New Labour Codes : అమలులోకి కొత్త లేబర్ కోడ్ లు..కార్మిక సంఘాల తీవ్ర నిరసన

కొత్త లేబర్ కోడ్‌లు అమల్లోకి రావడంతో కార్మిక హక్కులు ప్రమాదంలో పడాయని, ఇవి కార్మిక వర్గంపై చీకటి పరిణామమని ట్రేడ్ యూనియన్లు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి.

New Labour Codes

విధాత, హైదారబాద్ : దేశ వ్యాప్తంగా కార్మికులందరికి సామాజిక భద్రత, న్యాయం అందించే క్రమంలో కేంద్ ప్రభుత్వం కొత్తగా నాలుగు లేబర్ కోడ్ లను శుక్రవారం నుంచి అమల్లోకి తెచ్చింది. అయితే ఈ లేబర్ కోడ్ లు కార్మిక హక్కులను కాలరాసే విధంగా ఉన్నాయంటూ కార్మిక సంఘాలు దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలకు దిగుతున్నాయి. కోట్లాది కార్మిక కుటుంబాల్ని చీకటిపాల్జేసే లేబర్ కోడ్ ల అమలు రోజును..భారత కార్మికవర్గ చరిత్రలో బ్లాక్ ఫ్రైడే గా అభివర్ణించాయి. ఇది పారిశ్రామిక, కార్పొరేట్ వర్గాల చరిత్రలో గుడ్ ఫ్రైడే అంటే కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. కంపెనీల మూసివేత, ఉద్యోగాల కోత, సమ్మె, కనీస వేతనంలో స్పష్టత ఇలా కీలక విషయాల్లో కార్పొరేట్లకు అనుకూల వైఖరిని ప్రదర్శించారని కార్మిక సంఘాలు ధ్వజమెత్తుతున్నాయి.

స్వాతంత్య అనంతరం కార్మికుల కోసం చేసిన అతి పెద్ద సంస్కరణ : ప్రధాని మోదీ

దేశంలో కొత్తగా అమలులోకి తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ లు స్వాతంత్య అనంతరం కార్మికుల కోసం చేసిన అతి పెద్ద సంస్కరణ అని ప్రధాని మోదీ అభివర్ణించారు. ఈ సంస్కరణలతో ఒక బలమైన వ్యవస్థ రూపొందుతుందని.. అది కార్మికుల హక్కులకు రక్షణ కల్పించడమే కాకుండా.. దేశ ఆర్థికవృద్ధికి కొత్త జవసత్వాలనిస్తుందని, అలాగే నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయని, ఉత్పత్తి పెరుగుతుందని, వికసిత్‌ భారత్‌ దిశగా మన యాత్ర వేగవంతంగా సాగుతుందని పేర్కొన్నారు. కొత్త కార్మిక సంస్కరణలు భారత్‌లోని కార్మికులకు మేలు చేస్తాయని, ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’ను మరింత సులభతరం చేస్తాయని మోదీ తెలిపారు.

29చట్టాల స్థానంలో నాలుగు కొత్త కోడ్ లు

కొత్త లేబర్ కోడ్ ల ద్వారా కార్మికులందరికీ కనీస వేతనాలు అమలు చేయడంతో పాటు సకాలంలో వేతనాలు చెల్లిస్తూ ఆర్థిక భద్రత కల్పించనున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సూక మాండవీయ ఓ ప్రకటనలో తెలిపారు. గిగ్ ఫ్లాట్ ఫామ్ వర్కర్లతో సహా కార్మికులందరికీ పీఎఫ్, ఈఎస్ఐ, బీమా సౌకర్యాలు అమల్లోకి రానున్నాయని తెలిపారు. దేశంలో ప్రస్తుతం అమల్లో ఉన్న 29 కార్మిక చట్టాల స్థానంలో రూపొందించిన వేతనాల కోడ్- 2019, పారిశ్రామిక సంబంధాల కోడ్ -2020, సామాజిక భద్రతా కోడ్ -2020, వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం.. పని ప్రదేశాల్లో పరిస్థితుల కోడ్- 2020..ఈ నాలుగు కార్మిక కోడ్ లనును దేశవ్యాప్తంగా ఒకేసారి శుక్రవారం నుంచి అమల్లోకి తీసుకొస్తున్నట్లు ప్రకటాంచారు. వీటిని నోటిఫై చేసినట్లు వెల్లడించారు.

