కర్ణాటకలో ఆర్ఎస్ఎస్ దూకుడుకు కళ్లెం..ప్రభుత్వ సంబంధ ఆవరణల్లోకఠిన నిబంధనలకు రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం

కర్నాటక రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలు, బహిరంగ ప్రదేశాలలో రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆర్ఎస్ఎస్) దాని అనుబంధ సంస్థల కార్యకలాపాలు నిషేధించేందుకు చర్యలు చేపట్టారు

Karnataka Cabinet moves to restrict RSS activities in government institutions, public places

బెంగళూరు, విధాత : కర్నాటక రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలు, బహిరంగ ప్రదేశాలలో రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆర్ఎస్ఎస్) దాని అనుబంధ సంస్థల కార్యకలాపాలు నిషేధించేందుకు చర్యలు చేపట్టారు. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం మాదిరి తమ రాష్ట్రంలో తెచ్చేందుకు కర్నాటక ప్రభుత్వం కఠిన నిబంధనలు తీసుకువస్తున్నది. ఇంతకు ముందే నిబంధనలు ఉన్నప్పటికీ మరింత పదును పెట్టనున్నారు. గురువారం జరిగిన కర్ణాటక మంత్రి మండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇకనుంచి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు రోడ్లు, వీధుల్లో కాకీ నిక్కరు, టోపీ పెట్టుకుని, కర్ర ఊపుకుంటూ పథ సంచాలన్ (మార్చ్) చేస్తామంటే కుదరదు. ఇలా మార్చ్ చేయాలంటే సంబంధిత ప్రభుత్వ అధికారుల నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని స్థలాల్లో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలను నిషేధించాలని ఐటీ, బయో టెక్నాలజీ శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు లేఖ రాశారు. ప్రభుత్వ కళాశాలలు, పాఠశాలలు, పబ్లిక్ ప్రాంతాలు, ఎయిడెడ్ సంస్థల్లో శాఖలు నిర్వహించకుండా అడ్డుకోవాలని కోరారు. అయితే ఇప్పటికే రాష్ట్ర హోం శాఖ, న్యాయ శాఖ, విద్యా శాఖలు నిబంధనలు తీసుకువచ్చాయి. రెండు మూడు రోజుల్లో నిబంధనలు మరింత కఠినతరం చేస్తూ ప్రకటన జారీ చేయనున్నారని మంత్రి ప్రియాంక్ ఖర్గే మంత్రి మండలి సమావేశం తరువాత వెల్లడించారు.