YS Jagan Mohan Reddy| నాంపల్లి కోర్టుకు హాజరైన మాజీ సీఎం వైఎస్.జగన్

అక్రమాస్తుల కేసులో వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్‌ గురువారం నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. న్యాయమూర్తి ఎదుట విచారణకు హాజరైన జగన్ రాక సందర్భంగా ఆయన అభిమానులు కోర్టు వద్ధ హంగామా చేశారు.

విధాత, హైదరాబాద్ : అక్రమాస్తుల కేసులో వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్‌(YS Jagan Mohan Reddy) గురువారం నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు(Nampally CBI Court appearance)కు హాజరయ్యారు. . విజయవాడ నుంచి బేగంపేట ఎయిర్‌పోర్టుకు వచ్చి అక్కడి నుంచి నాంపల్లిలోని కోర్టుకు ఆయన చేరుకున్నారు. న్యాయమూర్తి ఎదుట విచారణకు హాజరయ్యారు. అక్రమాస్తుల కేసులో 5ఏళ్ల తర్వాత మళ్లీ కోర్టుకు జగన్ నేరుగా హాజరవ్వడం విశేషం. చివరిసారిగా 2020 జనవరి 10న వ్యక్తిగతంగా జగన్ కోర్టుకు హాజరయ్యారు. మొత్తం 11 చార్జ్ షీట్ల విచారణలో భాగంగా జగన్ సీబీఐ కోర్టుకు హాజరయ్యారు.

ఈ కేసులో 2013 సెప్టెంబర్‌ నుంచి జగన్‌ బెయిల్‌పై ఉన్నారు. ఇప్పుడు కూడా వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని ఆయన కోరగా సీబీఐ తీవ్రంగా వ్యతిరేకించింది. దాదాపు ఆరేళ్లుగా జగన్‌ కోర్టుకు ప్రత్యక్షంగా హాజరవడం లేదని.. ఈ కేసుల్లో డిశ్చార్జి పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతున్నందున ప్రత్యక్షంగా హాజరవ్వాలని సీబీఐ స్పష్టం చేసింది. దీంతో ఈ నెల 21లోగా వ్యక్తిగతంగా హాజరవ్వాలని కోర్టు జగన్ ను ఆదేశించింది. ఈ నేపథ్యంలో జగన్ ఒకరోజు ముందే కోర్టుకు హాజరయ్యారు. కోర్టుకు జగన్ హాజరు క్రమంలో వైసీపీ శ్రేణులు, జగన్ అభిమానులు వేలాది సంఖ్యలో కోర్టు వద్దకు చేరుకున్నారు. వారిని కోర్టుకు వచ్చే మార్గాల్లోనే పోలీసులు నియంత్రించారు. ఈ సందర్బంగా వారంతా జై జగన్ అంటూ నినాదాలతో హంగామా చేశారు. జగన్ కోర్టుకు హాజరై తిరిగి వెళ్లేవరరకు కోర్టు వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Latest News