Journalist Pension | కేరళ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఆ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత కల్పించింది. సంక్షేమ రంగానికి భారీగా నిధులు కేటాయించింది. పెన్షన్లు, మహిళా భద్రత, ఉపాధి పథకాలు, విద్యా రంగానికి, మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ. 14500 కోట్లు కేటాయించింది. ఈ విషయాన్ని కేరళ ఆర్థిక మంత్రి కేఎన్ బాలగోపాల్ నిన్న ఆ రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా చదివి వినిపించారు.
ఇక ఈ ఏడాది ఏప్రిల్‌లో కేరళ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నారు. పినరయి విజయన్ ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్. కాబట్టి సంక్షేమ రంగానికి పెద్దపీట వేస్తూ.. మధ్య, దిగువ తరగతి ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేశారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పని చేసే జర్నలిస్టుల పట్ల కేరళ ప్రభుత్వం ఉదార స్వభావాన్ని చాటుకుంది. జర్నలిస్టులకు ఇచ్చే పెన్షన్‌ను పెంచింది. ప్రస్తుతం ఉన్న పెన్షన్‌ను రూ. 13 వేలకు పెంచింది. అంటే రూ. 1500 పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి బాలగోపాల్ సభా వేదికగా ప్రకటించారు. ఈ క్రమంలో కేరళ ప్రభుత్వానికి ఆ రాష్ట్ర జర్నలిస్టులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఇక సామాజిక భద్రత కింద వృద్ధులకు ఇచ్చే పెన్షన్లను రూ. 2 వేలకు పెంచారు. అంగన్‌వాడీ వర్కర్లకు రూ. 1000, ఆయాలకు రూ. 500, ఆశా వర్కర్లకు రూ. 1000, ప్రీ ప్రైమరీ టీచర్లకు రూ. 1000కి పెంచారు. వీటితో పాటు డిగ్రీ వరకు విద్యార్థులకు ఉచిత విద్య కల్పించనున్నట్లు ప్రకటించారు. కేరళలో ఇప్పటి వరకు కేవలం ఇంటర్మీడియట్ వరకు మాత్రమే ఉచిత విద్యను కల్పిస్తున్నారు. మొత్తంగా కేరళ ప్రజలను ఆకట్టుకునే విధంగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
