హైదరాబాద్, సెప్టెంబర్ 21 (విధాత): ఎన్డీఏ ప్రభుత్వం జీఎస్టీ పేరిట తీసుకు వచ్చిన తొమ్మిది శ్లాబుల అంశంపై ఏఐసీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన సరళమైన, సమర్థవంతమైన జీఎస్టీకి బదులు ఎన్డీఏ ప్రభుత్వం తొమ్మిది వేర్వేరు శ్లాబుల ద్వారా గబ్బర్ సింగ్ పన్ను విధించిందని విమర్శించారు. ఎనిమిది ఏళ్లలో ప్రజల నుంచి రూ.55 లక్షల కోట్లకు పైగా వసూలు చేసిందని మండిపడ్డారు. ప్రజలపై ఆర్థికంగా తీవ్ర భారం పడ్డ తర్వాత ప్రధాని మోదీ పొదుపు పండగ గురించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి మోదీ తీరు వంద ఎలుకలు తిన్న తర్వాత పిల్లి తీర్థ యాత్రలకు వెళ్లినట్లు ఉందని ఎద్దేవా చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ అగ్ర నేత మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు.