జాతీయ మహిళా కమిషన్ మాజీ అధ్యక్షురాలు రేఖా శర్మ
విధాత, హైదరాబాద్ : కోల్‌కత్తా జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటనలో బెంగాల్ సీఎం మమతాబెనర్జీ ఏదో దాస్తున్నారని, కేసులో నిందితులను రక్షించడానికి ప్రయత్నిస్తున్నారని జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) మాజీ అధ్యక్షురాలు రేఖా శర్మ ఆరోపించారు. కోల్‌కత్తా వైద్యురాలి హత్యాచార ఘటన చాలా విషాదకర సంఘటన అని, ఒక మహిళ తన కార్యాలయంలో సురక్షితంగా లేకుంటే, ఇంకెక్కడ రక్షణ ఉంటుందన్నారు. ఈ ఘోరాన్ని జరుగుతున్న పరిణామాలు చూస్తే ఇది ఒక్క వ్యక్తి చేసిన పని కాదని అర్థమవుతోందన్నారు. కేసులోని ఇతర నిందితులను రక్షించడానికి సీఎం మమతా బెనర్జీ ప్రయత్నిస్తున్నారన్నారు. పోలీసుల తీరుపైనా అనుమానాలు ఉన్నాయని, ప్రస్తుతం దీనిపై సీబీఐ దర్యాప్తు జరుగుతోందని, సీఎం మమతా దాచాలని చూస్తున్న విషయాలన్నీ అందులో బయటపడతాయని పేర్కొన్నారు. మమతా బెనర్జీ, ఆమె పార్టీపై ప్రజలంతా ఆగ్రహంగా ఉన్నారని, కేసును పక్కదోవ పట్టించడంతో దేశ వ్యాప్తంగా ప్రజలు ఆగ్రహవేశాలకు లోనయ్యారన్నారు. పనిప్రదేశాల్లో మహిళల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం విఫలమయ్యిందని మండిపడ్డారు.