IIT Madras | ఇంట‌ర్‌తో ఆన్‌లైన్‌లో ఐఐటీ కోర్సులు.. ఇంకెందుకు ఆల‌స్యం.. నాలుగేండ్ల బీఎస్ ఎలక్ట్రానిక్‌ సిస్టమ్స్‌ కోర్సులో చేరేద్దామా..?

IIT Madras | అంద‌రికి నాణ్య‌మైన విద్య‌ను అందించాల‌నే ఉద్దేశంతో పాటు వేగంగా విస్త‌రిస్తున్న కంప్యూట‌ర్స్, ఎలక్ట్రానిక్స్, వాటి అనుబంధ ప‌రిశ్ర‌మ‌ల‌కు అవ‌స‌ర‌మ‌య్యే నిపుణుల‌ను త‌యారు చేయ‌డానికి నేరుగా ఆన్‌లైన్‌లో డిగ్రీ కోర్సుల‌ను అందిస్తుంది ఐఐటీ మ‌ద్రాస్.

  • Publish Date - June 27, 2024 / 10:19 PM IST

IIT Madras | చాలా మంది పేరెంట్స్ త‌మ పిల్ల‌ల‌ను ఇంజినీరింగ్ చ‌దువులు చ‌దివించాల‌నుకుంటారు. అది కూడా ఐఐటీల్లో చ‌దివించాల‌నే కోరిక ఉంటుంది. మ‌రి ఐఐటీల్లో చ‌ద‌వాలంటే జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మంచి ర్యాంకు సాధిస్తేనే.. సాధ్య‌మ‌వుతుంది. అయితే కొంద‌రు మాత్ర‌మై ఐఐటీల్లో సీట్లు పొందుతారు. కాబ‌ట్టి అంద‌రికి నాణ్య‌మైన విద్య‌ను అందించాల‌నే ఉద్దేశంతో పాటు వేగంగా విస్త‌రిస్తున్న కంప్యూట‌ర్స్, ఎలక్ట్రానిక్స్, వాటి అనుబంధ ప‌రిశ్ర‌మ‌ల‌కు అవ‌స‌ర‌మ‌య్యే నిపుణుల‌ను త‌యారు చేయ‌డానికి నేరుగా ఆన్‌లైన్‌లో డిగ్రీ కోర్సుల‌ను అందిస్తుంది ఐఐటీ మ‌ద్రాస్. ఇప్ప‌టికే బీఎస్సీ డేటా సైన్స్ ద్వారా సుమారు 20 వేల మందికి ప్ర‌వేశాలు క‌ల్పించింది. గ‌తేడాది నుంచి బీఎస్ ఎల‌క్ట్రానిక్ సిస్ట‌మ్స్ కోర్సును అందిస్తోంది. అయితే ఈ కోర్సుల్లో ప్ర‌వేశాల కోసం ప్ర‌తి ఏడాది రెండు సార్లు నోటిఫికేష‌న్ జారీ చేస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబ‌ర్ సెష‌న్‌లో ప్ర‌వేశాల కోసం తాజాగా నోటిఫికేష‌న్ విడుద‌లైంది. మ‌రి ఈ కోర్సుల్లో చేరేందుకు అర్హ‌త‌లు, ఫీజు వివ‌రాలు తెలుసుకుందాం..

ఐఐటీ మ‌ద్రాస్ 2021లో బీఎస్సీ డేటా సైన్స్ అండ్ అప్లికేష‌న్స్ కోర్సును ప్రారంభించింది. ఈ కోర్సు వ్య‌వ‌ధి నాలుగేండ్లు. ఈ కోర్సులో చేర‌డానికి జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్ ప‌రీక్ష‌లు రాయాల్సిన ప‌ని లేదు. ఈ రెండింటిలో అర్హ‌త సాధించుకున్నా.. బీఎస్సీ డేటా సైన్స్ కోర్సులో ప్ర‌వేశం పొందొచ్చు. మ‌రో అవ‌కాశం ఏంటంటే.. ఇంట‌ర్‌లో ఏ గ్రూపు చ‌దివినా కూడా ప్ర‌వేశం క‌ల్పిస్తారు. బీఎస్సీ డేటా సైన్స్ కోర్సును ప్ర‌స్తుతం 20 వేలకు పైగా విద్యార్థులు చ‌దువుతున్నారు. ఈ కోర్సు విజ‌య‌వంతం కావ‌డంతో 2023 అక‌డ‌మిక్ ఇయ‌ర్ నుంచి బీఎస్ ఎల‌క్ట్రానిక్ సిస్ట‌మ్స్ కోర్సును ప్రారంభించింది ఐఐటీ మ‌ద్రాస్.

