మాజీ ఐఏఎస్ అధికారి ప్రదీప్ శర్మ కు ఐదేళ్ల జైలు శిక్ష తో పాటు రూ.50వేల అపరాధ రుసుం విధిస్తూ పీఎంఎల్ఏ ప్రత్యేక కోర్టు తీర్పు ఇచ్చింది. గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లా కలెక్టర్ గా ప్రదీప్ శర్మ 2003 నుంచి 2006 మధ్య పనిచేసిన సమయంలో ప్రభుత్వ భూమిని రాయితీ రేటుకు కేటాయించారు. మరో కేసులో ఆయన ఇప్పటికే జైలు జీవితం అనుభవిస్తున్నారు.
అహ్మదాబాద్ జోన్ ఈడీ అధికారులు 2012 సంవత్సరంలో ప్రదీప్ పై ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్టు (పీఎంఎల్ఏ), ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఛార్జీ షీట్ దాఖలు చేసిన తరువాత 2016 లో అరెస్టు చేయగా, ఆయనకు 2018 మార్చి నెలలో బెయిల్ లభించింది. జిల్లా కలెక్టర్ గా ఉన్న ప్రదీప్ శర్మ భూముల ధరల నిర్థారణ కమిటీ కి ఛైర్మన్ గా కూడా ఉన్నారు. ప్రముఖ ప్రైవేటు కంపెనీ వెల్ స్పన్ ఇండియా లిమిటెడ్ కు రాయితీ రేటుకు పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములను సంతర్పణ చేశారు. కేవలం 40 రోజుల వ్యవధిలోనే వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చుతూ ఉత్తర్వులు జారీ చేశారు. అందుకు గాను కంపెనీ యాజమాన్యం జిల్లా కలెక్టర్ భార్య బ్యాంకు ఖాతాలో డబ్బులు వేయించుకున్నారు. తన భార్య (యూఎస్ రెసిడెంట్) ఖాతాలో అప్పట్లోనే సుమా రు.29.5 లక్షలు డిపాజిట్ చేయించుకున్నారు. ఇలా సమకూరిన అవినీతి సొమ్ములతో జిల్లా కలెక్టర్ భారీ భవనాలు, వ్యవసాయ భూములను పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. వెల్ స్పన్ సమకూర్చిన మొబైల్ సిమ్ ను వినియోగించడం ద్వారా రూ.2.24 లక్షల ఆర్థికంగా లభ్ధి పొందారు. అవినీతి సొమ్ముతో జిల్లా కలెక్టర్ భార్య వాల్యూ ప్యాకేజింగ్ ప్రైవేటు లిమిటెడ్ లో 2004 నుంచి 2007 మధ్య 30 శాతం మేర పెట్టుబడులు పెట్టారు. వాల్యూ ప్యాకేజింగ్ లిమిటెడ్, వెల్ స్పన్ కంపెనీ అనుబంధ సంస్థ. ఈ మొత్తాన్ని తన ఎన్ఆర్ఓ బ్యాంకు ఖాతా ద్వారా మళ్లించినట్లు వెల్లడైంది. జిల్లా కలెక్టర్ ప్రదీప్ శర్మ అవినీతి కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.1.20 కోట్ల నష్టం వాటిల్లినట్లు ఈడీ ప్రత్యేక కోర్టుకు తెలియచేసింది. విచారణ తరువాత ఈడీ అధికారులు 2012లో ప్రదీప్ శర్మ గాంధీ నగర్ జిల్లాలోని వ్యవసాయ భూములు, భవనాలను స్వాధీనం చేసుకున్నారు. ఇదే కాకుండా సా పైప్సు ప్రైవేటు లిమిటెట్ కు భూమి కేటాయింపు కేసులో భుజ్ కోర్టు ప్రదీప్ కు ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10వేల అపరాధ రుసుం 2025 ఏప్రిల్ నెలలో విధించింది. ఈయనతో పాటు మరొ ముగ్గురికి కోర్టు శిక్ష విధించగా, అందరూ ప్రస్తుతం జైలులో ఉన్నారు.
వెల్ స్పన్ కు కేటాయించిన భూమిపై ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్టు (పీఎంఎల్ఏ) సెక్షన్ 3, 4 కింద ఈడీ అధికారులు నమోదు చేసిన కేసుపై విచారించిన పీఎంఎల్ఏ జడ్జీ కేఎం.సోజిత్ర, మాజీ ఐఏఎస్ కు ఐదేళ్ల జైలుతో పాటు రూ.50వేల అపరాధ రుసుం విధిస్తూ తాజాగా తీర్పు ఇచ్చారు.
ఇవి కూడా చదవండి :
Giant Anaconda : సినిమా అనకొండ కాదు..నిజం పామునే!
Pragathi Tollywood Actrer| ప్రగతి అక్కా…పవర్ ఆఫ్ పవర్ లిఫ్టింగ్