కోడ్ లతో కార్మిక చట్టాలలో వచ్చిన కొత్త మార్పులు

కార్మికులందరికీ ఉద్యోగ నియామకపత్రాలు, గిగ్, ప్లాట్‌ఫాం వర్కర్లతో సహా అందరికీ పీఎఫ్, ఈఎస్‌ఐ, బీమా సామాజిక భద్రత పథకాలు, అన్ని రంగాల్లో పనిచేసే కార్మికులకు కనీస వేతనాలు , 40 ఏళ్లు దాటిన కార్మికులకు వార్షిక ఆరోగ్య పరీక్షల నిర్వహణ, ముందస్తు ఆరోగ్య సంరక్షణ, కార్మికులందరికీ సకాలంలో వేతనాలు చెల్లించడం ద్వారా ఆర్థిక స్థిరత్వం కల్పించడం, దేశవ్యాప్తంగా ఒకే రిజిస్ట్రేషన్, లైసెన్సు, రిటర్నులతో మరింత సులభతరంగా నిర్వహణ వంటి అంశాలతో కార్మికులకు మేలు జరుగుతుందని కేంద్రం పేర్కొంది. కొత్త కోడ్‌లు అమల్లోకి వచ్చినప్పటికీ అవసరమైనప్పుడు ప్రస్తుత కార్మిక చట్టాల్లోని నిబంధనలు కూడా వర్తిస్తాయని కేంద్ర కార్మిక శాఖ తెలిపింది. కాగా, 2015లో దేశంలో సామాజిక భద్రత కవరేజ్‌ 19 శాతం ఉండగా.. 2025 నాటికి ఇది 64 శాతానికి చేరినట్లు వెల్లడించింది. కొత్త కోడ్‌ల అమలుతో కార్మిక అనుకూల వ్యవస్థను ప్రోత్సహించినట్లయిందని పేర్కొంది.

కొత్త కోడ్ లతో కార్మికులకు అందనున్న ప్రయోజనాలు

ఉద్యోగులందరికీ నియామక పత్రాలు తప్పనిసరి. దీంతో ఉద్యోగ భద్రత, పారదర్శకత, స్థిరమైన ఉపాధికి హామీ లభిస్తుంది. గిగ్‌, ప్లాట్‌ఫాం కార్మికులు సహా ఉద్యోగులందరికీ సామాజిక భద్రత (పీఎఫ్‌, ఈఎ్‌సఐసీ, బీమా మొదలైనవి) కల్పించాలి.

ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ఉద్యోగులకు (ఎఫ్‌టీఈ) శాశ్వత ఉద్యోగులతో సమానంగా ప్రయోజనాలు కల్పించాలి. ఎఫ్‌టీఈలు ఐదేళ్లకు బదులు కేవలం ఏడాది సర్వీసు పూర్తిచేస్తే గ్రాట్యుటీకి అర్హులు. ఈకారణంగా ఒప్పంద నియామకాలు తగ్గి.. ప్రత్యక్ష నియామకాలు పెరుగుతాయి. కాంట్రాక్టు కార్మికులకు శాశ్వత ఉద్యోగులతో సమానంగా సామాజిక భద్రత కల్పించబడుతుంది. వీరికి ఉచిత వార్షిక వైద్యపరీక్షలు ఉంటాయి. కార్మికులందరికీ కనీస వేతనం ఇక చట్టబద్ధమైన హక్కు. యజమానులు సకాలంలో వేతనాలు చెల్లించడం తప్పనిసరి. అనధికారికంగా ఎలాంటి కోతలూ విధించకూడదు.

గిగ్, ప్లాట్‌ఫాం వర్కర్లకు ఆధార్‌ అనుసంధాన విశిష్ట గుర్తింపు సంఖ్య లభిస్తుంది. తద్వారా ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లినా సంక్షేమ పథకాలు, సేవలు పొందవచ్చు. అగ్రిగేటర్లు (ఉబెర్‌, ఓలా, స్విగ్గీ వంటి సంస్థలు) తమ వార్షిక టర్నోవర్‌లో 1-2%(కార్మికులకు చెల్లించే మొత్తంలో 5% వరకు) సామాజిక భద్రత నిధికి కేటాయించడం తప్పనిసరి.

