Delhi Blast: Panic Triggered Accidental Explosion, Not Suicide Attack – Intelligence Sources Reveal New Theory
- ఉగ్రవాదుల భయమే ఢిల్లీని కాపాడింది
- సరిగ్గా తయారుకాకముందే తరలింపు
- కారు కదలికలతో తక్కువ శక్తితో పేలిన బాంబు
- పూర్తి సామర్ధ్యంతో పేలిఉంటే వేలల్లో మృతులు
(విధాత నేషనల్ డెస్క్)
న్యూఢిల్లీ:
దేశ రాజధాని ఢిల్లీ ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన పేలుడు ఘటనలో తాజాగా సంచలన వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటన ఆత్మాహుతి దాడి కాదు, ఉగ్రవాదులు బాంబును తరలించే సమయంలో భయంతో జరిగిన పొరపాటు కారణంగా పేలిపోయిందని ఇంటెలిజెన్స్ వర్గాలు ధృవీకరించాయి.
కేంద్ర గూఢచారి సంస్థలు NDTVకి వెల్లడించిన సమాచారం ప్రకారం, పోలీసులు ఫరీదాబాద్‌లో 2,900 కిలోల పేలుడు పదార్థం పోలీసులు స్వాధీనం చేసుకోవడం, తద్వారా నిఘాసంస్థలు తమ నెట్వర్క్ అంతా బట్టబయలు చేయడంతో ఉమర్ బృందం తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
దీంతో వారు వెంటనే బాంబును వేరే చోటికి మార్చాలన్న తొందరలో తగిన జాగ్రత్తలు తీసుకోకుండా కారులో తరలించే ప్రయత్నం చేశారు. అయితే ఆ క్రమంలో ట్రాఫిక్‌లో కారు కదులుతుండగా రసాయన చర్య జరిగి బాంబు పేలిందని అధికారులు చెబుతున్నారు. ఇదే దేశవ్యాప్తంగా కలకలం రేపిన దిల్లీ ఐ20 కార్ పేలుడు వెనుక ఉన్న ప్రధాన కారణంగా భావిస్తున్నారు.
పూర్తికాని బాంబు – పేలిన “భయం”
ఇంటెలిజెన్స్ అధికారుల కథనం ప్రకారం, ఈ బాంబు పూర్తిగా తయారు కాలేదు. అంటే అందులో ఉన్న రసాయనాల సామర్థ్యానికి సరిపడా పేలుడుకు సిద్ధంగా లేదు. అదీకాక, తరలింపు, అమర్చడంలో సాధారణంగా ఉండే రక్షణ ఏర్పాట్లు ఇంకా చేయలేదు. చాలా బేసిక్ మాడల్‌లో ఉంది. బాంబు పూర్తిగా సెట్ చేయకముందే నిందితులు దాన్ని తరలించడం మొదలుపెట్టారని, పైగా డిటోనేటర్ మరియు రసాయనాలను సరిగ్గా అమర్చకపోవడంతో బాంబు పరిమితస్థాయిలోనే పేలిందని నిపుణులు నిర్ధారణకు వచ్చారు. సాధారణంగా ఇలాంటి బాంబుల్లో హ్యాండిల్ చేసేటప్పుడు పేలకుండా రక్షణ ఏర్పాట్లు ఉంటాయి. దాన్ని డిటొనేట్ చేసే స్విచ్ నొక్కినప్పుడే పేలతాయి. దీన్లో అలాంటి రక్షణ వ్యవస్థను ఇంకా అమర్చలేదు. సురక్షిత స్థలానికి తరలించాక, పూర్తిస్థాయిలో సిద్ధం చేద్దామని ఉమర్ ప్రణాళిక. విచారణాధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించినప్పుడు, బ్లాస్ట్ క్రేటర్ లేకపోవడం, మిశ్రమం సరిగా సెట్ కాకపోవడం, ప్రొజెక్టైల్ భాగాలు లేకపోవడం వంటి లక్షణాలు ఇది ఆత్మహుతి దాడి కాదని నిర్ధారించాయి. ట్రాఫిక్‌లో కదులుతుండగా ఐ20 కారు లోపల రసాయనాల ఒత్తిడి పెరిగి బాంబు దానంతటదే పేలిపోయిందని ప్రాథమిక అంచనా. కారు కదలికతో పేలుడు పరికరంలో స్టాటిక్ స్పార్క్ (స్థిర విద్యుత్ మెరుపు) ఏర్పడి బాంబు ప్రేరేపించబడిందని నిపుణులు భావిస్తున్నారు.
