- రిజ్వీ పదవీకాలం పూర్తి
- జూబ్లీహిల్స్ ఎన్నికల తరువాత మళ్లీ బదిలీలు
హైదరాబాద్, విధాత
మెట్రోపాలిటన్ ఏరియా అండ్ అర్భన్ డెవలప్ మెంట్ డిపార్ట్ మెంట్ కార్యదర్శి గా ఆరు నెలలు ముగియక ముందే కే.ఇలంబర్తిని రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనను రవాణా కమిషనర్ గా నియమిస్తూ శక్రవారం నాడు ఉత్తర్వులు జారీ అయ్యాయి. మెట్రోపాలిటన్ ఏరియా అండ్ అర్భన్ డెవలప్ మెంట్ డిపార్ట్ మెంట్ కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణారావు కు అప్పగించారు. హెచ్ఎండీఏ పరిధిలో ఫైళ్లను ఇలంబర్తి త్వరగా పరిష్కరించకుండా పెండింగ్ లో పెట్టడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహంతో ఉన్నట్లు సచివాలయంలో ఉద్యోగులు చర్చించుకుంటున్నారు.
నెలల కొద్దీ ఫైళ్లపై సంతకాలు పెట్టకుండా నిర్లక్ష్యం చేయడం, నిర్ణయాలు తీసుకోవడంలో ఆచితూచి వ్యవహరించడం కూడా కారణంగా చెబుతున్నారు. ఇక్కడకు రాక ముందు ఆయన గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కమిషనర్ గా నియమించింది. అక్కడ కూడా ఇదే రీతిన వ్యవహరించడంతో బదిలీ చేసి సచివాలయంలోని మెట్రోపాలిటన్ ఏరియా అండ్ అర్భన్ డెవలప్ మెంట్ డిపార్ట్ మెంట్ కార్యదర్శి గా నియమించిన విషయం తెలిసిందే. జీహెచ్ఎంసీ కమిషనర్ గా 2024 అక్టోబర్ 17 నుంచి 2025 ఏప్రిల్ నెలాఖరు వరకు పనిచేశారు. అక్కడ కూడా ఏడు నెలలకు మించి పనిచేయలేదు. ముక్కు సూటి అధికారి గా పేరున్న ఆయన వివాదాస్పద ఫైళ్ల విషయంలో సాచివేత వైఖరి అవలంబించడం మూలంగానే బదిలీ చేసినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి.
ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సవ్యసాచి ఘోష్ (1994 బ్యాచ్) ను పశు సంవర్థక శాఖ నుంచి బదిలీ చేసే సంక్షేమ, అభివృద్ధి పథకాల శాఖ బాధ్యతలు అప్పగించారు. మహిళా, శిశు అభివృద్ధి శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్ (2004 బ్యాచ్) కు గిరిజన సంక్షేమ కమిషనర్ గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. బీసీ వెల్ఫేర్ కార్యదర్శి ఈ.శ్రీధర్ (2004 బ్యాచ్) కు జీఏడీ పొలిటికల్ సెక్రెటరీ గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటి వరకు ఈ పదవిలో పనిచేసిన సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ (1999 బ్యాచ్) వీఆర్ఎస్ పెట్టుకున్న విషయం తెలిసిందే. డైరెక్టర్ హర్టీకల్చర్ ఎస్.కే.యాస్మిన్ బాషా (2015 బ్యాచ్) కు టీజీ ఆయిల్ ఫెడ్ డైరెక్టర్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు. మహాత్మా జ్యోతిబా పూలే విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శి బీ.సైదులు కు సంక్షేమ, అభివృద్ధి పథకాల ప్రత్యేక కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. అదిలాబాద్ జిల్లా పరిషత్ సీఈఓ జీ.జితేందర్ రెడ్డి ని ఎస్సీ డెవలప్ మెంట్ స్పెషల్ కమిషనర్ గా నియమించి, టీజీ ఎస్సీ కార్పొరేషన్ ఎం.డీ గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పంచారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల కౌంటింగ్ తరువాత మళ్లీ భారీ ఎత్తున ఐఏఎస్ ల బదిలీలు జరగే అవకాశాలు ఉన్నాయి.
