Rahul Gandhi | లోక్‌సభ ప్రతిపక్ష నేతగా రాహుల్‌.. సీడబ్ల్యూసీలో ఏకగ్రీవ తీర్మానం

ఇండియా కూటమి అధికారంలోకి రావాల్సిన మెజారిటీ సాధించలేపోయినప్పటికీ గత ఎన్నికల కంటే మెరుగైన ప్రదర్శన చేసింది. 400 పార్‌ అన్న బీజేపీని 240 దగ్గరే నిలువరించింది

  • Publish Date - June 8, 2024 / 05:11 PM IST

దీనిపై రాహుల్‌ త్వరలోనే నిర్ణయం తీసుకుంటారన్న కేసీ వేణుగోపాల్‌

విధాత: ఇండియా కూటమి అధికారంలోకి రావాల్సిన మెజారిటీ సాధించలేపోయినప్పటికీ గత ఎన్నికల కంటే మెరుగైన ప్రదర్శన చేసింది. 400 పార్‌ అన్న బీజేపీని 240 దగ్గరే నిలువరించింది. ఇండియా కూటమికి నేతృత్వం వహించిన కాంగ్రెస్‌ పార్టీ 99 స్థానాలు గెలిచి రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్ష పాత్ర పోషించడానికి అవసరమైన సంఖ్యా బలం సాధించలేకపోయింది. 2019లో 52 స్థానాల్లో గెలువగా, 2014లో 44 సీట్లతోనే సర్దిపెట్టుకోవాల్సి వచ్చింది. గత రెండు ఎన్నికల కంటే కాంగ్రెస్‌ మెరుగైన ప్రదర్శన చేసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష నేత బాధ్యతలు తసీఉకోవాలని నేతలు బలంగా కోరుతున్నారు.

శనివారం జరిగిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ పార్టీ (సీడబ్ల్యూసీ) సమావేశం జరిగింది. దీనిపై సీనియర్‌ నేతలంతా సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం లోక్‌సభ విపక్షనేతగా రాహుల్‌గాంధీ పేరును ప్రతిపాదిస్తూ చేసిన తీర్మానాన్ని సీడబ్ల్యూసీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ మేరకు పార్టీ జనరల్‌ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌ వెల్లడించారు. ప్రతిపక్ష నేత బాధ్యతలు చేపట్టాలని రాహుల్‌ను ముక్తకంఠంతో కోరినట్టు చెప్పారు. దీనిపై ఆయన త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని అన్నారు.

ఈసారి ఎన్నికల్లో రాహుల్‌గాంధీ కేరళలోని వయనాడ్‌, యూపీలోని రాయ్‌బరేలీలో రెండు చోట్ల పోటీ చేసిన విషయం తెలిసిందే. రెండుచోట్లా ఆయన భారీ మెజారిటీతో గెలుపొందారు. దీంతో రాహుల్‌ ఈ రెండు స్థానాల్లో దేన్ని వదులుకుంటారనే దానిపై ఇంకా సందిగ్ధత నెలకొన్నది. దీనిపై కాంగ్రెస్‌ నేత వేణుగోపాల్‌ మాట్లాడుతూ.. ఈ నెల 17వ తేదీలోగా దీనిపై నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహించిన రాయ్‌బరేలీ లేదా అమేథీ నుంచి కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేస్తారని అంతా అనుకున్నారు.

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఏకే ఆంటోనీ కూడా ఈ రెండు స్థానాల్లో గాంధీ కుటుంబసభ్యులే పోట చేస్తారని చెప్పారు. కానీ అమేథీ నుంచి గాంధీ కుటుంబానికి విధేయుడుగా ఉన్న కిషోరీ లాల్‌ శర్మను బరిలోకి దించింది. ఆయన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని ఓడించారు. రాహుల్‌గాంధీ వయనాడ్‌ స్థానంలోనే కొనసాగుతారని, రాయ్‌బరేలీని వదులుకుంటారని తెలుస్తోంది. ఉప ఎన్నికల్లో రాయ్‌బరేలీ నుంచి ప్రియాంకను పోటీకి దించే అవకాశాలున్నట్లు రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్నది.

Latest News