అంతా డాక్టర్ల ఆపరేషనే – డా.ఉమర్ నబీపై దృష్టి
ఈ ఘటనలో ప్రధాన నిందితుడు డాక్టర్ ఉమర్ నబీ, జమ్మూకశ్మీర్ పుల్వామా జిల్లాకు చెందిన వైద్యుడు అని ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. ఘటనకు మూడు రోజుల ముందు అతడు మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి తన కుటుంబంతో కూడా సంబంధాలు తెంచుకున్నాడు.
తాజా విచారణ ప్రకారం, ఈ నెట్‌వర్క్‌లో ఉన్నవారు చాలా మంది వైద్యులు కావడం ఆశ్చర్యకరమైన విషయం. వీరిలో అదీల్ అహ్మద్, ముజమ్మిల్ షకీల్, షాహీన్ షాహిద్ కూడా ఉన్నారు. సామాజిక సేవ పేరుతో సేకరించిన నిధులను ఉగ్రవాద కార్యకలాపాలకు మళ్లించినట్లు అధికారులు కనుగొన్నారు. పేలుడు తర్వాత ఢిల్లీ, హర్యాణా, జమ్మూకశ్మీర్ ప్రాంతాల్లో స్లీపర్ సెల్స్‌పై దాడులు, సోదాలు, అరెస్టులు వేగవంతమయ్యాయి. దాంతో భయపడ్డ ఉమర్, బాంబును తరలించాలనే ప్రయత్నంలో పొరపాటు జరిగిందని ఇంటెలిజెన్స్ నివేదిక స్పష్టం చేస్తోంది.
అదృష్టవశాత్తూ బాంబు పూర్తి సామర్థ్యంతో పేలకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు పేర్కొన్నారు. భద్రతా సంస్థలు సమయానికి చర్యలు తీసుకోవడంతో భారీ విపత్తు తప్పిందని ఒక అధికారి NDTVకి తెలిపారు. అదే వారి ప్లాన్ ప్రకారమే జరిగివుంటే ప్రాణనష్టం ఊహించలేని స్థాయిలో ఉండేదని ఆ అధికారి ఆందోళన వెలిబుచ్చారు.
ఢిల్లీ పేలుడు కేసు ఇప్పుడు కొత్త దిశగా ప్రయాణిస్తోంది. భద్రతా సంస్థలు ఇది దాడి కాదు, భయంతో జరిగిన ప్రమాద పేలుడు అని తేల్చిన నేపథ్యంలో ఎన్‌ఐఏ మరియు ఇంటెలిజెన్స్ వర్గాలు ఇప్పుడు ఈ వైద్యుల ఉగ్ర నెట్‌వర్క్‌కు సంబంధించిన ఆర్థిక కార్యకలాపాలు, నిధుల సహకారం వంటి వాటిపై దృష్టి సారిస్తున్నాయి.
భయంతో జరిగిన ఓ తప్పిదం వల్ల ఢిల్లీ పెను ప్రమాదం నుండి బయటపడింది. కానీ, ఈ డాక్టర్ మాడ్యూల్ ఇలాంటి బాంబులను తయారుచేసి వేర్వేరు భారత నగరాలకు ఇప్పటికే తరలించిందా అనేది తేల్చడం ప్రస్తుతం నిఘా సంస్థలు, జాతీయ దర్యాప్తు సంస్థ ముందున్న పెద్ద సమస్య.
