ముంబై : రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీపై వస్తున్న ఊహాగానాలకు ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ తెర దించారు. 2024 ఎన్నికల్లో తాను లోక్‌సభకు పోటీచేయబోనని చెప్పారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. పశ్చమ, ఉత్తర మహారాష్ట్రలోని ఏడు లోక్‌సభ స్థానాల్లో ఎన్సీపీ పోటీ, సన్నద్ధతపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో నిలబడాలని పార్టీ నేతలు కోరగా.. అందుకు ఆయన తిరస్కరించారని సమాచారం. ఈ సమావేశంలో ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు జయంత్ పాటిల్, ఇతర సీనియర్ నేతలు కూడా ఉన్నారు.
దిండోరి, హింగోలి, వర్ధా, అమరావతి, బీడ్, భివాండి, జల్నా స్థానాలపై ఈ సమావేశం నిర్వహించారు. ఇదిలా ఉంటే.. రాబోయే లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి మహా వికాస్ అఘాడీ భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల సర్దు బాటు అతి త్వరలో పూర్తవుతుందని శరద్‌పవార్ బుధవారం ఒక కార్యక్రమం సందర్భంగా చెప్పారు. పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ, ఠాక్రే నేతృత్వంలోని శివసేన, కాంగ్రెస్ పార్టీలు మహా వికాస్ అఘాడీలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. జాతీయ స్థాయిలో కూడా ఈ మూడు పార్టీలు ఇండియా కూటమిలో సభ్యులుగా ఉన్నాయి.