Mango Fruits | వేసవి వచ్చిందంటే చాలు.. అందరి దృష్టి మామిడి పండ్ల( Mango Fruits )పైనే పడుతుంది. మామిడి పండ్లను కానీ, మామిడి రసాన్ని చాలా మంది ఎంతో ఇష్టపడుతారు. ఈ నేపథ్యంలో మామిడి పండ్లకు వేసవి( Summer )లో భారీగానే డిమాండ్ ఉంటుంది. ఇక మామిడి తోటలు( Mango Farm ) ఉన్న వారైతే.. మార్కెట్‌లో పెద్దగా పండ్లను కొనుగోలు చేయరు. అదే తోట లేని వారైతే.. మార్కెట్‌లో ఎంత ధర ఉన్నప్పటికీ మామిడి పండ్లను కొనుగోలు చేస్తుంటారు. అయితే మామిడి పండ్లు అంటే ఇష్టముండి.. ఆ తోట లేని వారికి ఇదొక అద్భుత అవకాశం.
అదేంటంటే.. మామిడి చెట్లను కిరాయికి ఇస్తున్నారు. తమిళనాడులోని కొచ్చిలో ఈ ఐడియా పురుడు పోసుకుంది. ఇలా మామిడి చెట్లను కిరాయికి ఇచ్చే సంస్థను రెంట్ ఏ ట్రీగా నామకరణం చేశారు. మ్యాంగో లవర్స్ తమకు నచ్చిన చెట్టును ఎంపిక చేసుకోవచ్చు. ఇక ఆ చెట్టుకు కాసే మామిడి పండ్లన్నీ మీ సొంతం.
ఒక్కో చెట్టు ధర రూ. 10,300
ఇక కస్టమర్స్ వేసవి కాలానికి ఒక్కో చెట్టుకు రూ. 10,300 కిరాయి చెల్లించాల్సి ఉంటుంది. కిరాయికి తీసుకున్న చెట్టుకు కాసే ప్రతి పండు కూడా మీకే సొంతమవుతుంది. అయితే చెట్టు సంరక్షణ మాత్రం ఆ తోట యజమానినే చూసుకుంటాడు.
మూడు నెలల కాలంలో 90 కిలోల పండ్లు
సాధారణంగా మామిడి పండ్లు వేసవి కాలంలోనే అందుబాటులో ఉంటాయి. ఉగాది నుంచి మొదలుకుంటే జూన్ వరకు అంటే దాదాపు మూడు నెలల పాటు మామిడి పండ్లు కాస్తాయి. ఈ మూడు నెలల్లో ఒక్కో చెట్టు 90 కిలోల వరకు దిగుబడి సాధిస్తుంది. అంటే రూ. 10,300 చెల్లించి 90 కిలోల మామిడి పండ్లను పొందొచ్చన్న మాట.
ఈ మూడు రాష్ట్రాల్లోనూ కిరాయికి మామిడి చెట్లు..!
తమిళనాడులోని కొచ్చిలోనే కాకుండా.. మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లోనూ మామిడి చెట్లను కిరాయికి ఇస్తున్నారు. ఇక ఒక్కసారి చెట్టును ఎంపిక చేసుకున్న తర్వాత.. ఆ చెట్టు బాగోగులు, సంరక్షణను పూర్తిగా తోట యజమానే చూసుకుంటారు. మామిడి పండ్లు చేతికొచ్చిన తర్వాత యజమాని నేరుగా కిరాయిదారుడికి పంపించనున్నాడు.
