Medicine Price : దేశంలో వైద్య ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మధుమేహం, అధిక రక్తపోటు లాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే సామాన్యుల సంపాదనలో సగం వైద్యానికే పోతోంది. ప్రతినెల వేల రూపాయలు పోసి మెడిసిన్ కొనాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలోని కోట్లాది మందికి ‘నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (NPPA)’ కాస్త ఊరటనిచ్చింది. మొత్తం 54 రకాల నిత్యావసర ఔషధాల ధరలను తగ్గించింది. శనివారం నుంచే ఈ ధరల తగ్గింపు అమల్లోకి వచ్చింది.
ధరలు తగ్గిన మందుల్లో మల్టీవిటమిన్ మెడిసిన్‌తోపాటు మధుమేహం, గుండె వ్యాధులు, చెవి వ్యాధుల చికిత్సలో వినియోగించే మందులు కూడా ఉన్నాయి. దాంతో సామాన్యులకు ఎంతో ఊరట లభించనుంది. శనివారం జరిగిన NPPA 124వ సమావేశంలో ఔషధాల ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దేశంలో విక్రయించే ఔషధాల ధరలను ఎప్పుడైనా NPPA నిర్ణయిస్తుంది.
మధుమేహం, గుండె జబ్బులు, యాంటీ బయాటిక్స్, విటమిన్ డి, మల్టీ విటమిన్లు, చెవి మందులు మొదలైనవి ధరలు తగ్గిన ఔషధాల్లో ఉన్నాయని NPPA తెలిపింది. వీటితోపాటు 8 ప్రత్యేక ఫీచర్ల ఉత్పత్తుల ధరలను కూడా NPPA తగ్గించింది. గత నెల ప్రారంభంలో కూడా అనేక మందుల ధరలు తగ్గాయి. సాధారణంగా ఉపయోగించే 41 మందులు, 6 ప్రత్యేక మందుల ధరలను తగ్గించారు. యాంటీబయాటిక్స్, మల్టీ విటమిన్లు, మధుమేహం, గుండె సంబంధిత మందుల ధరలు గత నెలలో కూడా తగ్గాయి.
వాటితోపాటు కాలేయ మందులు, గ్యాస్, ఎసిడిటీ మందులు, పెయిన్ కిల్లర్స్, అలర్జీ మందుల ధరలను తగ్గించారు. కాగా NPPA తాజా నిర్ణయంవల్ల కోట్లాది మంది ప్రజలు ప్రయోజనం పొందనున్నారు. ప్రస్తుతం దేశంలోనే 10 కోట్ల మందికిపైగా మధుమేహ రోగులు ఉన్నారు. ఇది ప్రపంచంలోని ఇతర దేశాల కంటే ఎక్కువ. తగ్గిన ధరల నుంచి ఈ 10 కోట్ల మందికిపైగా మధుమేహ రోగులు ప్రయోజనం పొందనున్నారు.