RSS Song AT Vande Bharath Launch | ఎర్ణాకుళం నుంచి బెంగళూరుకు వందే భారత్ రైలు ప్రారంభోత్సవం కేరళలో రాజకీయ చిచ్చుకు కారణమైంది. ఈ రైలు ప్రారంభ కార్యక్రమంలో ఒక స్కూలు విద్యార్థులు ఆరెస్‌ఎస్ ‘గానం గీతం’ ఆలపించిన వీడియోను రైల్వే అధికారులు సోషల్ మీడియాలో పోస్టు చేయడం వివాదాన్ని రేపింది. దీనిపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైల్వేలను తన మతపరమైన ప్రచార వేదికగా సంఘ్‌పరివార్ వాడుకుంటోందని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ సైతం విద్యార్థులను ఇలాంటి కార్యక్రమాల్లో ఒత్తిడి చేసి పాల్గొనేలా చేయడం అనైతికమన్నారు.
వివాదం మొదలైందిలా..
ఎర్ణాకుళం–బెంగళూరు వందేభారత్ రైలును ప్రధాన మంత్రి నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శనివారం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇదే కార్యక్రమంలో కోచ్చిలోని సరస్వతి విద్యానికేతన్ పబ్లిక్ స్కూల్‌కు చెందిన సుమారు 20 మంది విద్యార్థినులు, ఇద్దరు టీచర్లు సైతం పాల్గొని, సాంస్కృతిక ప్రదర్శనలిచ్చారు. ఆ సమయంలో విద్యార్థినులు ఆరెస్సెస్ గీతాన్ని ఆలపిస్తున్న వీడియోను రైల్వే శాఖ తన సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. అయితే.. తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో వెంటనే దానిని డిలీట్ చేశారు.
అదేమీ జాతి వ్యతిరేకం కాదు..: స్కూల్ ప్రిన్సిపల్
ఈ వివాదంపై స్కూల్ ప్రిన్సిపల్ కేపీ డింటో వివరణ ఇస్తూ.. ఇందులో రైల్వే శాఖ తప్పేమీ లేదని సమర్థించారు. ఒక టీవీ చానల్ పాల పాడాలంటూ విద్యార్థులను కోరడంతో మొదట వందేమాతరం గీతాన్ని ఆలపించారని, తర్వాత ఒక మలయాళ పాట పాడాలని అడగడంతో ఆరెస్సెస్ గీతాన్ని ఆలపించారని తెలిపారు. అది కూడా ఐక్యతను ప్రతిబింబించే పాటేనని, జాతి ఐక్యతకు అదేమీ వ్యతిరేకం కాదని వాదించారు. ఆరెస్సెస్ విద్యా విభాగమైన విద్యా భారతి కేరళ శాఖ పరిధిలో భారతీయ విద్యానికేతన్ ఉంటుంది. ‘వందేభారత్ రైలు ప్రారంభోత్సవంలో ఆరెస్సెస్ గీతాన్ని ఆలపించడం తీవ్ర అభ్యంతకరం. మత విద్వేషాన్ని, ప్రజల మధ్య విభజనలను ప్రచారం చేసే ఆరెస్సెస్ పాటను ప్రభుత్వ కార్యక్రమంలో చేర్చడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే’ అని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఎక్స్‌లో వ్యాఖ్యానించారు. స్వాతంత్య్రోద్యమంలో జాతీయ ఐక్యతకు చిహ్నంగా నిలిచిన రైల్వేలు.. ఇప్పుడు ఆరెస్సెస్ సామూహిక రాజకీయ కార్యక్రమాలకు వేదికగా మారడం దురదృష్టకరమని పేర్కొన్నారు. సంఘ్‌పరివార్ ప్రచారానికి విద్యార్థులను ఉపయోగించడం చట్ట విరుద్ధమని కాంగ్రెస్ నాయకుడు వీడీ సతీశన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన మతపరమైన రాజకీయ ప్రచారానికి రైల్వేలను ఉపయోగిస్తోందని ఆయన ఆరోపించారు. వందేభారత్ రైలు ప్రారంభ వేడుకను కూడా ప్రజలను కులం, మతం ఆధారంగా చీల్చేందుకు ఉపయోగించారని మండిపడ్డారు.