గిగ్‌, ప్లాట్‌ఫాం వర్కర్లకు తొలిసారి చట్టంలో నిర్వచనం. గిగ్‌ వర్కర్‌ అంటే సాధారణ, సంప్రదాయ యాజమాన్యాలు ఏర్పాటు చేసే ఆఫీసుల్లో పనిచేసేవారు కాదు. ప్లాట్‌ఫాం వర్కర్‌ అంటే ఆన్‌లైన్‌ వేదికల ద్వారా సేవలందించేవారు. ఆన్‌లైన్‌ అగ్రిగేటర్‌ అంటే.. సేవలందించేవారికి, వినియోగదారులకు మధ్య అనుసంధానకర్త.

టెక్స్‌టైల్‌ రంగంలో పనిచేసే వలస కార్మికులు.. సమాన వేతనాలు, సంక్షేమ పథకాలు, పీడీఎస్‌ పోర్టబిలిటీకి అర్హులు.

మహిళలకు సమానపనికి సమాన వేతనం అందుతుంది. మైనింగ్, భారీ మిషన్లలో పనిచేసేందుకు, రాత్రివేళల్లో విధులు నిర్వహించేందుకు అనుమతి ఉంటుంది. మహిళా ఉద్యోగుల కుటుంబంలో అత్తమామలను చేర్చడం ద్వారా వారికి అన్ని సదుపాయాలు కల్పించాలి. తద్వారా ‘డిపెండెంట్‌ కవరేజ్‌’ పెరుగుతుంది.

సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు, యువ కార్మికులందరికీ కనీస వేతనాలు, నియామకపత్రాలు తప్పనిసరి. నిర్దిష్ట పనిగంటలకు మించితే ఓవర్‌టైమ్‌ జీతాలు చెల్లించాలి. వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయాలి.

బీడీ కార్మికులకు కనీస వేతనాలివ్వాలి. రోజుకి 8-12 గంటల చొప్పున పనిచేయాలి. వారానికి 48 గంటలు మించొద్దు. సాధారణ పని గంటలకు మించి (ఓవర్‌ టైమ్‌) పని చేస్తే రెగ్యులర్‌ వేతనానికి రెట్టింపు చెల్లించాలి. ఏడాదిలో 30 రోజులు పనిచేసినా బోనస్‌కు అర్హులు. సమాన పనికి సమాన వేతనం తప్పనిసరి. ట్రాన్స్‌జెండర్‌ సహా లింగ వివక్ష ఉండరాదు.

40 ఏళ్లు పైబడిన ఉద్యోగులందరికీ యాజమాన్యాలు ఏటా ఉచితంగా వైద్య పరీక్షలు చేయించడం తప్పనిసరి.

ప్లాంటేషన్‌ వర్కర్లు సామాజిక భద్రత కోడ్‌ పరిధిలోకి వస్తారు. కెమికల్స్‌ నిర్వహణపై శిక్షణ అవసరం. కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు ఈఎస్‌ఐ వైద్య సదుపాయాలతో పాటు.. పిల్లలకు విద్యసౌకర్యం తప్పనిసరి.

డిజిటల్, ఆడియో వీడియో వర్కర్లు, ఎలక్ట్రానిక్‌ మీడియాలోని జర్నలిస్టులు, డబ్బింగ్‌ ఆర్టిస్టులు, స్టంట్‌ పర్సన్‌లు ఇక నుంచి పూర్తి సదుపాయాలు పొందుతారు. అందరికీ నియామక పత్రాలివ్వాలి. గడువులోగా జీతాలు చెల్లించాలి. అదనపు పనిగంటలు పనిచేసిన వారికి రెండింతల జీతం చెల్లించాలి.

గని కార్మికులు వారానికి 48 గంటలు పనిచేయాలి. పనిచేసే ప్రాంతం, కొన్ని సందర్భాలకు లోబడి.. కొన్ని ప్రమాదాలను ఉద్యోగ ప్రమాదాలుగా పరిగణిస్తుంది. కార్మికులందరికీ ఆరోగ్యభద్రత తప్పనిసరిగా ఉండాలి.
ప్రమాదకరమైన పరిశ్రమల్లో పనిచేసే వారికి వార్షిక ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలి. పరిశ్రమలోని ప్రతికేంద్రం వద్ద ప్రమాదరకమైన రసాయనాల నిర్వహణ, పనిప్రదేశం భద్రత సమీక్షించేందుకు భద్రత కమిటీ తప్పనిసరి.

