వారి అభ్యర్థులను చూశాక.. మాకు ప్రచారమే అవసరం లేకుండా పోయింది

ప్రధాని నరేంద్ర మోడీ భారత దేశ గౌరవాన్ని ప్రపంచ దేశాల ముందు సగర్వంగా నిలబెట్టారని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అన్నారు.

  • Publish Date - April 25, 2024 / 01:59 PM IST

గడీల వారసులు కావాలా?.. గరీబోళ్ల బిడ్డ కావాలా?
వాళ్లు కోట్లు ఖర్చు చేసి వేల కోట్లు సంపాదిస్తారు
నాకున్న ఆస్తులు ప్రజల కోసం కొట్లాడిన కేసులే!
బండి నామినేషన్ కార్యక్రమంలో భూపేంద్ర పటేల్, కిషన్ రెడ్డి

విధాత బ్యూరో, కరీంనగర్: ప్రధాని నరేంద్ర మోడీ భారత దేశ గౌరవాన్ని ప్రపంచ దేశాల ముందు సగర్వంగా నిలబెట్టారని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అన్నారు. స్థానిక బిజెపి అభ్యర్థి బండి సంజయ్ కుమార్ నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఎస్ ఆర్ ఆర్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు.

ప్రస్తుత లోకసభ ఎన్నికల్లో బిజెపి ఇప్పటికే తమ రాష్ట్రంలోని సూరత్ స్థానాన్ని ఏకగ్రీవంగా గెలుచుకున్న విషయాన్ని గుర్తు చేశారు. మరో 399 సీట్లలో బిజెపిని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. లోకసభ ఎన్నికల్లో రాష్ట్రం నుండి అత్యధిక స్థానాలు కట్టబెడితే తెలంగాణ సంక్షేమాన్ని మోడీ చూసుకుంటారన్నారు.

కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, కరీంనగర్ లోకసభ బరిలో నిలిచిన కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులను చూసిన తర్వాత తమ అభ్యర్థి బండి సంజయ్ ప్రచారం చేయాల్సిన అవసరం కూడా లేకుండా పోయిందన్నారు. ఆయనకు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు మెండుగా ఉన్నాయని చెప్పారు. అందుకే సంజయ్ ని రాష్ట్రవ్యాప్తంగా పార్టీ అభ్యర్థుల ఎన్నికల ప్రచార సభలలో పాల్గొనాలని కోరారు.

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ ఏ ముఖం పెట్టుకొని రాష్ట్ర ప్రజల ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నుండి గెలుపొందిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి పంపి ఇంకా రాజకీయాలు చేయడం ఎందుకని నిలదీశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటేనని, నాణనికి బొమ్మ, బొరుసు ఇలాంటివన్నీ తెలిపారు. ఇక్కడి బీఆర్ఎస్ అభ్యర్థికి దోచుకోవడమే తప్ప మరొకటి తెలియదని, కాంగ్రెస్ అభ్యర్థి ఏనాడైనా ప్రజల మధ్య ఉంటూ వారి పక్షాన పోరాటాలు చేశారా అని ప్రశ్నించారు.

లోకసభ బిజెపి అభ్యర్థి బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. కరీంనగర్ నుండి పోటీ చేస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులకు వందల కోట్ల ఆస్తులు ఉన్నాయని, ఎన్నికల్లో కొన్ని కోట్లు ఖర్చు చేసి, వేల కోట్లు సంపాదించుకుంటారని ఆరోపించారు. తనకు వాళ్ళ మాదిరిగా ఆస్తులు లేవన్నారు. కానీ ప్రజల కోసం కొట్లాడిన ఘటనల్లో వందలాది కేసులు మాత్రం ఉన్నాయన్నారు. గడీల వారసులు కావాలా? గరీబోళ్ల బిడ్డ కావాలా? ప్రజలే తెల్చుకోవాలన్నారు.

‘నేను పక్కా లోకల్.. మీకోసమే నిరంతరం కొట్లాడా.. లాటి దెబ్బలు తిన్నా, జైలుకు వెళ్ళా.. ఈ పోరాటమంతా ఎస్సీ, ఎస్టీ, బీసీలతో ఆటో అగ్రవర్ణాల్లోని పేదల కోసమే’ అని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ మళ్లీ అధికారంలోకి రాబోతున్నారని, దేశాన్ని ప్రపంచ చిత్రపటంలో నెంబర్ వన్ స్థానానికి తీసుకు వెళ్లేందుకు కృషి చేస్తున్నారని, ఆ కృషిలో ఈ నియోజకవర్గ ప్రజలు భాగస్వాము లు కావాలని, ఇక్కడి సీటు గెలిపించి ఆయనకు కానుకగా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

నామినేషన్ దాఖలు…

పార్లమెంట్ నలుమూలల నుండి భారీగా తరలివచ్చిన కార్యకర్తల సమక్షంలో బండి సంజయ్ కుమార్ బిజెపి అభ్యర్థిగా గురువారం తన నామినేషన్ దాఖలు చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, కేంద్రమంత్రి జీ కిషన్ రెడ్డి, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్, బిజెపి జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, ప్రతాప రామకృష్ణ తదితరుల సమక్షంలో ఆయన నామినేషన్ పత్రాన్ని ఎన్నికల అధికారి పమేలా సత్పతికి అందజేశారు.

నామినేషన్ దాఖలు అనంతరం పార్టీ నేతలతో కలిసి ఆయన కలెక్టరేట్ నుండి ఎస్ ఆర్ ఆర్ కళాశాల వరకు ఊరేగింపుగా ముందుకు సాగారు. ఈ సందర్భంగా రహదారికి ఇరువైపులా భారీ సంఖ్యలో నిలిచిన ప్రజలు, బిజెపి కార్యకర్తలు ప్రధాని మోడీకి అనుకూల నినాదాలు చేశారు.

Latest News