Hemant Soren | జార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌కు బెయిలు

అక్రమంగా 8.36 ఎకరాలను కలిగి ఉన్నారన్న విషయంలో నమోదైన మనీలాండరింగ్‌ కేసులో జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌కు జార్ఖండ్‌ హైకోర్టు శుక్రవారం బెయిల్‌ మంజూరు చేసింది

  • Publish Date - June 28, 2024 / 03:37 PM IST

రాంచీ: అక్రమంగా 8.36 ఎకరాలను కలిగి ఉన్నారన్న విషయంలో నమోదైన మనీలాండరింగ్‌ కేసులో జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌కు జార్ఖండ్‌ హైకోర్టు శుక్రవారం బెయిల్‌ మంజూరు చేసింది. ఆయనపై ఇతర కేసులు ఏమీ లేని నేపథ్యంలో ఆయన జైలు నుంచి విడుదలయ్యేందుకు అడ్డంకులు ఏమీ లేవు. దాదాపు నెల రోజులపాటు ఈ కేసును విచారించిన జస్టిస్‌ రంగన్‌ ముఖోపాధ్యాయ మాజీ ముఖ్యమంత్రికి బెయిల్‌ ఇచ్చారు. 50వేల చొప్పున రెండు పూచీకత్తులపై బెయిల్‌ ఇచ్చినట్టు అడ్వొకేట్‌ జనరల్‌ రాజీవ్‌ రంజన్‌కు అసోసియేట్‌ కౌన్సెల్‌గా ఉన్న పీయూష్‌ చిత్రేశ్‌ తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి విడుదల ఉత్తర్వుల ప్రక్రియలో ఉన్నాయని చెప్పారు. జనవరి 31, 2024న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, తన విశ్వసనీయుడు, రాష్ట్ర రవాణా మంత్రి చంపై సోరెన్‌ను ముఖ్యమంత్రిగా నియమించిన వెంటనే హేమంత్‌ సోరెన్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు.

రాంచీలోని ఆర్మీ ప్లాట్‌ అక్రమ క్రయవిక్రయాలు సహా జార్ఖండ్‌లో పలు కేసులను ఈడీ దర్యాప్తు చేస్తున్నది. ఈ కేసులో దర్యాప్తు సందర్భంగా బార్గాయిన్‌ సర్కిల్‌ ఆఫీస్‌ మాజీ రెవెన్యూ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ భాను ప్రతాప్‌ ప్రసాద్‌ పేరు బయటకు వచ్చిందని ఈడీ అధికారులు చెబుతున్నారు. తప్పుడు రికార్డులతోపాటు.. బలవంతంగా ఆస్తుల క్రయవిక్రయాలు జరిపే ముఠాలో ప్రసాద్‌ భాగస్వామి అని ఈడీ పేర్కొంటూ ఆయనను అరెస్టు చేసింది. ఆయన నుంచి పలు ఒరిజినల్‌ భూ రికార్డులను ఈడీ స్వాధీనం చేసుకున్నది. సోరెన్‌కు చెందిన 8.36 ఎకరాల భూమి ఇమేజ్‌ ఆయన ఫోన్‌లో లభించిందని ఈడీ అధికారులు చెబుతున్నారు. ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు పన్నిన కుట్రల్లో ప్రతాప్‌ వెంట ఉన్నవారిలో సోరెన్‌ కూడా ఒకరని ఈడీ పేర్కొంటున్నది. అక్రమంగా గుంజుకున్న ఆస్తుల వివరాలు ప్రతాప్‌ ఫోన్‌లో కనిపించాయని తెలిపింది.

అయితే.. తనపై వచ్చిన అభియోగాలు నిరాధారాలని జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ చెబుతున్నారు. తాను ఆ భూమిని చట్టబద్ధంగానే కలిగి ఉన్నానని అంటున్నారు. ఆ భూమి వాస్తవానికి భూయిహరి భూమి అని, చోటానాగ్‌పూర్‌ టెనెన్సీ యాక్ట్‌ ప్రకారం దానిని ఎవరికీ బదిలీ చేయజాలరని పేర్కొంటున్నారు. ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలపై బీజేపీ కక్షపూరిత రాజకీయాల్లో భాగంగానే తనను ఈడీ అరెస్టు చేసిందని హేమంత్‌ ఆరోపించారు. మనీలాండరింగ్‌ కిందకు రాని నిబంధనలకు అనుగుణంగా విచారణ జరిపేందుకు ఈడీ ప్రయత్నిస్తున్నదని, అది చెల్లబోదని అంతకు ముందు సోరెన్‌ తరఫు న్యాయవాది కపిల్‌ సిబల్‌ చెప్పారు

Latest News