(విధాత ప్రత్యేక ప్రతినిధి)
Maoist party latest Clarification | శత్రువుకు ఆయుధాలు అప్పగించి జనజీవన స్రవంతిలో కలిసి ప్రజల ప్రయోజనాలకు ద్రోహం చేయడం తమ విధానం కాదని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్, దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ పేరిట విడుదలైన సంయుక్త ప్రకటన స్పష్టం చేసింది. ఇటీవల పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోను అభయ్ పేరుతో సాయుధ పోరాట విరమణకు సిద్ధమని చేసిన ప్రకటన, ఆడియో తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన సోను వ్యక్తిగత నిర్ణయమని తాజా ప్రకటనలో స్పష్టం చేశారు. దానిని పార్టీ కేంద్రకమిటీ, పొలిట్ బ్యూరో, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ పూర్తిగా తిరస్కరిస్తున్నాయని పేర్కొన్నారు. సోను వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్ర కమిటీ నేతలు.. దీనిని పార్టీని చీల్చే దుష్ట పథకంగా అభివర్ణించారు. ఈ నెల 20వ తేదీతో ఈ ప్రకటన విడులైంది.
అది ఆయన వ్యక్తిగత నిర్ణయం
ఆయుధాలు వదిలిపెడతామని, ఇది తమ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉండి ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన బసవరాజు శాంతి చర్చల కోసం చేసిన ప్రయత్నంలో భాగమని సోను పేర్కొనడాన్ని కేంద్ర కమిటీ ఖండించింది. మారిన అంతర్జాతీయ, దేశీయ పరిస్థితులు సాయుధ పోరాటాన్ని వదిలి పెట్టాలని సూచించడం లేదని, దీనికి భిన్నంగా సాయుధ పోరాటాన్ని కొనసాగించాల్సిన అవసరాన్ని ఎత్తిచూపుతున్నాయని ప్రకటనలో పేర్కొన్నారు. బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు ఆర్ఎస్ఎస్ – బీజేపీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలోని విశాల ప్రజానీకంపై సామాజిక జీవితానికి చెందిన అన్ని రంగాల్లో చేస్తున్న ఫాసిస్టు దాడులను ప్రతిఘటించాల్సిన అవసరాన్ని ఎత్తిచూపుతోందని తెలిపారు. ‘ప్రపంచవ్యాప్తంగా, మనదేశంలో ఆర్థిక, సామాజిక అంతరాలు తీవ్రంగా పెరిగిపోతున్నాయి. మనదేశంలో కానీ, ప్రపంచంలో గానీ ప్రజల దైనందిన సమస్యలు గానీ, మౌలిక సమస్యలు గానీ పరిష్కారం కాలేదు. ఈ స్థితిలో మన దేశంలో గానీ, ప్రపంచంలో గానీ నేటి పరిస్థితులు చట్టబద్ద-చట్టవ్యతిరేక, రహస్య-బహిరంగ పోరాట, నిర్మాణ రూపాలను సమన్వయించుకుంటూనే సాయుధ పోరాటాన్ని కొనసాగించాల్సిన అవసరాన్ని ఎత్తిచూపుతున్నాయి’ అని తెలిపారు.
