NOTA | న్యూఢిల్లీ : నోటా ( NOTA ).. ఈ పదం కేవలం ఎన్నికల సమయంలోనే వినిపిస్తుంటుంది. ఎన్నికల్లో తమకు నచ్చని అభ్యర్థులు బరిలో ఉన్నప్పుడు.. చాలా మంది ఓటర్లు నోటా (None of the above) కు ఓటు వేస్తుంటారు.ఎన్నికల్లో నిలబడ్డ నాయకులు ఎవరూ తమకు నచ్చలేదని ఓటర్లు నోటాకు ఓటేసి తమ నిరసన వ్యక్తం చేస్తుంటారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీహార్ రాష్ట్రంలో అత్యధికంగా 8,16,950 ఓట్లు నోటాకు పోలయ్యాయి. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఒకే నియోజకవర్గంలో 2,18,674 ఓట్లు నోటాకు పడ్డాయి. దీంతో ఆ నియోజకవర్గంలో నోటా రన్నరప్‌గా నిలిచింది. మరి ఆ నియోజకవర్గం ఏంటంటే మధ్యప్రదేశ్‌లోని ఇండోర్.
అసలు ‘నోటా’కు అన్ని ఓట్లు పడడానికి కారణం ఏంటి..?
ఇండోర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున అక్షయ కాంతి బామ్ నామినేషన్ దాఖలు చేశారు. కానీ చివరి క్షణంలో బీజేపీ మంత్రి కైలాష్ విజయ్ వర్గీయ, రమేశ్ మెండోలాతో కలిసి కాంతి బామ్ తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. అనంతరం బీజేపీలో ఆయన చేరారు. బీజేపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ శంకర్ లల్వానీకి మద్దతు పలికారు.
ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇతర అభ్యర్థులెవరికీ మద్దతు పలకొద్దని కాంగ్రెస్ నిర్ణయించింది. కాంగ్రెస్‌కు ఓటేయాలనుకునే వారంతా నోటాకు ఓటేయాలని పిలుపునిచ్చింది ఆ పార్టీ. నోటాకే ఆ పార్టీ ప్రచారం చేసింది. దాంతో నోటాకు ఈ ఎన్నికల్లో ఒకే నియోజకవర్గంలో 2,18,674 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ అభ్యర్థి శంకర్ లల్వానీ 12,26,751 ఓట్లతో గెలుపొందారు. బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థి సంజయ్‌కు 51,659 ఓట్లు వచ్చాయి. ఈయన మూడో స్థానంలో నిలిచారు. ఇక బీహార్‌లోని గోపాల్‌గంజ్ నియోజకవర్గంలో అత్యధికంగా నోటాకు 51,660 ఓట్లు పోలయ్యాయి.