జౌళి పరిశ్రమలో కార్మికులు పెండింగ్‌ బకాయిల కోసం మూడేళ్ల పాటు క్లెయిములు చేయవచ్చు. నిర్ణీత పని గంటలకు మించి పనిచేసే వారు రెండింతల ఓవర్‌టైమ్‌ వేతనాలకు అర్హులు.

ఐటీ పరిశ్రమలో పనిచేసే ఉద్యోగులకు ప్రతినెలా ఏడోతేదీ నాటికి వేతనాలు చెల్లించాలి. సమానపనికి సమాన వేతనం ఇవ్వాలి. మహిళలు రాత్రి షిప్టుల్లో పనిచేసేందుకు సదుపాయాలు కల్పించాలి. వేధింపులు, వివక్ష, వేతన సమస్యలను గడువులోగా పరిష్కరించాలి. ఉద్యోగులకు సామాజిక భద్రత పథకాలు, నియామక పత్రాలు జారీ చేయాలి.

డాక్‌ వర్కర్లకు గుర్తింపు, న్యాయరక్షణ లభిస్తుంది. ఒప్పందం, తాత్కాలిక కార్మికులకు పీఎఫ్, పింఛను, బీమా సదుపాయాలివ్వాలి. వార్షిక ఆరోగ్య పరీక్షలతో పాటు కార్మికులకు వైద్య సదుపాయాలు, ప్రాథమిక చికిత్స తదితరాలన్నీ తప్పనిసరి చేయాలి.

జర్నలిస్టులు, ఫ్రీలాన్సర్లు, డబ్బింగ్‌ కళాకారులు, మీడియా వృత్తి నిపుణులు కూడా కార్మిక రక్షణ విధివిధానాల పరిధిలోకి వస్తారు. నియామక పత్రాలు, వేతనాల భద్రత, పనివేళల నియంత్రణ తప్పనిసరి.

ఎగుమతుల రంగంలో పనిచేసే కార్మికులకు గ్రాట్యుటీ, పీఎఫ్‌ లభిస్తాయి. ఏడాదిలో 180 రోజులు పనిచేసిన తరువాత వార్షిక సెలవులకు అర్హులు. సీలింగ్‌ లేకుండా సకాలంలో జీతాలివ్వాలి. మహిళలు ఈరంగంలో రాత్రిపూట పనిచేయవచ్చు. అలాగే వారి భద్రతకు చర్యలు చేపట్టాలి.

కాంట్రాక్ట్‌, వలస కార్మికులకు కూడా సమాన వేతనాలు, సంక్షేమ పథకాలు, ఇతర ప్రయోజనాలన్నీ అందించాలి. కాంట్రా క్ట్‌ సిబ్బందికి యాజమాన్యాలు సామాజిక భద్రత కల్పించాలి. తాగునీరు వంటి కనీస సౌకర్యాలు కల్పించాలి.

కార్మిక హక్కులను కాలరాయనున్న కొత్త లేబర్ కోడ్ లు : పి. ప్రసాద్ (పిపి), ఇఫ్టూ జాతీయ ఉపాధ్యక్షులు

కేంద్ర ప్రభుత్వం కొత్తగా అమలులోకి తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ లు కార్మిక హక్కులను కాలరాసే విధంగా ఉన్నాయని, వీటికి వ్యతిరేకంగా పోరాటాలకు కార్మిక సంఘాలు ఐక్య పోరాటాలకు సిద్దం కావాలని ఇఫ్టూ జాతీయ ఉపాధ్యక్షులు పి. ప్రసాద్ (పిపి) పిలుపునిచ్చారు. దాదాపు యాభై కోట్ల కార్మిక కుటుంబాల జీవితాల్ని చీకటిపాలు చేసే లేబర్ కోడ్స్ అమలు కోసం మోదీ ప్రభుత్వంశుక్రవారం రోజు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పైగా ప్రధాని మోదీ , “ఇది స్వాతంత్య్రం తర్వాత కార్మిక వర్గ ప్రయోజనార్ధం చేపట్టిన సంస్కరణల్లో ఒకటి” అని ఆత్మస్తుతి చేసుకున్నారని ప్రసాద్ విమర్శించారు. ఈ చీకటి చట్టాల అమలు బడా పెట్టుబడిదారీ వర్గాలకు వరం వంటిది. కార్మిక వర్గానికి శాపం వంటిదని మండిపడ్డారు. ఇప్పుడున్న 29 లేబర్ చట్టాలు కల్పిస్తున్న కనీస సౌకర్యాలు, హక్కులను సైతం ఇక అధికారికంగా కాలరాయబడుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.