సోను ప్రకటన పార్టీని చీల్చే దుష్ట పథకం
శాంతి చర్చల కోసం తమ అమరుడు బసవరాజు చేసిన ప్రయత్నంలో భాగమే ఆయుధాల విరమణ అని సోను ప్రకటించడం వాస్తవాల వక్రీకరణ అని కేంద్ర కమిటీ స్పష్టం చేసింది. పార్టీ చేసిన శాంతిచర్చల ప్రస్తావనను నిర్లక్యం చేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కగార్ యుద్ధాన్ని కొనసాగిస్తుండడంతో, దాన్ని ఉపసంహరించుకుని ‘కగార్’ యుద్ధాన్ని ప్రతిఘటించాలని యావత్తు పార్టీకి, పీ.ఎల్.జీ.ఏ.కు, విప్లవ శిబిరానికి ఆయన పిలుపునిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఆయన మార్గదర్శకత్వంలోనే దేశవ్యాప్తంగా పార్టీ, పీ.ఎల్.జీ.ఏ., విప్లవ శిబిరం ‘కగార్’ యుద్ధాన్ని చట్టబద్ద – చట్టవ్యతిరేక రూపాల్లో శక్తిమేరకు ప్రతిఘటిస్తున్నాయని తెలిపారు. ఈ వాస్తవాన్ని ఉద్దేశ్యపూర్వకంగా సోను వక్రీకరించాడని, ఈ దురుద్దేశ్యపూర్వ వక్రీకరణ కుటిలమైనది, ఖండించతగినదని కేంద్ర కమిటీ పేర్కొన్నది. ఈ దుష్ట పథకాన్ని విరమించుకోవాల్సిందిగా కోరింది. ఈ దుష్ట పథకాన్ని తిప్పికొట్టాల్సిందిగా ప్రజాసంఘాలకు, పార్టీ సభ్యులకు, వివిధ స్థాయిల పార్టీ కమిటీలకు, జైల్లో బందీలుగా ఉన్న పార్టీ నాయకులకు, పార్టీ సభ్యులకు, విప్లవాభిమానులకు, ప్రజాస్వామిక, ప్రగతిశీల, వామపక్ష శక్తులకు, సంస్థలకు పిలునిచ్చింది. పార్టీ అతివాద ఎత్తుగడలను ఆచరించిందని తను అనుకుంటే పార్టీలో ఉంటూ వాటిని సరిదిద్దడానికి కృషి చేయడం పొలిట్ బ్యూరో సభ్యుడిగా సోను బాధ్యతని, కానీ.. కానీ ఆయన ఈ విప్లవకర పద్ధతికి తిలోదకాలిచ్చి జనజీవన స్రవంతిలో కలవాలని నిర్ణయించుకున్నాడని తెలిపింది.
దీర్ఘకాలిక ప్రజా యుద్ధ పంథా
మార్క్సిజం-లెనినిజం-మావోయిజం సిద్ధాంతం ప్రకారం విప్లవపు కేంద్ర కర్తవ్యం రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకోవడమేనని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ స్పష్టంచేసింది. దోపిడీ వర్గాలను సాయుధ శక్తి ద్వారానే అధికారం నుండి కూలదోసి పీడిత వర్గాలు అధికారాన్ని హస్తగతం చేసుకుంటాయని పేర్కొన్నది. మనదేశం అర్ధ వలస, అర్ధ భూస్వామ్య దేశం కాబట్టి ప్రాంతాల వారీగా అధికారాన్ని హస్తగతం చేసుకునే దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పంథాను తమ పార్టీ ఆచరిస్తోందని వెల్లడించింది. కాబట్టి ఆయుధాలు వదిలి శాంతిచర్చలకు వెళ్లాలని నిర్ణయించడం సిద్ధాంతానికి, రాజకీయ–మిలిటరీ పంథాకు వ్యతిరేకమైనదని తెలిపింది.
ఆయుధాలు వదిలిపెట్టడం అంటే సరెండర్
ఆయుధాలు వదిలిపెట్టడం అంటే వాటిని శత్రువుకు అప్పగించడమని, శత్రువుకు లొంగిపోవడం (సరెండర్) అని అర్థమని కేంద్ర కమిటీ పేర్కొన్నది. సాయుధ పోరాటాన్ని విరమించడం అంటే విప్లవ పార్టీ రివిజనిస్టు పార్టీగా మారిపోవడమేనని తెలిపింది. అది పీడిత వర్గాలు, పీడిత సాంఘిక
సముదాయాలు, పీడిత జాతులకు ద్రోహం చేయడమేనని స్పష్టంచేసింది. ఇది ప్రచండ తరహా ఆధునిక రివిజనిజమని, విప్లవ ద్రోహమని అభివర్ణించింది. సోను, ఆయన అనుచరులు లొంగిపోవచ్చని, కానీ.. ఆయుధాలను మాత్రం పార్టీకి అప్పగించాల్సిందేనని కేంద్ర కమిటీ డిమాండ్ చేసింది. సామరస్యపూర్వకంగా అప్పగించకపోతే పీఎల్‌జీఏ స్వాధీనం చేసుకుంటుందని హెచ్చరించారు.
శాంతి చర్చలకు సిద్ధం
ఇప్పటికీ తమ పార్టీ శాంతిచర్చలకు సిద్ధమేనని మావోయిస్టు పార్టీ తెలిపింది. శాంతిచర్చల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించేలా వాటిపై ఒత్తిడి తేవడానికి దేశవ్యాప్త ప్రజా ఉద్యమాన్ని నిర్మించాల్సిందిగా పౌరసమాజానికి, యావత్తు ప్రజానీకానికి విజ్ఞప్తి చేసింది.