Gold smuggling case | విధాత : కన్నడనటి రన్యారావు కు అక్రమంగా బంగారం తరలింపు కేసులో తాజాగా ఏడాది పాటు జైలుశిక్ష ఖరారైంది. రన్యారావుకు జైలు శిక్ష విధిస్తున్నట్టు విదేశీ మారక ద్రవ్య పరిరక్షణ, స్మగ్లింగ్ కార్యకలాపాల నివారణ బోర్డు (కాఫిఫోసా ) అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. రన్యారావుతోపాటు మరో ఇద్దరు నిందితులు తరుణ్ రాజు, సాహిల్‌కు కూడా ఏడాది జైలు శిక్ష విధించింది. అక్రమ రవాణాకు సంబంధించి బలమైన ఆధారాలు ఉన్న నేపథ్యంలో వారు ఈ ఏడాది కాలంలో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం లేదని బోర్డు ఈ సందర్భంగా తెలిపింది. ఈ కేసుకు సంబంధించి ప్రతి మూడు నెలలకు ఒకసారి విచారణలు జరుగుందని బోర్డు తెలిపింది.
దుబాయ్ నుంచి అక్రమంగా బంగారాన్ని తరలిస్తూ బెంగళూరు ఎయిర్‌పోర్టులో రన్యారావు 2024 మార్చి 3వ తేదీన రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. దీంతో ఆమెను అదుపులోకి తీసుకున్న డీఆర్ఐ అధికారులు.. ఆమె నుంచి సుమారు. 14.8 కిలోల విలువైన బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. దాదాపు రూ.12.56కోట్ల విలువైన బంగారాన్ని నడుము, కాళ్లకు బ్యాండేజీలు, టిష్యూ పేపర్ల సహాయంతో చుట్టుకొని దాచి రవాణా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. స్మగ్లింగ్ వ్యవహారంపై కస్టమ్స్ చట్టం, స్మగ్లింగ్ నిరోధక చట్టం కింద ఆమెపై డీఆర్‌ఐ కేసు నమోదు చేసింది. రన్యా తన వీఐపీ హోదాను దుర్వినియోగం చేసి భద్రతా తనిఖీలను దాటవేసిందని, ఎయిర్‌పోర్టులో తనిఖీల నుంచి తప్పించుకోవడానికి ఆమె పిన తండ్రి,ఐపీఎష్ అధికారిని ఉపయోగించుకున్నారని దర్యాప్తులో వెల్లడైంది.
ఈ కేసులో ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు మే 20న బెయిల్ మంజూరు చేసింది. డీఆర్ఐ అధికారుల విధానపరమైన లోపాల కారణంగా ఆమె ప్రారంభంలో డిఫాల్ట్ బెయిల్ పొందినప్పటికీ కాఫిఫోసా చట్టం వల్ల విడుదల కాలేదు. ఆపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పీఎంఎల్‌ఏ (మనీలాండరింగ్ నిరోధక చట్టం) కింద కేసు నమోదు చేసింది. ఆమె ఆ సమయం నుంచే జైల్లోనే ఉన్నారు. విడుదల కాలేదు. దీంతో ఆమె తల్లి కర్ణాటక హైకోర్టును కూడా ఆశ్రయించారు. కానీ, కోర్టు నుంచి ఎదురుదెబ్బ తగలడమే కాకుండా ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం ప్రకటించింది. గోల్డ్ స్మగ్లింగ్ సిండ్‌కేట్‌లో ఆమె పాత్ర ఉన్నట్లు గుర్తించింది. అటు మనీలాండరింగ్ కేసులో భాగంగా ఆమెకు చెందిన రూ.34 కోట్లకు పైగా విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.