Tirumala laddu controversy| తిరుమల లడ్డులో కెమికల్స్ వాడారు: టీడీపీ వీడియో వైరల్

తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారు అన్న అభియోగాలతో ఏసీబీ కోర్టులో సీబీఐ తుది ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. ఇదే క్రమంలో టీడీపీ తిరుమల లడ్డు కల్తీపై ఓ వీడియోను రిలీజ్ చేసి వైసీపీ ప్రభుత్వం తీరుపై విమర్శలు సంధించింది.

Tirumala Laddu

విధాత: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారు అన్న అభియోగాలతో ఏసీబీ కోర్టులో సీబీఐ  సిట్ తుది ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. ఇదే క్రమంలో టీడీపీ తిరుమల లడ్డు కల్తీపై ఓ వీడియోను రిలీజ్ చేసి వైసీపీ ప్రభుత్వం తీరుపై విమర్శలు సంధించింది. నేను తిరుమల లడ్డూను అంటూ సాగిన ఈ వీడియోలో శ్రీవారి భక్తులు కళ్ళకు అద్దుకుని స్వీకరించే పవిత్ర దివ్య ప్రసాదమైన లడ్డూను వైసీపీ జగన్ రెడ్డి ప్రభుత్వం తన ఐదేళ్ల పాలనలో నెయ్యి బదులు కెమికల్స్ వాడి కల్తీ చేయించిందని టీడీపీ ఆరోపించింది. లడ్డూ ప్రతిష్టతను భంగం చేసి ప్రాశస్తాన్ని ప్రశ్నార్ధకం చేశారని, భక్తుల మనోభావాలతో చెలగాటమాడిన మీ మహాపాపం ఊరికే పోదంటూ విమర్శలు గుప్పించింది.

అసలు నెయ్యి వాడకుండా 60 లక్షల కిలోల రసాయనాలతో కూడిన కల్తీ నెయ్యితో తయారుచేసిన 20 కోట్ల కల్తీ లడ్డూలు చేసి ప్రసాదంగా పంచి ప్రజల ఆరోగ్యాన్ని హరించారని, లడ్డులో బీటా కెరోటిన్, ఎసిటిక్ యాసిడ్ ఎస్టర్ వంటి రసాయనాల్ని వాడిన మీది మానవ జన్మే కాదంటూ మండిపడింది.

కల్తీ నెయ్యితోనే తిరుమల లడ్డూ

2021-2024 మధ్య కాలంలో తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా అయ్యిందని.. దాన్నే లడ్డూ తయారీకి వాడారని నిర్ధారించిన సుప్రీంకోర్డు ఏర్పాటు చేసిన సిట్ నిర్థారించింది.భగవాన్‌పూర్‌లోని భోలేబాబా ఓరోగానిక్‌ డెయిరీ మిల్క్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఏ7)లో 2019 నుంచి 2024 వరకూ 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యి తయారు చేశారు అని, అందులో 59.71 లక్షల కిలోలను అగ్‌మార్క్‌ స్పెషల్‌ గ్రేడ్‌ ఆవు నెయ్యి ముసుగులో టీటీడీకి సరఫరా చేశారు అని చార్జ్ షీట్ లో పేర్కొంది.

‘భోలే బాబా ఆర్గానిక్ డెయిరీ’ సుమారు 68 లక్షల కేజీల కల్తీ నెయ్యి సరఫరా చేసిందని.. దీని విలువ రూ.250 కోట్లని తేల్చింది. ఒక్క లీటరు పాలు సేకరించకుండానే.. పామాయిల్, పామ్ కెర్నల్ ఆయిల్ వంటి చౌకబారు నూనెల్ని కలిపినట్లు విచారణలో వెల్లడైందని, ల్యాబ్ పరీక్షల్లో ఈ కల్తీ దొరక్కుండా.. బీటా కెరోటిన్, ఎసిటిక్ యాసిడ్ ఎస్టర్ వంటి రసాయనాల్ని వాడినట్లు నిర్ధారించింది. ఈ స్కామ్‌లో టీటీడీలోని ఉద్యోగులు ఉన్నారని పేర్కొంటూ.. 36 మందిని నిందితులుగా గుర్తించి, 9 మందిని అరెస్ట్ చేసినట్లుగా సిట్ పేర్కొంది. అయితే నెయ్యిలో ఎలాంటి జంతువుల కొవ్వు లేదని ICAR -NDRI నివేదికను సిట్ తన చార్జ్ షీట్ లో పేర్కొనడం గమనార్హం.

మహాపాపం అంటూ వెలిసిన ఫ్లెక్సీలు

తిరుమల లడ్డూ కల్తీ వివాదాన్ని ప్రచార అస్త్రంగా మలుచుకుకున్న టీడీపీ కూటమి నేను తిరుమల లడ్డూను అంటూ ఓ వీడియోతో సోషల్ మీడియా వేదికగా వైసీపీ పాలకులపై విమర్శల దాడి ఆరంభించింది. ఇంకోవైపు మహాపాపం పేరుతో ఫ్లెక్సీల ఏర్పాటుతో సైతం వైసీపీపై దాడి సాగిస్తుంది. తిరుమలలో 68.17 లక్షల కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డు తయారీ అంటూ పిడుగురాళ్ల సహా ఏపీలోని పలు ప్రాంతాల్లో వెలిసిన ఫ్లెక్సీలు చర్చనీయాంశమయ్యాయి.

Latest News