కార్మిక చట్టాలను చట్టబద్దంగా కాలరాసేందుకు కొత్త చట్టాలు

చట్టబద్ద హక్కుల్ని చట్ట విరుద్దంగా కాలరాసే దశ నుండి ఇక చట్టబద్ధంగా కాలరాసే దశకు మలుపు తిరిగే చీకటి పరిణామం ఇది అని ప్రసాద్ తీవ్రంగా ఆక్షేపించారు. ఆచరణలో పారిశ్రామిక, కార్పొరేట్ వర్గాల దాడికి శ్రామిక, కార్మికవర్గాల్ని బలిపశువు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే అవుతుందన్నారు. ఈరోజు దేశ, విదేశీ కార్పొరేట్ వర్గాలకు “శుభ శుక్రవారం” (గుడ్ ఫ్రైడే) కాగా, శ్రామిక కార్మికవర్గాలకు “చీకటి శుక్రవారం” (బ్లాక్ ఫ్రైడే) గా చరిత్రలో నిలుస్తుందని ప్రసాద్ అభివర్ణించారు. పారిశ్రామిక సంబంధాల కోడ్‌, 2020 ప్రకారం.. 300 మంది వరకు సిబ్బంది లేదా కార్మికులు ఉన్న కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపునకు, కంపెనీల మూసివేతకు ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని, ఇదివరకూ 100 మంది వరకు సిబ్బంది కలిగిన కంపెనీలకే ఈ వెసులుబాటు ఉండేది. దీన్ని ఇప్పుడు 300కు పెంచారని తెలిపారు. అలాగే వేతనాల కోడ్‌, 2019 ప్రకారం.. సంఘటిత, అసంఘటిత రంగంలో పనిచేసే వారికి కనీస వేతనం పొందేందుకు అవసరమైన సూత్రాలను పొందుపరిచినప్పటికీ, ఆ వేతనం ఎంత? అనేదానిపై స్పష్టత ఇవ్వలేదన్నారు. నెలకు రూ. 26 వేలను కనీస వేతనంగా నిర్ణయించాలన్న కార్మిక సంఘాల విజ్ఞప్తులను కేంద్రం పట్టించుకోలేదని విమర్శించారు.

ప్రశ్నించే గొంతుల కట్టడికి కుట్ర

కొత్త రూల్స్‌ ప్రకారం.. సమ్మె చేయాలంటే యూనియన్లు 14 రోజుల ముందుగా నోటీసులు ఇవ్వాల్సి ఉంటుందని.,. ఇది ఆకస్మిక నిరసనలను నియంత్రించడమేనని, ప్రశ్నించే కార్మికుల గొంతుకను నొక్కేయడమేనని ప్రసాద్ మండిపడ్డారు. కొత్తగా తీసుకొచ్చిన లేబర్‌ కోడ్‌లలో డొమెస్టిక్‌ వర్కర్లు, హోమ్‌-బేస్‌డ్‌ వర్కర్లు, వ్యవసాయాధారిత కూలీల గురించి ప్రస్తావించలేదని కార్మిక నేతలు గుర్తు చేస్తున్నారు. ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేసే నిర్మాణరంగ, మైనింగ్‌, బ్లాస్టింగ్‌ రంగాల్లోని కార్మికులను కూడా విస్మరించారని మండిపడుతున్నారు. పని ప్రాంతాల కారణంగా తలెత్తే ఆరోగ్య సమస్యలపై కూడా ఈ కోడ్‌లలో స్పష్టమైన విధివిధానాలు పొందుపరుచలేదని ధ్వజమెత్తారు.

కరోనా కంటే ముందే వేజ్ కోడ్ ని పార్లమెంట్ ఆమోదించిందని, మరో మూడింటిని కరోనాలో ఆమోదించిందని గుర్తు చేశారు. వీటిని వ్యతిరేకిస్తూ గత ఏడు సంవత్సరాల నుండి వరసగా సార్వత్రిక సమ్మెలతో సహా భారత కార్మికవర్గం ఉద్యమిస్తుందని తెలిపారు. కొత్త లేబర్ కోడ్ లలోని కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అన్ని ట్రేడ్ యూనియన్లు పోరాటాలకు సిద్దం కావాలని పిలుపునిచ్చారు.

Latest News