బీఎస్ ఎల‌క్ట్రానిక్ సిస్ట‌మ్స్ కోర్సుకు అర్హులు వీరే..

ఇంటర్‌లో మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ సబ్జెక్టులుగా ఉత్తీర్ణులైనవారు అర్హులు. ఈ కోర్సులో చేరడానికి ఎటువంటి గరిష్ఠ వయోపరిమితి లేదు.
మూడేండ్ల డిప్లొమా (పాలిటెక్నిక్‌) చదివిన వారు కూడా అర్హులే. అయితే వీరు మూడేండ్ల కోర్సులో మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ సబ్జెక్టులు చదివి ఉండాలి.

లెవల్స్‌ వారీగా కోర్సు/క్రెడిట్స్‌ వివరాలు

ఫౌండేషన్‌ లెవల్‌- 44 క్రెడిట్స్‌ ఉంటాయి. (దీనిలో 9 థియరీ+1 ల్యాబొరేటరీ ఉంటాయి)
డిప్లొమా లెవల్‌- 42 క్రెడిట్స్‌ (8 థియరీ+2 ల్యాబ్‌ కోర్సులు)
బీఎస్‌ డిగ్రీ లెవల్‌ – 56 క్రెడిట్స్‌ (12 కోర్సు+ అప్రెంటిస్‌షిప్‌ (ఆప్షనల్‌))

ఫీజుల వివరాలు

ఫౌండేషన్‌ లెవల్‌ పూర్తి చేయడానికి రూ.80,000/-
డిప్లొమా లెవల్‌ పూర్తి చేయడానికి
రూ.2,48000/- (ఫౌండేషన్‌+డిప్లొమా)
డిగ్రీ లెవల్‌ పూర్తి చేయడానికి రూ.5,84,000/- (ఫౌండేషన్‌+డిప్లొమా+డిగ్రీ)

ఫీజులో రాయితీలు

ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు 50 నుంచి 75 శాతం వరకు.
వార్షికాదాయం 1-5 లక్షల మధ్య ఉన్న ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ (ఎన్‌సీఎల్‌) వారికి 50 శాతం, అదేవిధంగా వార్షికాదాయం రూ.లక్షలోపు ఉంటే 75 శాతం వరకు రాయితీ లభిస్తుంది.

ఉపాధి అవకాశాలు

కోర్సు పూర్తి చేసిన వారికి ప్లేస్‌మెంట్స్‌ అసిస్టెన్స్‌ను ఐఐటీ మద్రాస్‌ ఇస్తుంది.
కోర్సు పూర్తి చేసిన వారికి ఎలక్ట్రానిక్‌ సిస్టమ్స్‌ డిజైనర్‌, ఎంబెడెడ్‌ సిస్టమ్‌ డెవలపర్‌, ఎలక్ట్రానిక్స్‌ హార్డ్‌వేర్‌
స్పెషలిస్ట్‌, సిస్టమ్‌ టెస్టింగ్‌ ఇంజినీర్‌.

ముఖ్యమైన తేదీలు ఇవే..

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో ప్రారంభమైనవి
చివరితేదీ: సెప్టెంబర్‌ 15
క్వాలిఫయర్‌ ఎగ్జామ్‌: అక్టోబర్‌ 27
వెబ్‌సైట్‌: https://study.iitm.ac.in/es/academics

 

Latest News