సిక్కిం వరద భీభత్సంలో పెరుగుతున్న మృతులు

40 మంది గల్లంతు.. 23 మృతదేహాలు లభ్యం


గ్యాంగ్‌టక్‌ : సిక్కిం వరదలు పెను బీభత్సాన్ని సృష్టించాయి. దాదాపు 40 మంది కొట్టుకుపోగా.. ఇప్పటి వరకూ 23 మృతదేహాలను తీస్తా నది దిగువ ప్రాంతంలో కనుగొన్నారు. ఈ నెల మూడు – నాలుగు తేదీల మధ్య రాత్రిలో కుంభవర్షం కురిసి పెద్ద ఎత్తున వరదలు సంభవించాయి. వీటి ధాటికి దిగువ ప్రాంతాల్లోని వంతెనలు కొట్టుకపోయాయి.



తీస్తా నది జల విద్యుత్తు కేంద్రం సైతం వరదల్లో దెబ్బతిన్నది. తర్కోల, పంప్ కాక్ మధ్య గల ప్రధాన రోడ్లు, వంతెనలు అన్నీ వరదల్లో ధ్వంసమయ్యాయి. ఉధృతంగా వచ్చిన ఈ వరదల్లో సాధారణ ప్రజలతోపాటు ఏడుగురు ఆర్మీ జవాన్లు సైతం చనిపోయారు. వరదల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించడానికి భారతీయ సైన్యం పెద్ద ఎత్తున సహాయ చర్యలను చేపట్టింది.



వేల సంఖ్యలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆయా ప్రాంతాల్లో వరదల వల్ల చిక్కుకుపోయిన మోటర్ సైకిల్, ఇతర వాహనాలను కూడా ఆర్మీ సురక్షిత ప్రాంతాలకు తరలించింది. అవసరమైన చోట్ల హెలికాప్టర్లు వాడారు. ఎయిర్ ఫోర్స్ సహాయాన్ని కూడా తీసుకున్నట్టు సిక్కిం ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ విజయ భూషణ్ పాఠక్ తెలిపారు.



వరదలు అకస్మాత్తుగా రావడంతో సిక్కింలో 11 బ్రిడ్జిలు కొట్టుకుపోయాయి. ఇందులో 8 బ్రిడ్జిలు ఒక్క మగన్ జిల్లాలోనే ఉన్నాయి. మరో రెండు బ్రిడ్జీలు నాన్చీ జిల్లాలో, ఒకటి గ్యాంగ్‌టక్‌ జిల్లాలో కొట్టుకు పోయాయి. వరదల వల్ల మంచినీటి సరఫరా వ్యవస్థలు దెబ్బతిన్నాయి. మురుగు కాలువల వ్యవస్థ కూడా నాశనమైంది. సిక్కింలో కొట్టుకపోయిన ప్రధాన బ్రిడ్జి నిర్మాణంలో నకిలీ నిర్మాణ సామాగ్రి ఉపయోగించారని ముఖ్యమంత్రి చెప్పారు.