జమ్ము కశ్మీర్‌ ఎన్నికలపై ఈసీలో కదలిక … హర్యానా, జార్ఖండ్‌, మహారాష్ట్రతోపాటే ఎన్నికలు

హర్యానా, జార్ఖండ్‌, మహారాష్ట్ర అసెంబ్లీలతోపాటే జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీకి కూడా ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రం ఎన్నికల సంఘం సిద్ధమవుతున్నది. సవరించిన ఓటరు జాబితాలను ఆగస్ట్‌ 20నాటికి ప్రచురించనున్నట్టు ఈసీ ప్రకటించింది.

  • Publish Date - June 21, 2024 / 05:08 PM IST

ఆగస్ట్‌ 20 నాటికి ఓటరు జాబితాల ప్రచురణ
47 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు

న్యూఢిల్లీ : హర్యానా, జార్ఖండ్‌, మహారాష్ట్ర అసెంబ్లీలతోపాటే జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీకి కూడా ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రం ఎన్నికల సంఘం సిద్ధమవుతున్నది. సవరించిన ఓటరు జాబితాలను ఆగస్ట్‌ 20నాటికి ప్రచురించనున్నట్టు ఈసీ ప్రకటించింది. ఓటరు జాబితా స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌ షెడ్యూలు, పోలింగ్‌ కేంద్రాల హేతుబద్ధీకరణపై ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంత ఎన్నికల ప్రధానాధికారులకు ఈసీ లేఖ రాసింది. ఈ ప్రక్రియను జూన్‌ 25 నాటికి ప్రారంభించి.. జూలై ఒకటి కటాఫ్‌ తేదీగా ఓటర్‌ జాబితాను అప్‌డేట్‌ చేయాలని పేర్కొన్నది. ముసాయిదా ఓటరు జాబితాను జూలై 25 న ప్రచురించాలని తెలిపింది. ఆగస్ట్‌ 9 వరకూ ఓటర్ల నుంచి అభ్యంతరాలు తెలిపేందుకు అవకాశం కల్పించాలని సూచించింది. ఆగస్ట్‌ 20న తుది ఓటరు జాబితాను ప్రచురించాలని పేర్కొన్నది.
జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీని 2018లో రద్దు చేసిన విషయం తెలిసిందే.

అప్పటి నుంచి అసెంబ్లీ లేకుండానే జమ్ముకశ్మీర్‌లో పాలన నడుస్తున్నది. హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్‌ అసెంబ్లీలకు వరుసగా నవంబర్‌ 11, 2024, నవంబర్‌ 26, 2024, జనవరి 5, 2025తో గడువు ముగుస్తుంది. ఆలోపే వీటికి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. నియోజకవర్గాల పునర్విభజన అనంతరం కేంద్రపాలిత జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీకి కూడా సాధారణ ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఈసీ తెలిపింది. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో భారీగా ఓట్లు పోలైన నేపథ్యంలో జూలై 1, 2024ని అర్హత తేదీగా నిర్ణయించి, ఓటరు జాబితాను రూపొందించాలని అధికారులను ఆదేశించింది. ఎన్నికలు జరిగే రాష్ట్రాల అధికారులతో ఈ వారంలోనే ఈసీ ఒక సమావేశాన్ని నిర్వహించనున్నది. వీటితోపాటు.. దేశంలో ఖాళీగా ఉన్న 47 అసెంబ్లీ నియెజకవర్గాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు కూడా ఈసీ ఏర్పాటు చేస్తున్నది. ఆర్టికల్‌ 370ని రద్దు చేయడాన్ని సమర్థించిన సుప్రీంకోర్టు.. ఈ ఏడాది సెప్టెంబర్‌ 30 నాటికి అక్కడ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే.

Latest News