విధాత, హైదరాబాద్ : ఫార్ములా ఈ కారు రేసు(Formula E Race) నిర్వహణలో కేటీఆర్ సహా నిందితులు అంతా నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించి అక్రమాలకు పాల్పడ్డారని ఏసీబీ ప్రభుత్వానికి సమర్పించిన ఫైనల్ నివేదికలో స్పష్టం చేసింది. సెప్టెంబర్ 9న ప్రభుత్వానికి అందించిన నివేదికలో ఈ కేసు విచారణలో సేకరించిన ఆధారాలను వెల్లడించింది. 2024 డిసెంబర్ 19న నమోదైన కేసులో ఏ1గా మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (ktr)ను, ఏ2గా ఐఏఎస్ అధికారి అరవింద కుమార్(Arvind Kumar IAS), ఏ3గా హెచ్ఎండీఏ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ బీ.ఎల్.ఎన్.రెడ్డి, ఏ4గా గోవడ కిరణ్ మల్లేశ్వర్ రావు(ఎష్ నెక్ట్స్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్), ఏ5గా ఏఫ్ఈవో సంస్థ(యూకే)లను ఏసీబీ పేర్కొంది.
ట్రై పార్టీ అగ్రిమెంట్ కు ముందే బీఆర్ఎస్ కు ఎలక్ట్రోరల్ బాండ్ల చెల్లింపులు
ఫార్ములా ఈ కారు కేసు నిర్వహణ పూర్తిగా మాజీ మంత్రి కేటీఆర్ సొంత నిర్ణయం అని, ప్రభుత్వ అనుమతులు లేకుండా రేసు నిర్వహించినట్టు ఏసీబీ తన ఫైనల్ నివేదికలో తెలిపింది. కేటీఆర్ స్వప్రయోజనాల కోసం రేస్ నిర్వహించారని ఆరోపించింది. ఫార్ములా ఈరేస్ వెనుక క్విడ్ ప్రోకో జరిగిందని, బీఆర్ఎస్ రూ. 44 కోట్ల ఎలక్ట్రికల్ బాండ్స్(Electoral Bonds)అందాయని పేర్కొంది. ట్రై పార్టీ అగ్రిమెంట్ కు ముందే బీఆర్ఎస్ కి ఈ బాండ్స్ చెల్లించినట్లు కీలక అంశాలు నివేదించింది. 20222 ఏప్రిల్, అక్టోబర్ నెలలో రెండు విడుతలుగా ఎలక్ట్రోరల్ బాండ్స్ చెల్లింపు జరిగిందని వెల్లడించింది.
అన్ని ఉల్లంఘనలే
ఫార్ములా ఈ కారు రేస్ నిర్వహణలో ఆర్టికల్ 166/1, 299 నిబంధనలు ఉల్లంఘన జరిగిందని ఏసీసీ తన ఫైనల్ నివేదికలో పేర్కొంది. గవర్నర్ సంతకం లేకుండానే రేసు నిర్వహణకు ఐఎఎస్ అరవింద్ కుమార్ అగ్రిమెంట్లకు అనుమతులు మంజూరు చేశారని, సీఎం, సీఎస్, ఆర్థిక మంత్రికి కూడా కూడా సమాచారం ఇవ్వలేదని ఏసీబీ నివేదికలో వెల్లడించింది. కేబినెట్ అనుమతి లేకుండా, ఎన్నికల కోడ్ సమయంలో చెల్లింపులు జరిపి మరిన్ని అక్రమాలకు పాల్పడ్డారని నివేదికలో స్పష్టం చేసింది. ఈ కేసులో విదేశీ సంస్థకు చెల్లింపులపై ఫెరా నిబంధనల ఉల్లంఘన నేపథ్యంలో అటు ఈడీ కూడా విచారణ కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మాజీ మంత్రి కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతినివ్వడంతో ఈ వ్యవహారంలో కేటీఆర్ అరెస్టుపై ఊహగానాలు సాగుతున్నాయి.
