Madhya Pradesh | “తేనె” పూసిన అవినీతి : మధ్యప్రదేశ్​ రిటైర్డ్​ ఇంజనీర్​ ఆస్తులు చూసి విస్తుపోవాల్సిందే.!

మధ్యప్రదేశ్ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ జి.పి.మెహ్రా ఇంట్లో లోకాయుక్త దాడులు — రూ.36 లక్షల నగదు, 2.6 కిలోల బంగారం, 17 టన్నుల తేనె, లగ్జరీ కార్లు స్వాధీనం.

Lokayukta officers seize cash, gold, silver and 17 tonnes of honey from retired PWD engineer’s farmhouse in Madhya Pradesh.

Retired MP Engineer’s House Raided: Piles of Cash, Gold, Silver and 17 Tonnes of Honey Seized

భోపాల్‌ : మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో అవినీతి ప‌రాకాష్ట‌కు చెందిన తీరు లోకాయుక్త దాడుల్లో దొరికిన సొత్తు చూస్తే ఎవ‌రైనా విస్తుపోవాల్సిందే. ఒక‌ రిటైర్డ్ ప్రభుత్వ అధికారి ఇంట్లో జరిగిన లోకాయుక్త దాడులు పెను సంచలనం సృష్టించాయి.   పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (పీడబ్ల్యూడీ) రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ జి.పి.మెహ్రా నివాసాలు, ఇతర ఆస్తులపై గురువారం అధికారులు జరిపిన సోదాల్లో కుప్పలుతెప్పలుగా అక్రమాస్తులు బయటపడ్డాయి.  ఈ సోదాల్లో గుర్తించిన న‌గ‌దు, బంగారం, వెండితో పాటు ఏకంగా 17 ట‌న్నుల తేనె నిల్వ‌ల‌ను చూసి అధికారులు  నివ్వెర పోయారు.

లోకాయుక్తకు షాక్​..!

ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న పక్కా సమాచారంతో లోకాయుక్త డీఎస్పీ ర్యాంక్ అధికారుల నేతృత్వంలో బృందాలు ఏకకాలంలో భోపాల్, నర్మదాపురంలోని నాలుగు ప్రాంతాల్లో దాడులు నిర్వ‌హించాయి. భోపాల్‌లోని మణిపురం కాలనీలో ఉన్న మెహ్రా నివాసంలో రూ.8.79 లక్షల నగదు, సుమారు రూ.50 లక్షల విలువైన ఆభరణాలు, రూ.56 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్ పత్రాలను గుర్తించారు. సమీపంలోని ఓపల్ రీజెన్సీ అపార్ట్‌మెంట్‌లోని మరో ఇంట్లో సోదాలు చేయగా, రూ.26 లక్షల నగదు, రూ.3.05 కోట్ల విలువైన 2.6 కిలోల బంగారం, 5.5 కిలోల వెండి లభించాయి. లభించిన నగదును లెక్కించేందుకు కౌంటింగ్ మెషీన్లను వినియోగించాల్సి వచ్చింది.

17 ట‌న్నుల తేనె కూడా.. ఎందుకో?

అయితే.. ఈ దాడుల్లో  అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన విషయం నర్మదాపురం జిల్లా సోహాగ్‌పూర్‌లోని ఆయన ఫామ్‌హౌస్‌లో వెలుగుచూసింది. అక్కడ అధికారులు ఏకంగా నిల్వ ఉంచిన‌  17 ట‌న్నుల తేనెను గుర్తించారు. ఈ ఫాం హౌజ్‌లో నిర్మాణంలో ఉన్న 32 కాటేజీలు, ఇప్పటికే పూర్తయిన ఏడు కాటేజీలు, ఆరు ట్రాక్టర్లు, చేపల పెంపకానికి ఓ చెరువు, గోశాల, ఒక గుడి కూడా ఉన్నట్లు గుర్తించారు. ఫోర్డ్ ఎండీవర్, స్కోడా స్లావియా, కియా సోనెట్, మారుతి సియాజ్ వంటి లగ్జరీ కార్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.

మెహ్రా బినామీ సంస్థగా భావిస్తున్న గోవింద్‌పురాలోని కేటీ ఇండస్ట్రీస్‌లోనూ సోదాలు జరిపి, రూ.1.25 లక్షల నగదుతో పాటు పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం మీద ఇప్పటివరకు రూ.36 లక్షలకు పైగా నగదు, 2.6 కిలోల బంగారం, 5.5 కిలోల వెండితో పాటు పలు ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఇన్సూరెన్స్ పత్రాలు, షేర్ డాక్యుమెంట్లను గుర్తించినట్లు లోకాయుక్త అధికారులు తెలిపారు. ఆస్తుల విలువ ఇంకా లెక్కిస్తున్నామని, దీని విలువ అనేక కోట్లలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. స్వాధీనం చేసుకున్న పత్రాలను ఫోరెన్సిక్ బృందాలు పరిశీలిస్తున్నాయని, మెహ్రా ఆర్థిక లావాదేవీలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని అధికారులు వివరించారు.