PM Mallikarjuna Kharge? | ప్రధాని పదవికి నరేంద్రమోదీ రాజీనామా చేస్తే.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దేశ ప్రధాని అయ్యే అవకాశాలు ఉన్నాయని కర్ణాటక ముఖ్యమంత్రి ప్రధాన ఆర్థిక సలహాదారు బసవరాజ్ రాయరెడ్డి సోమవారం (21.07.2025) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఒక కార్యక్రమంలో మాట్లాడిన ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్.. 75 ఏళ్లు దాటిన రాజకీయ నాయకులు పదవుల నుంచి స్వచ్ఛందంగా వైదొలగాలని చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించిన రాయరెడ్డి.. ఆ మేరకు మోదీ రాజీనామా చేస్తే ఎన్డీయే ప్రభుత్వం మెజార్టీ కోల్పోతుందని అన్నారు. ఆ సమయంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. గాంధీ కుటుంబం ఉన్నత స్థాయి పదవులను త్యాగం చేసిన చరిత్రను పరిగణనలోకి తీసుకుంటే ఖర్గే ప్రధాని అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.
‘మోదీ దిగిపోతే.. జేడీయూ, టీడీపీ మద్దతు ఉపసంహరించుకునే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు కాంగ్రెస్‌కు అవకాశం వస్తుంది. రాహుల్ గాంధీ తొలి, సహజ చాయిస్ అవుతారు. కానీ.. గాంధీ కుటుంబానికి పదవులను త్యాగం చేసిన చరిత్ర ఉన్నది. గతంలో ప్రధాని పదవిని సోనియాగాంధీ త్యజించారు. ఏమో ఎవరికి తెలుసు? ఆశ్చర్యకర సంఘటనలు జరుగుతాయేమో! సీనియర్ నేత ఖర్గే పార్టీకి ఎంతో సేవ చేశారు. ఆయన పీఎం అవుతారేమో!’ అని బసవరాజ్ రాయరెడ్డి చెప్పారు.
బెళగావిలో జరిగిన స్టేట్ లెజిస్లేచర్ సమావేశంలో సైతం తాను ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశానని ఆయన గుర్తు చేశారు. ‘ఖర్గేకు ఈ రోజుతో 83 ఏళ్లు నిండుతాయి. దేశానికి, సమాజానికి, పార్టీకి ఆయన చేసిన సేవలతో మరే నాయకుడు సరిపోలలేడు’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఒకప్పుడు దళితుడు, సీనియర్ నేత ఖర్గేను ప్రధానిని చేస్తారా? అని బీజేపీ నాయకులు చేసిన హేళన నిజం కావచ్చేమోననేది తన ఆశ అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఖర్గే యాక్టింగ్ ప్రెసిడెంట్ కాదని, శక్తిమంతమైన అధ్యక్షుడని అన్నారు.
ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకుంటారని బసవరాజ్ రాయరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణ్‌దీప్ సుర్జేవాలా ఇటీవల కర్ణాటక పర్యటనకు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు నియెజకవర్గానికి 50 కోట్లు, ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాల అభివృద్ధికి 25 కోట్లు ఇవ్వాలన్న నిర్ణయానికి సంబంధం లేదని తెలిపారు.