ నాలుగు పేర్లలో లేని శశిథరూర్‌ను ఎంపిక చేయడం ద్వారా బీజేపీ మైండ్‌గేమ్ (BJP Mind Game) ఆడిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ ప్రతిపాదించినవారిలో మాజీ కేంద్ర మంత్రి ఆనంద్ శర్మ, లోక్‌సభలో కాంగ్రెస్ ఉప నేత గౌరవ్ గగోయ్, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సయీద్ నజీర్ హుస్సేన్, లోక్‌సభ సభ్యుడు రాజా బ్రార్ ఉన్నారు. కానీ.. వీరినెవ్వరినీ బీజేపీ పరిగణనలోకి తీసుకోకపోవడం గమనార్హం. ప్రభుత్వం ఒక్కో పార్టీ నుంచి ప్రతినిధిని ఎంపిక చేసే పక్షంలో పేర్లు అడగాల్సిన అవసరం ఏంటన్న చర్చ కూడా వస్తుంది. రాహుల్‌గాంధీని నిస్సహాయుడిని చేసే క్రమంలోనే బీజేపీ ఈ మైడ్‌గేమ్‌కు పాల్పడిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
శశిథరూర్ వర్సెస్ అధిష్ఠానం
కాంగ్రెస్‌లో శశిథరూర్ వర్సెస్ పార్టీ అన్నట్టు పరిస్థితులు చాలాకాలంగా ఉన్నాయి. ప్రత్యేకించి పాక్ ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో భారత సైన్యం తీసుకున్న చర్యల విషయంలో ప్రభుత్వాన్ని అభినందిస్తూ శశిథరూర్ మాట్లాడారు. దానికి అధికారపక్షం నుంచి ప్రశంసలు రాగా.. సొంత పార్టీ నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఒకవైపు సీజ్‌ఫైర్ ఒప్పందం విషయంలో మోదీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన కాంగ్రెస్.. ఏ షరతులకు లొంగి సీజ్‌ఫైర్‌కు ఒప్పుకొన్నారని ప్రశ్నిస్తున్నది. ఈ తరుణంలో సైనిక చర్యలపై ప్రశంసలు కురిపించిన శశిథరూర్‌ను ఎంపిక చేయడం కాంగ్రెస్‌కు పుండుపై కారం చల్లినట్టయిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ అధిష్ఠానంతో థరూర్‌కు సరైన సంబంధాలు లేవన్న అభిప్రాయాలు ఉన్నాయి. 2014లో మోదీ గురించి ఒక పాజిటివ్ వ్యాసం రాయడంతో శశిథరూర్‌ను పార్టీ అధికార ప్రతినిధి హోదా నుంచి తప్పించారు. పార్టీలో సంస్థాగత సంస్కరణలకు 2020లో డిమాండ్ చేసిన జీ 23 నేతల బృందంలో థరూర్ కూడా ఒకరు. ఆ తర్వాత ఆ బృందంలోని చాలా మంది కాంగ్రెస్‌ను వదిలేశారు. 2022లో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల డ్రామా కూడా ఇక్కడ ప్రస్తావనార్హం. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఉందని బలవంతంగా చాటి చెప్పేందుకు జరిగిన ప్రయత్నంలో అధ్యక్ష ఎన్నిక నిర్వహించారు. ఆ స్థానానికి గాంధీ కుటుంబం మల్లికార్జున ఖర్గేను బలపర్చగా, ఆయనకు వ్యతిరేకంగా శశిథరూర్ పోటీలో నిలిచారు. సహజంగానే గాంధీ కుటుంబం బలపర్చిన నాయకుడే అధ్యక్షుడు అవుతాడనడంలో అప్పుడు కూడా ఎలాంటి సందేహాలు రాలేదు. అదే జరిగింది కూడా. అప్పటికి వెయ్యికిపైగా ఓట్లను శశిథరూర్ సాధించగలిగారు. తాజాగా కాంగ్రెస్ అధికారికంగా ప్రతిపాదించిన పేర్లను కాదని శశిథరూర్‌ను అంతర్జాతీయ దౌత్య బృందానికి నేతృత్వం వహించే అవకాశం ఇవ్వడం ఆ పార్టీలో థరూర్ వర్సెస్ అధిష్ఠానం అనే ఫ్యాక్టర్‌ను మరోసారి ముందుకు తెచ్చిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
దిగ్భ్రాంతికి గురి చేసింది : జైరాం రమేశ్
తాము ఇచ్చిన పేర్ల నుంచి కాకుండా శశిథరూర్‌ను ఎంపిక చేయడం తమను దిగ్భ్రాంతికి గురి చేసిందని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు. ‘తదుపరి ఏం జరుగుతుందో నేను చెప్పలేను. పేర్లు వేరే. మా విధి మేం నిర్వహించాం. ప్రభుత్వం మర్యాదపూర్వకంగానే పేర్లను ప్రతిపాదించమని కోరినట్టు భావించాం. ప్రభుత్వం ఇలా దుష్టతలంపుతో ఎందుకు వ్యవహరించిందో అర్థం కావడం లేదు’ అని ఆయన చెప్పారు. ప్రభుత్వ ప్రతిపాదనను థరూర్ అంగీకరించడంపై ప్రశ్నించగా.. కాంగ్రెస్‌లో ఉండటానికి, కాంగ్రెస్‌కు చెంది ఉండటానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత దూరం ఉందని వ్యాఖ్యానించారు. ఇటువంటి బహుళ పార్టీ ప్రతినిధి బృందాలు ప్రజాస్వామిక వ్యవస్థలో సాధారణమే. గతంలో 1963లో ఇటువంటి ప్రతినిధి బృందానికి నాటి ప్రతిపక్ష నేత సీ రాజగోపాలాచారిని అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ నియమించారు. ఒక ప్రతినిధి బృందంలో జయప్రకాశ్ నారాయణ్‌ను నాటి ప్రధాని ఇందిరాగాంధీ నియమించారు. అటల్ బిహారీ వాజ్‌పేయిని పీవీ నర్సింహారావు నియమించారు. అయితే.. ఒక ఎంపీ నామినేట్ అయినప్పుడు పార్టీ నాయకత్వం సమ్మతిని పొందాలి.’ అని జైరాంరమేశ్ చెప్పారు.
ఇవి కూడా చదవండి..