Site icon vidhaatha

సిసోడియాకు వ్యతిరేకంగా స్టేట్‌మెంట్‌ ఇవ్వలేదు : కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో తన సహచరుడు మనీశ్‌ సిసోడియాకు వ్యతిరేకంగా స్టేట్‌మెంట్‌ ఇచ్చాననడాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ బుధవారం ఖండించారు. ‘మనీశ్‌ సిసోడియా నిందితుడని నేను ఎలాంటి స్టేట్‌మెంట్‌ ఇవ్వలేదు. ఆమ్‌ ఆద్మీ పార్టీ, మనీశ్‌ సిసోడియా, నేను దోషులం కాదని మాత్రమే నేను స్టేట్‌మెంట్‌ ఇచ్చాను’ అని సీబీఐ అరెస్టుకు ముందు విచారణ కోర్టుకు చెప్పారు. మమ్మల్ని అప్రదిష్ఠపాలు చేయడమే సీబీఐ ఉద్దేశం. నేను ఎలాంటి స్టేట్‌మెంట్‌లూ ఇవ్వలేదు. వారు ఈ అంశాన్ని సంచలనంగా మార్చుతున్నారు. మొత్తం నిందను మనీశ్‌సిసోడియాపైకి కేజ్రీవాల్‌ నెట్టివేశారని మీడియాలో సంచలన శీర్షికలు ఇవ్వడమే సీబీఐ ఉద్దేశం’ అని కేజ్రీవాల్‌ చెప్పారు. విజయ్‌నాయర్‌ తన కింద పనిచేస్తున్నారని గుర్తించడంలో కేజ్రీవాల్‌ విఫలమైందనందున ఆయనను కస్టడీలోకి తీసుకుని విచారించాల్సి ఉన్నదని అంతకు ముందు సీబీఐ అధికారులు కోర్టుకు చెప్పారు. ఆ సమయంలో ‘సౌరభ్‌ భరద్వాజ్‌, అతిశి మర్లేనాతో విజయ్‌నాయర్‌ పనిచేస్తున్నాడని కేజ్రీవాల్‌ చెప్పారు. మొత్తం బాధ్యతను మనీశ్‌సిసోడియాపైకి సీఎం నెట్టివేస్తూ తనకు ఎక్సయిజ్‌ పాలసీతో ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు’ అని సీబీఐ తరఫున హాజరైన ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ డీపీ సింగ్‌ కోర్టు దృష్టికి తెచ్చిన నేపథ్యంలో కేజ్రీవాల్‌ పై వ్యాఖ్యలు చేశారు.

ఈ విషయంలో భారీ కుట్రను వెలికి తీసేందుకు కేజ్రీవాల్‌ను కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉన్నదని కోర్టుకు సీబీఐ విన్నవించింది. సాక్ష్యాలు, ఈ కేసులో ఇతర వ్యక్తులతో కలిపి కేజ్రీవాల్‌ను విచారించాల్సి ఉన్నదని పేర్కొన్నది. హవాలా మార్గంలో గోవా వెళ్లిన సుమారు 44 కోట్ల రూపాయల జాడను తాము గుర్తించామని, దర్యాప్తు సంస్థ వద్ద ఈ మేరకు ఆధారాలు ఉన్నాయని డీపీ సింగ్‌ తెలిపారు. గోవాలో కేజ్రీవాల్‌ బసకు ఈ సొమ్ము నుంచే చరణ్‌ప్రీత్‌సింగ్‌ చెల్లింపులు జరిపాడని పేర్కొన్నారు. సీబీఐ దాఖలు చేసిన ఈ రిమాండ్‌ పిటిషన్‌ పూర్తిగా ఆధారరహితమని కేజ్రీవాల్‌ తరఫు లాయర్‌ విక్రం చౌదరి అన్నారు. అధికార దుర్వినియోగానికి ఇది పెద్ద ఉదాహరణ అని చెప్పారు.ఢిల్లీ లిక్కర్ కేసులో సీబీఐ కీలక విషయాలు ప్రస్తావించింది. కరోనా రెండో దశలో లిక్కర్ పాలసీని తెచ్చేందుకు ప్రయత్నం చేసింది, ఎక్సైజ్ పాలసీని త్వరగా రూపొందించాలని అడిషనల్ సెక్రటరీని కేజ్రీవాల్ ఆదేశించారని సీబీఐ ఆరోపించింది. కేబినెట్ సమావేశాల్లో త్వరగా లిక్కర్ పాలసీపై నిర్ణయం తీసుకోవాలని కేజ్రీవాల్ ఆదేశించారని పేర్కోంది. సౌత్ గ్రూప్ నుంచి కేజ్రీవాల్‌ను కాంటాక్ట్ చేశారని, ప్రత్యేక చార్టర్ ఫ్లైట్‌లో హైదరాబాద్ నుంచి సౌత్ సభ్యులు గోరంట్ల బుచ్చిబాబు, అభిషేక్ బోయినపల్లి, అరుణ్ రామచంద్ర పిళ్లైలు కలిసి ఢిల్లీకి వచ్చారని సీబీఐ పేర్కోంది.

Exit mobile version