Sarada Muraleedharan | చాలా మంది భార్యాభర్తలు.. ఐఏఎస్( IAS ), ఐపీఎస్( IPS )లుగా తమ వృత్తి జీవితాన్ని నిర్వర్తించారు. భార్యాభర్తలిద్దరూ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు లేదా ఐఏఎస్, ఐపీఎస్ పదవుల్లో ఉన్న దంపతులను కూడా చూశాం. అయితే ఓ దంపతులిద్దరూ కూడా ఐఏఎస్ పదవుల్లో రాణించి.. పదవీ విరమణ సమయంలో ఓ చరిత్ర సృష్టించారు. భర్త సీఎస్‌గా పదవీ విరమణ పొందిన తర్వాత.. ఆయన నుంచి భార్య సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ అరుదైన ఘటన కేరళ( Kerala ) రాష్ట్రంలో ఆవిష్కృతం అవడం ఇదే ప్రథమం.
వీ వేణు( V Venu ), శారదా మురళీధరన్( Sarada Muraleedharan ) 1990 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్లు( IAS Officers ). వీరిద్దరూ దంపతులు కూడా. 34 ఏండ్ల పాటు వివిధ హోదాల్లో కేరళ రాష్ట్రంలో పని చేశారు. కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వేణు ఆగస్టు 31న పదవీ విరమణ పొందారు. ఆయన భార్య శారదా మురళీధరన్ కొత్త సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించారు. తిరువనంతపురంలోని సెక్రటేరియట్‌లో భర్త నుంచి భార్య బాధ్యతలు తీసుకున్నారు. 1990 బ్యాచ్‌కు చెందిన ఈ ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు.. సీనియారిటీ ప్రకారం వేణు తర్వాత శారద ఉండడంతో ఆమె సీఎస్‌గా బాధ్యతలు తీసుకున్నారు.
అయితే వేణు పదవీ విరమణ సందర్భంగా గత శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు. ఈ వీడ్కోలు సమావేశంలో కేరళ సీఎం పినరయి విజయన్( CM Pinarayi Vijayan ) మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా వేణు స్థానంలో ఆయన భార్య శారదా మురళీధరన్ బాధ్యతలు చేపట్టనున్నారని ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శిగా ఆమె పని చేస్తున్నారు. ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ పొందుతున్న వీ వేణు నుంచి ఆయన భార్య శారదా మురళీధరన్.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించనున్నారని చెప్పారు. ఇటువంటి సంఘటనలు అరుదుగా జరుగుతాయన్నారు. భార్యాభర్తలు ఇద్దరూ కలెక్టర్లుగా.. వివిధ శాఖల అధిపతులుగా, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా వేర్వేరు సమయాల్లో విధులు నిర్వర్తించడం విశేషం అన్నారు.
తన భర్త వేణు వీడ్కోలు సమావేశంలో శారదా మురళీధరన్ మాట్లాడుతూ.. ‘నేను ఇప్పుడు కొంచెం ఆందోళనకు గురవుతున్నాను. ఆయన పదవీ విరమణ తర్వాత మరో ఎనిమిది నెలలు సర్వీసులో కొనసాగాల్సి ఉంది. మేం ఇద్దరం ఒకేసారీ సర్వీసులో చేరాం. కానీ ఒకేసారి రిటైర్ కావడం లేదు’ అని శారదా తెలిపారు.
ఎవరీ శారదా మురళీధరన్..?
శారదా మురళీధరన్.. ఇండియాలోని హోలీ ఏంజెల్స్ కాన్వెంట్ స్కూల్‌లో తన విద్యను పూర్తి చేశారు. 1990లో సివిల్స్‌లో ఉత్తీర్ణత సాధించి, ఐఏఎస్ కేడర్‌కు ఎంపికయ్యారు. మహిళా సాధికారత, పేదరికం తగ్గింపు, సామాజిక న్యాయం కోసం ఆమె విశేషంగా కృషి చేశారు. 2006 నుంచి 2012 వరకు కేరళ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన కుదుంబశ్రీ మిషన్‌లో కీలకంగా పని చేశారు. 2013లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ రూరల్ లైవ్‌లీహుడ్స్ మిషన్‌లో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా సేవలందించారు. 2014 నుంచి 2016 వరకు పంచాయతీరాజ్ శాఖలో జాయింట్ సెక్రటరీగా పని చేశారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీకి డైరెక్టర్ జనరల్‌గా 2016లో నియమితులయ్యారు. ఈ సంస్థలో రెండున్నరేండ్ల పాటు పని చేశారు. త్రివేండ్రం జిల్లా కలెక్టర్‌గా పని చేశారు. ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ డైరెక్టర్‌గా కూడా సేవలందించారు. రూరల్ డెవలప్‌మెంట్ కమిషనర్‌గా, కాలేజీయేట్ ఎడ్యుకేషన్‌లో డైరెక్టర్‌గా పని చేశారు.