హైదరాబాద్, సెప్టెంబర్ 19 (విధాత): తమకు రావాల్సిన డీఏ బకాయిలను ఒకేసారి చెల్లించాలని సీపీఎస్ ఉద్యోగులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు వినతిపత్రం అందించింది. సీఎస్‌ను కలిసిన వారిలో తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ, రాష్ట్ర నాయకులు కల్వల్ శ్రీకాంత్, నరేష్ గౌడ్, కోటకొండ పవన్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు నరేందర్ రావు ఉన్నారు. దీనిపై సానుకూలంగా స్పందించిన చీఫ్ సెక్రటరీ ఫైనాన్స్ సెక్రటరీ దృష్టికి ఈ విషయం తీసుకెళ్తానని తెలిపారని నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్థితప్రజ్ఞ మాట్లాడుతూ.. సీపీఎస్ ఎంప్లాయీస్ కరువు భత్యానికి కరువు వచ్చిందని అన్నారు. ఆరు నెలలకు ఒకసారి ఇచ్చే డీఏ రెండేళ్ల తర్వాత మంజూరు చేసి అది కూడా వాయిదా పద్ధతిలో చెల్లించడం అంటే.. సీపీఎస్ ఉద్యోగుల పరిస్థితి మూల్గే నక్కపై తాటికాయపడినట్లు ఉందన్నారు. ‘ప్రస్తుత ఉత్తర్వుల ప్రకారం 90% డీఏలను జనవరి 2025 నుండి 17, 28 సమాన నెలసరి వాయిదాలలో చెల్లించాలి. వీటిని ఫిబ్రవరి 1 2025న చెల్లించాలి. ఆ కాలానికి డీఏ సవరణ కారణంగా బకాయిలు పాత పెన్షన్ పథకం కింద కవర్ చేయబడిన ఉద్యోగులకు జీపీఎఫ్ అకౌంట్ లో ఒకేసారి జమ చేయబడతాయి. అందువల్ల ప్రభుత్వం జీపీఎఫ్ వడ్డీ రేట్ల ప్రకారం క్రెడిట్ మొత్తంపై వడ్డీ పొందుతారు. అయితే సీపీఎస్ కింద నియమించబడిన ఉద్యోగులకు ఈ వాయిదాల పద్ధతి ద్వారా అదే ప్రయోజనం కల్పించడం లేదు. అంతేకాకుండా ఈఎంఐ ప్రాతిపదికన పొందుతున్నారు’ అని స్థితప్రజ్ఞ తెలిపారు. సీపీఎస్ ఉద్యోగుల డీఏ బకాయిల బిల్లులు 17 ఈఎంఐలు 8, 28 ఈఎంఐలు.. ఈ మూడు బిల్లులను సంబంధిత డీడీవోలు సమర్పించి ఆడిట్ చేసినప్పటికీ ప్రభుత్వం వద్ద ఏప్రిల్ 2025 నుండి బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. ఇప్పటికీ రెండు సంవత్సరాలు అయినా అన్ని రికవరీలు ప్రాన్ అకౌంట్‌లో జమ చేయలేదని చెప్పారు. తద్వారా పదవీ విరమణ చెందిన సీపీఎస్ ఉద్యోగులు కూడా యాన్యుటీ కొనుగోలు చేయలేకపోతున్నారని పేర్కొన్నారు. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని మొత్తం బకాయిలను ఒకేసారి చెల్లించాలని రిటైర్ అయిన సీపీఎస్ ఉద్యోగస్తుల జీవనం సాఫీగా సజావుగా సాగేలా చూడాలని కోరారు.
సీపీఎస్ ఉద్యోగులకు కలిగే నష్టాలు..
1. జీపీఎఫ్ ఉద్యోగులకు వారి జీపీఎఫ్ ఖాతాల్లో వెంటనే సర్దుబాటు చేయడం వలన 8% వడ్డీ పొందుతారు. జమైన వెంటనే జీపీఎఫ్ ఖాతాలనుండి డబ్బులు డ్రా చేసుకోవచ్చు. అదే స్థాయిలో సీపీఎస్ ఉద్యోగి నష్టపోతున్నారు. వాళ్లు 18, 28 నెలలు ఎదురు చూడాలి.
2. పదవీ విరమణ పొందిన సీపీఎస్ ఉద్యోగి వెంటనే పెన్షన్ పొందే పరిస్థితి లేదు. 18 వాయిదాల్లో చెల్లించిన డీఏ నుండి రికవరీ చేసిన 10 శాతాన్ని ఉద్యోగి ప్రాన్‌లో జమ అయ్యేంత వరకు పెన్షన్ ప్లాన్ కొనుక్కునే అవకాశం లేదు. ఒకవేళ కొనుక్కున్న ప్రాన్ ఖాతా రద్దు అవుతుంది. తద్వారా ఉద్యోగికి చెందాల్సిన డబ్బులు ప్రభుత్వం ఖాతాలోనే ఉండిపోతాయి.
దీని మూలంగా వచ్చే 1000 లేదా 2000 పెన్షన్ కూడా పొందలేని నిస్సహాయ స్థితికి ఉద్యోగులు చేరుకుంటున్నారు.