Site icon vidhaatha

సూట్లు వేసుకుని సీఈవోల్లా పారిశ్రామికవేత్తల సదస్సుకు స్కూలు టీచర్లు.. ఎక్కడో తెలుసా?

వైబ్రంట్‌ గుజరాత్‌ 2017లో విడ్డూరం!
ఈ వ్యక్తిలో ఏ విషయంలోనైనా స్వచ్ఛత ఉన్నదా?
గ్లోబల్‌ ఇన్వెస్టర్లను మోసం చేసిన వ్యక్తి ప్రజలను ఎంతగా మోసం చేస్తారో!
ప్రధాని మోదీపై కేరళ కాంగ్రెస్‌ విమర్శల దాడి
నాటి గుజరాతీ పత్రిక క్లిప్పింగ్‌తో ట్విట్టర్‌లో పోస్టు

తిరువనంతపురం: ప్రధాని నరేంద్రమోదీ లక్ష్యంగా కేరళ కాంగ్రెస్‌ పార్టీ సోషల్‌ మీడియా విభాగం వరుస విమర్శనాస్త్రాలతో విరుచుకుపడింది. 2017 నాటి వైబ్రంట్‌ గుజరాత్‌కు సంబంధించిన వివాదాస్పద న్యూస్‌ క్లిప్పింగ్‌ను పోస్ట్‌ చేస్తూ ఆనాడు గుజరాత్‌ ముఖ్యమంత్రి హోదాలో ప్రపంచస్థాయి ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించారని ఆరోపించింది. ఒక గుజరాతీ పత్రికలో వచ్చిన కథనం క్లిప్పింగ్‌ ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారింది. దానిని కాంగ్రెస్‌ పార్టీ కేరళ సోషల్‌ మీడియా విభాగం తన సామాజిక మాధ్యమం ఖాతాల్లో పోస్ట్‌ చేసింది. సుమారు 450 మంది టీచర్లకు శిక్షణ ఇచ్చి, సీఈవో తరహాలో వారికి సూటుబూటు వేసి.. ఇన్వెస్ట్‌మెంట్‌ సమ్మిట్‌లో కూర్చొనబెట్టారనేది ఆ వార్త సారాంశం.

‘మీకు తెలుసా । 2017 వైబ్రంట్‌ గుజరాత్‌ సమ్మిట్‌లో 450 మంది టీచర్లకు శిక్షణ ఇచ్చి, సూట్‌లు వేసి, టైలు కట్టి బహుళజాతి కంపెనీల సీఈవోల మాదిరిగా కూర్చొనబెట్టారు. ఈ వ్యక్తిలో ఏదైనా స్వచ్ఛత ఉన్నదా? గ్లోబల్‌ ఇన్వెస్టర్లనే మోసం చేయగా లేనిది.. మిమ్మల్ని సునాయాసంగా ఎలాంటి అపరాధభావం లేకుండా ఎలా మోసం చేయగలరో ఊహించుకోండి’ అని దానికి క్యాప్షన్‌ జోడించింది. 2017 నాటి ఈ ఉదంతం బీజేపీ ప్రభుత్వ పనితీరులో విశ్వసనీయత, పారదర్శకతపై విమర్శను రేకెత్తించింది.

మోదీ మూడోసారి ప్రధాని పీఠం అధిష్ఠించిన నేపథ్యంలో ఆయన నాయకత్వాన్ని, విశ్వసనీయతను ప్రశ్నించే క్రమంలో కాంగ్రెస్‌ ఈ అంశాన్ని ఎక్కుపెట్టింది. ఇప్పటికే కేంద్రంలో అధికార, ప్రతిపక్ష కూటముల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ అంశం కూడా వివాదాస్పదం అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్‌ తదితర ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీని వివిధ అంశాల్లో ఇరకాటంలో పడేసేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో తాజా వివాదం తెరపైకి వచ్చింది.

మణిపూర్‌లో కొనసాగుతున్న సంక్షోభం పట్ల ప్రధాని మోదీ నిర్లక్ష్య వైఖరిని, కనీస సానుభూతి చూపని వైనాన్ని సైతం దుయ్యబడుతూ కాంగ్రెస్‌ కేరళ శాఖ సామాజిక మాధ్యమాల్లో ఒక పోస్టు పెట్టింది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు ఇచ్చిన సమాధానంలో మణిపూర్‌ అంశాన్ని ప్రస్తావించపోవడాన్ని ఆ పోస్టులో తీవ్రంగా విమర్శించింది.

మూడో పోస్టులో.. సోహ్నా, గురుగ్రామ్‌ మధ్య రెండేళ్ల క్రితమే ప్రారంభించిన ఫ్లైవోవర్‌ ధ్వంసం కావడాన్ని ప్రస్తావించింది. ‘గుర్తుందా? 1944 కోట్లతో 21 కిలోమీటర్ల పొడవైన ఆరు లేన్ల ఎలివేటెడ్‌ రహదారిని రెండేళ్ల క్రితమే ప్రారంభించారు. ఇటువంటి ప్రాజెక్టుల్లో ఎంత అవినీతి జరిగి ఉంటుందో ఊహించండి. అవినీతి వ్యతిరేకం అంటూ వాక్చాతుర్యాన్ని ప్రదర్శించిన ప్రధాని ఎవరిని మూర్ఖులను చేయాలనుకుంటున్నారు?’ అని ఆ పోస్టులో ప్రశ్నించింది.

Exit mobile version